ఆగని కరోనా ఉధృతి.. ప్రపంచ వ్యాప్తంగా 37 లక్షలు దాటిన కేసులు

by vinod kumar |   ( Updated:2020-05-06 09:14:43.0  )
ఆగని కరోనా ఉధృతి.. ప్రపంచ వ్యాప్తంగా 37 లక్షలు దాటిన కేసులు
X

వాషింగ్టన్/మాడ్రిడ్: ప్రపంచవ్యాప్తంగా కరోనా వైరస్ వేగంగా వ్యాపిస్తోంది. కొన్ని రోజులు నెమ్మదించినట్లు కనిపించినా.. ఆ తర్వాత తన ప్రతాపాన్ని చూపిస్తోంది. దీంతో రోజురోజుకూ కరోనా పాజిటివ్ కేసులు నమోదవుతూనే ఉన్నాయి. బుధవారం రాత్రి 8 గంటల సమయానికి ప్రపంచవ్యాప్తంగా కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 37 లక్షలు దాటిపోయింది. ‘వరల్డ్ మీటర్స్ ‘ వెబ్‌సైట్ ప్రకారం 37,57,469 కేసులు నమోదయ్యాయి. చైనా నుంచి వ్యాపించిన ఈ వైరస్ యూరోప్ తర్వాత అత్యధికంగా అమెరికా, రష్యా, బ్రెజిల్ దేశాల్లో ఇప్పుడు ఉధృతంగా ఉంది. ఇప్పటి వరకు 2,59,496 మంది చనిపోగా.. బుధవారం ఒక్కరోజే కరోనా కారణంగా 1469 మరణాలు సంభవించాయి. అమెరికాలో మొత్తం 12,39,847 కరోనా పాజిటివ్‌లు నమోదవ్వగా.. వీటిలో 2214 కొత్త కేసులు. గడచిన 24 గంటల్లో అగ్రరాజ్యంలో 110 మంది మృత్యువాతపడ్డారు. ఇక యూరోప్‌లోని స్పెయిన్ దేశంలో కరోనా కబలిస్తోంది. అక్కడ 2,53,682 కేసులు ఉండగా కొత్తగా 3121 కేసులు నమోదవ్వడం గమనార్హం. మరోవైపు పలు ఆసుపత్రుల్లో చికిత్స పొందుతూ 224 మంది మరణించారు. స్పెయిన్‌లో మొత్తంగా 25,100 మంది చనిపోయారు. గతంలో యూరోప్ కరోనా కేంద్రంగా ఉన్న ఇటలీలో మాత్రం పాజిటివ్ కేసులు గణనీయంగా తగ్గిపోయాయి. ఇప్పటి వరకు ఇటలీలో మొత్తం 2,09,328 కేసులు నమోదయ్యాయి. బుధవారం ఎవరూ చనిపోలేదు. అలాగే ఒక్క కేసూ నమోదు కాలేదు. మొత్తంగా ఇటలీలో ఇప్పటి వరకు 28,710 మంది చనిపోయారు.

Tags: World, Coronavirus, Death Meter, Europe, America, Brazil, Covid 19

Advertisement

Next Story

Most Viewed