దేశంలో 153 కరోనా కేసులు

by sudharani |
దేశంలో 153 కరోనా కేసులు
X

దిశ, వెబ్‌డెస్క్: దేశంలో కరోనావైరస్ సోకినవారి సంఖ్య బుధవారానికి 153కు చేరింది. దేశవ్యాప్తంగా బుధవారం కొత్తగా 12 కోవిడ్ 19 పాజిటివ్ కేసులు తేలాయి. ఇందులో 25 మంది విదేశీయులున్నారు. మనదేశంలో ఇప్పటి వరకు ఈ వైరస్ బారిన పడి ముగ్గురు మృతి చెందారు. కరోనావైరస్ కేసులు పెరుగుతుండగా.. బాధితులకు దగ్గరగా మెలిగిన(కాంటాక్ట్) 5,700మందిపై గట్టి నిఘా వేసినట్టు ప్రభుత్వం తెలిపింది. కర్ణాటకలో రెండు కొత్త కేసులు, నోయిడాలో మరొక కేసు తాజాగా నమోదైంది. లండన్‌ నుంచి తెలంగాణకు చేరిన వ్యక్తికి కరోనా పాజిటివ్ తేలింది. దీంతో తెలంగాణలో కరోనా కేసులు సంఖ్య ఆరుకు చేరింది. మహారాష్ట్రలో 42 మంది, కేరళలో 27 మంది, ఢిల్లీలో 10 మంది, యూపీలో 16 మంది, కర్ణాటకలో 13 మంది, హర్యానాలో 16 మందికి ఈ వైరస్ సోకింది.

ఇరాన్‌లో 255 మంది భారతీయులకు..

ఇరాన్‌లోని 255 మంది కోవిడ్ 19 బారిన పడినట్టు కేంద్రం వెల్లడించింది. విదేశాల్లో మొత్తంగా 276 మంది భారతీయులకు కరోనావైరస్ సోకినట్టు కేంద్ర విదేశాంగ మంత్రిత్వ శాఖ లోక్‌సభలో వెల్లడించింది. ఇరాన్‌లో 255 మంది భారతీయులకు, యూఏఈలో 12మందికి, ఇటలీలో ఐదుగురితోపాటు హాంకాంగ్, కువైట్, రువాండా, శ్రీలంకలో ఒకరి చొప్పున ఈ వైరస్ సోకిందని తెలిపింది.

ప్రపంచవ్యాప్తంగా 8,400 మంది మృతి

ప్రపంచవ్యాప్తంగా 1,98,300 మంది కరోనావైరస్ బారినపడినట్టు రాయిటర్స్ వివరించింది. కాగా, 8,419 మంది ఈ వైరస్‌ కారణంగా మరణించారని పేర్కొంది. అలాగే, ఈ వైరస్ చైనా కాకుండా 164 దేశాలకు విస్తరించినట్టు వివరించింది.

ఏకాంతవాసంలో కేంద్ర మంత్రి..

కేంద్రమంత్రి సురేష్ ప్రభు ముందు జాగ్రత్తగా స్వచ్ఛందంగా ఏకాంతవాసంలోకి వెళ్లారు. జీ20 షెర్పా సమావేశాల్లో పాల్గొనేందుకు సౌదీ అరేబియా వెళ్లిన సురేష్ ప్రభుకు కరోనావైరస్ పరీక్షలు జరిపారు. ఇందులో నెగెటివ్ వచ్చినప్పటికీ.. ముందు జాగ్రత్తగా ఈ 14 రోజులు క్వారంటైన్‌లో ఉండేందుకు ఆయన నిర్ణయించుకున్నారు.

tags : coronavirus, india, death toll, infected, covid 19

Advertisement

Next Story

Most Viewed