తెలంగాణనూ కరోనా వణికిస్తోంది

by Shyam |

చైనాలో వందల సంఖ్యలో ప్రాణాలను బలిగొంటూ.. ప్రపంచ దేశాలకు పాకి వణికిస్తున్న ప్రాణాంతక కరోనా వైరస్ భయం తెలంగాణనూ భయపెడుతోంది. ముఖ్యంగా హైదరాబాద్‌లో ఈ భయం మరింత ఎక్కువగా ఉన్నది. నిత్యం రద్దీగా ఉండే బస్సుల్లో రావాలంటేనే జనం జంకుతున్నారు. సాధారణంగా ఇప్పటివరకు రాష్ట్రంలో ఒక్క పాజిటివ్ కేసూ నమోదు కానప్పటికీ, సామాజిక మాద్యమాల్లో కరోనాపై వస్తున్న పుకార్లతో ప్రజలు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. తుమ్మినా, దగ్గినా, సాధారణ జ్వరం వచ్చినా భయంతో ఆస్పత్రులకు పరుగులు పెడుతున్నారు. ఈ నేపథ్యంలో తెలంగాణలో ఈ వ్యాధికి సంబంధించి ప్రస్తుత పరిస్థితేంటన్నది ఓ సారి పరిశీలిద్దాం..

రాష్ట్రంలో ఇప్పటివరకు 70 అనుమానిత కేసులు నమోదవ్వగా, 62 కేసుల్లో నెగటివ్‌ వచ్చింది. మరో 8 మందికి సంబంధించిన రిపోర్టులు ఇంకా రావాల్సి ఉంది. రోగుల రద్దీని దృష్టిలో పెట్టకుని గాంధీ ఆస్పత్రిలో 10 పడకల సామర్థ్యంతో అదనంగా మరో ప్రత్యేక వార్డును ఏర్పాటు చేసేందుకు సిద్ధమవుతున్నారు. కాగా, కరోనా అనుమానంతో ఆస్పత్రిలో చేరిన వారిలో ఐదుగురికి స్వైన్ ఫ్లూ సోకినట్టు నిర్ధారణ అయ్యింది. సికింద్రాబాద్‌ గాంధీ ఆస్పత్రిలో వీరు చికిత్స పొందుతున్నారు. స్వైన్ వచ్చిన వారిలో కూకట్‌పల్లి కేపీహెచ్‌బీ కాలనీ, చాంద్రాయణగుట్ట, నల్లగొండ జిల్లా త్రిపురారం, మహబూబ్‌నగర్‌ జిల్లా హేండ్‌వాడ, ఫతేనగర్‌ ప్రాంతాలకు చెందిన వారున్నట్టు వైద్యులు తెలిపారు. అలాగే, మరో ముగ్గురు స్వైన్‌ఫ్లూ అనుమానితులకు గాంధీ ఆస్పత్రి డిజాస్టర్, పీఐసీయులో అడ్మిట్‌ చేసి వైద్యసేవలు అందిస్తున్నారు. ఈ ఏడాదిలో ఇప్పటివరకు గాంధీ ఆస్పత్రిలో 10స్వైన్ ఫ్లూ కేసులు నమోదైనట్టు వైద్యులు వెల్లడించారు.

కరోనా జన్మస్థలమైన చైనా, ప్రభావిత దేశాలైన హాంకాంగ్‌, సింగపూర్‌, మలేషియా వంటి ప్రాంతాల నుంచి ఇటీవల స్వదేశానికి తిరిగి వచ్చిన వారిలో ఎలాంటి అనారోగ్య సమస్య వచ్చినా అది కరోనానేమో అని తీవ్ర భయాందోళనలకు గురవుతున్నారు. అయితే, రెండు రోజులుగా వాతావరణంలో మార్పులు చోటుచేసుకుంటున్నాయి. దీంతో జలుబు, జ్వరం వంటి చిన్నపాటి అనారోగ్య సమస్యలు రావడం సహజమే అయినప్పటికీ, కరోనా లక్షణాలూ ఇవే కావడంతో ప్రజలు ఆందోళన చెందుతున్నారు. ఇలాంటి లక్షణాలు కనిపిస్తే, ఆందోళన చెందుకుండా వైద్యపరీక్షలు చేసుకోవాలని వైద్యులు కూడా సూచిస్తున్నారు.

సాధారణ జ్వరం 4 లేదా 5 రోజుల్లో తగ్గుతుందనీ, అలా తగ్గని పక్షంలో ఈ పరీక్షలు చేసుకోవాలని వైద్యులు హెచ్చరిస్తున్నారు. జ్వరం, జలుబు, దగ్గు వంటి సమస్యలతో బాధపడుతున్న వారు కలివిడిగా ఉండకూడదనీ, ఇంట్లోనే ఉంటే మంచిదని చెబుతున్నారు. తుమ్మినా, దగ్గినా రుమాలు అడ్డుపెట్టుకోవాలనీ, చేతులు, కాళ్లను సబ్బుతో శుభ్రంగా కడుక్కోవాలని సూచిస్తున్నారు. ఇప్పటికే గాంధీ ఆస్పత్రిలో కరోనా చికిత్స కోసం ప్రత్యేక వార్డులను ఏర్పాటు చేయగా, తాజాగా ఉస్మానియా ఆస్పత్రిలోనూ సిద్ధం చేశారు. ప్రస్తుతం కరోనా అనుమానితులను గాంధీ, ఫీవర్ ఆస్పత్రులలోనే వైద్యులు, నర్సుల పర్యవేక్షణలో ఉంచుతున్నారు. ఆరుగురు వైద్యుల బృందం అనుమానిత కేసులను పర్యవేక్షిస్తున్నది.

రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్ స్పందిస్తూ.. హైదరాబాద్‌లో కరోనా వైరస్ కేసు నమోదైందని వస్తున్న పుకార్లను కొట్టిపారేశారు. ఇప్పటివరకు రాష్ట్రంలో ఒక్క పాజిటివ్‌ కేసు కూడా నమోదు కాలేదని స్పష్టం చేశారు. అంతేకాకుండా, తెలంగాణలో కరోనా వైరస్‌పై పత్రికలు, ఎలక్ట్రానిక్ మీడియా సంయమనం పాటించాలని విజ్ఞప్తి చేశారు. ప్రజలు ఎవరూ ఆందోళనలకు గురికావద్దనీ, కరోనా వ్యాప్తిని నివారించేందుకు ప్రత్యేక చర్యలు తీసుకున్నామని వెల్లడించారు.

Advertisement

Next Story

Most Viewed