వారాంతం..మార్కెట్లపై కరోనా పంతం!

by Harish |   ( Updated:2020-02-28 06:30:42.0  )
వారాంతం..మార్కెట్లపై కరోనా పంతం!
X

దిశ, వెబ్‌డెస్క్ : కరోనా వ్యాప్తితో దేశీయ మార్కెట్లు వరుసగా ఆరు రోజులూ నష్టాల్లోనే కొనసాగాయి. వారాంతం చివరి గంటలో మార్పులుండొచ్చనే అంచనాలను తలకిందులు చేస్తూ శుక్రవారం కూడా మార్కెట్లు భారీ పతనాలను చూశాయి. 46 దేశాల్లో కరోనా భయాలు వ్యాపించడంతో యూఎస్ మార్కెట్లు 9 ఏళ్ల కనిష్ఠానికి పడిపోయాయి. అంతర్జాతీయ మార్కెట్ల ప్రభావంతో దేశీయ మార్కెట్లు భారీగా కుప్పకూలాయి. గడిచిన దశాబ్ద కాలంలో ఈ స్థాయిలో పతనమవడం ఇదే తొలిసారని విశ్లేషకులు చెబుతున్నారు.

పలు కీలక పరిణామాలు దేశీయ మార్కెట్ల పతనానికి కారణమయ్యాయి. ప్రభుత్వం 2019 డిసెంబర్‌తో ముగిసే మూడో త్రైమాసిక జీడీపీ వివరాలు శుక్రవారం సాయంత్రం వెలువడనున్న నేపథ్యంలో మార్కెట్లలో భయాలు మరింత పెరిగాయి. ఇదివరకే 4.7 శాతం అంచనా ఉన్నప్పటికీ, గతం కంటే ఈసారి తగ్గితే మార్కెట్లకు మరింత నష్టం తప్పదని భావిస్తున్నారు. ఇండియా వృద్ధి శాతం భారత్ వీఐఎక్స్ ఇండెక్స్‌లో 15 శాతం సాధించడం మదుపర్లలో ఆందోళనను పెంచింది. మార్కెట్లోని స్మాల్ క్యాప్, మిడ్‌క్యాప్ సూచీల్లో 2.5 శాతం తగ్గడంతో అమ్మకాల ఒత్తిడి అధికంగా ఉంది.

చైనాలో కొత్త కరోనా కేసులు నమోదవడం తగ్గే సమయంలో అంతర్జాతీయంగా 46 దేశాల్లో కరోనా కేసులు నమోదవడం పెట్టుబడిదారుల్లో ఆందోళనను మరింత పెంచింది. కరోనా గురయ్యే వారి సంఖ్య 80 వేలకు పైగా నమోదై లక్షకు చేరుకుంటోంది. ప్రపంచ ఆరోగ్య సంస్థ చీఫ్, తాము నిర్ణయం తీసుకునే సమయం వచ్చిందని, అంతర్జాతీయ దేశాలు కలిసి స్పందించి కరోనా వైరస్‌ను అరికట్టలని, ప్రజలు దీని బారిన పడకుండా ప్రభుత్వాలు కాపాడాలని డబ్ల్యూహెచ్‌వో వెల్లడించింది. ఇక ఈ వైరస్ అంతర్జాతీయ మాంద్యానికి బీజంగా పరిణమించే ఆస్కారముందని మూడీస్ సంస్థ హెచ్చరించింది.

ఇంట్రాడే ఏకంగా 1448.37 పాయింట్ల నష్టంతో 38,297 వద్ద ముగిసింది. నిఫ్టీ సైతం భారీగా 414.10 పాయింట్లను కోల్పోయి 11,219 వద్ద క్లోజయ్యింది. భారీ పతనం కారణంగా మార్కెట్లు నిమిషాల వ్యవధిలోనే రూ. 5 లక్షల కోట్ల మదుపర్ల సంపద ఆవిరైపోయింది. దీంతో మొత్తం మార్కెట్ మూలధనం రూ. 147.12 లక్షల కోట్లకు దిగజారింది. ఈ వారంలో వరుస ఆరు రోజుల నష్టాల కారణంగా మార్కెట్లో మదుపర్ల సంపద రూ. 10.67 లక్షల కోట్లు తుడిచిపెట్టుకుపోయింది. ఇండెక్స్‌లోని అన్ని రంగాలు కుదేలయ్యాయి. నిఫ్టీలో మీడియా, బ్యాంకింగ్, మెటల్, ఫార్మా, ఐటీ, రియల్టీ రంగాలు భారీగా కుప్పకూలాయి. నిఫ్టీ 50లో ఐవోసీఎల్, మారుతీ సుజుకీ మినిహాయించి అన్ని సూచీలూ భారీ పతనాలను చవిచూశాయి. సెన్సెక్స్‌లో టెక్ మహీంద్రా అత్యధికంగా 8.14 శాతం నష్టపోయింది. టాటా స్టీల్, మహీంద్రా అండ్ మహీంద్ర, హెచ్‌సీఎల్, బజాజ్ ఫినాన్స్, ఇన్ఫోసిస్, ఎస్‌బీఐ, యాక్సిస్ బ్యాంక్ 5 శాతానికి పైగా నష్టాలను మూటగట్టుకున్నాయి. ఇక యూఎస్ డాలర్‌తో పోలిస్తే రూపాయి మారకం విలువ ఆరు నెలల కనిష్ఠానికి చేరుకుని 33 పైసలు బలహీనపడి రూ. 71.94 వద్ద ఉంది.

Advertisement

Next Story