మీరు ఎక్కడ ఉంటే అక్కడే.. వ్యవసాయ క్షేత్రాల్లో వైద్య సిబ్బంది మకాం

by Shyam |   ( Updated:2021-10-03 06:03:00.0  )
Corona vaccine
X

దిశ, తుంగతుర్తి : కరోనా వ్యాక్సిన్ పట్ల గ్రామీణ ప్రజలు ఇంకా అపోహలను వీడడం లేదు. ప్రతి గ్రామంలో ఆరోగ్య సిబ్బంది క్యాంపులు పెట్టి టీకాలు వేస్తున్నా.. వేసుకోవడానికి ముందుకు రావడం లేదు. అయినా వైద్య సిబ్బంది వారిని వదలడం లేదు. మీరు ఎక్కడికి వెళ్లినా వదలం అంటూ గ్రామస్తులు ఎక్కడ ఉంటే అక్కడికి వెళ్లి వ్యాక్సిన్ ఇస్తున్నారు. టీకాపై వారికి అవగాహన కల్పిస్తున్నారు. రెండు డోసులు వేసుకునేలా చైతన్యం చేస్తున్నారు.

Health Officers

సూర్యాపేట జిల్లా తుంగతుర్తి మండలంలో వైద్య సిబ్బంది ప్రజల చెంతకే టీకా అంటూ చెట్లు, చేమలు, వ్యవసాయ భూముల్లోకి వెళ్తున్నారు. ఇప్పటి వరకు ఇంటింటికీ తిరిగి వ్యాక్సిన్ ఇచ్చిన సిబ్బంది తాజాగా పొలం గట్లు, ముళ్ల కంపల్లో సైతం నడుచుకుంటూ వెళ్తూ వ్యవసాయ కూలీలు, రైతులకు టీకాలు వేస్తున్నారు. వాహనాలు వెళ్లలేని స్థితిలో ఉన్నా.. కాలినడకన కిలో మీటర్ల మేర ప్రయాణించి అందరికీ కరోనా వ్యాక్సిన్ అందిస్తూ తమ విధి నిర్వహణను చాటుకుంటున్నారు. ఆదివారం తుంగతుర్తి మండలంలోని కొత్తగూడెం, అన్నారం, సంగెం, వెలుగుపల్లి, రాజన్నతండా, గుడితండా, కొత్తతండా తదితర గ్రామాల్లో వైద్య సిబ్బంది వ్యవసాయ పొలాలు, చెలకల్లో తిరిగి టీకాలు వేశారు. వైద్య సిబ్బంది కృషి, సేవలను ప్రజలు ప్రశంసిస్తున్నారు.

Advertisement

Next Story

Most Viewed