- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- OTT Release
అటు కరోనా.. ఇటు ఫ్యాషన్
కరోనా కారణంగా మానవ జీవితంలో మాస్క్ ఒక భాగమైపోయింది. అయితే తమ అందమైన రూపానికి ఈ మాస్క్ ఓ అడ్డంకిగా మారిందని ఫ్యాషన్ ప్రియులు ఇబ్బంది పడుతున్నారు. కానీ ఫ్యాషన్ కంటే ప్రాణాలు ముఖ్యం కాబట్టి ఓ వైపు మాస్క్ ధరిస్తూ.. కరోనా వైరస్‌ను అడ్డుకుంటూనే మరోవైపు తమ ఫ్యాషన్ అభిరుచిని చూపించుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఈ క్రమంలోనే ఇప్పుడు ఫ్యాషన్ మాస్క్‌లు, మ్యాచింగ్ మాస్క్‌లు, ఫోటో మాస్క్‌లు ట్రెండ్ అవుతున్నాయి. ఆరోగ్యంతో పాటు అందాన్ని కూడా రెట్టింపు చేసే ఈ మాస్క్‌లు ధరించి నలుగురిలో నారాయణలా కాకుండా ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నారు.
ఫ్యాషన్ కన్నా ఆరోగ్యం మిన్న
ఈ రకం మాస్కుల్లో ఆరోగ్యానికి పెద్ద పీట వేస్తారు. వీటిలో డిజైన్లు, రంగులంటూ ఉండవు. అత్యాధునిక ఫిల్లర్లను కలిగి ఉండి, ధరించినవాళ్లు డాక్టర్లా లేదా శాస్త్రవేత్తలా? అనిపించేటట్లుగా ఉంటాయి. ఈ మాస్క్‌లు ధరించిన వారిని చూడగానే రేడియోధార్మికత అధికంగా ఉన్న ప్రాంతం నుంచి తిరిగొచ్చిన వారిలాగా అనిపిస్తారు. ఆరోగ్యం గురించి పట్టింపు ఎక్కువగా ఉన్నవాళ్లు, అలెర్జీలు కలిగి ఉండి సులభంగా జబ్బు పడేవాళ్లు, ఓసీడీ ఉన్నవాళ్లు ఎక్కువగా ఇలాంటి మాస్క్‌లు ధరించడానికి ఆసక్తి చూపుతారు.
ఆరోగ్యంతో పాటు ఫ్యాషన్ కూడా
అందరూ ధరించే మాస్క్‌ల వల్ల కొద్దిగా కళ తప్పినట్లు అనిపించినవాళ్లు.. వాటికి కొద్దిగా ఫ్యాషన్ జోడిస్తున్నారు. తాము వేసుకున్న డ్రెస్ రంగుకు మ్యాచ్ అయ్యేలా అదే రంగు మాస్క్ ధరిస్తున్నారు. అంతేకాకుండా ఆ మాస్క్‌ల మీద వివిధ డిజైన్లు, నాణ్యత గల వస్త్రంతో పాటు అంచులకు భారీ ఎంబ్రాయిడరీ ఉన్న మాస్క్‌లు ధరించి వాళ్ల ఫ్యాషన్ అభిరుచిని తెలిసేలా చేస్తున్నారు. వీటితో పాటు మాస్క్‌లకు యాక్సెసరీస్ జోడిస్తున్న వాళ్లు కూడా ఉన్నారు. ఒకప్పుడు మీ డ్రెస్ బాగుంది, మీ చీర బాగుంది అని అన్నవాళ్లు ఇప్పుడు ఈ మాస్క్‌లను ధరించిన వాళ్లను చూడగానే మీ మాస్క్ బాగుంది అనకుండా ఉండలేరు.
వెరైటీ వీరులు
అన్నిట్లో కొత్తదనాన్ని కోరుకునేవారు వెరైటీ మాస్క్‌లను తయారు చేస్తున్నారు. ఇప్పటివరకు మాస్క్ తప్పనిసరి చేయడంతో ఆకులతో, ప్లాస్టిక్ డబ్బాలతో ఇంకా అందుబాటులో ఉన్న ఇతర వస్తువులతో ఇంట్లోనే మాస్క్‌లు తయారుచేసుకుని తమ వినూత్న ఐడియాలను ప్రపంచానికి పరిచయం చేశారు. అయితే అలాంటి మాస్క్‌లను ధరించి బయటికి వెళ్లడం కాస్త ఇబ్బందిగానే ఉంటుంది. అందుకే కాస్త వెరైటీగా కనిపించే ఫోటో మాస్క్‌ల ట్రెండ్ మొదలైంది. మాస్క్ ధరించిన వ్యక్తిని గుర్తుపట్టడం కాస్త కష్టమే. ఈ నేపథ్యంలో ఎటువంటి ఇబ్బంది లేకుండా ఫోటో మాస్క్‌లు ఉపయోగపడతాయి. ఇందులో ముఖాన్ని.. మాస్క్ తయారు చేసే వస్త్రం మీద ప్రింట్ చేసి, ధరించినపుడు మాస్క్ కవర్ చేసే భాగాన్ని కత్తిరించాలి. ఆ భాగాన్ని తర్వాత మాస్క్‌గా మార్చుకుంటే సరి!