- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
కషాయంతో కష్టం గట్టెక్కేనా?
ఓ వైపు పెద్ద పెద్ద ఫార్మా కంపెనీలు కరోనాకు మందు కనిపెట్టడానికి రాత్రింబగళ్లు కష్టపడుతున్నాయి. వాటిలో కొన్ని మందులు ఇప్పటికే మనుషులపై ట్రయల్స్ వరకు వచ్చినట్లు వార్తలు వస్తున్నాయి. అయితే ఒకవేళ మందు, వ్యాక్సిన్‌లు బయటికి వచ్చినా, సాధారణ మానవుడి వరకూ చేరతాయా లేదా అనేది ప్రశ్నార్థకంగా మారింది. ఈ కొవిడ్ మహమ్మారి సమస్యకు భారతీయులు ప్రాచీనకాలం నుంచి పాటిస్తున్న ఆయుర్వేదంలో మందు ఉందని ప్రచారం సాగుతోంది. ఈ ప్రచారంలో భాగంగా కరోనా కషాయం అనేది ఇప్పుడు హల్‌చల్ చేస్తోంది. ఈ ప్రచారాలకు తోడుగా ఆయుష్ మంత్రిత్వ శాఖ కూడా నిర్ధారిస్తూ ప్రకటన కూడా విడుదల చేసింది. దీంతో ఈ కరోనా కషాయానికి ఫుల్ డిమాండ్ పెరిగింది. ఎంతలా అంటే దాని తయారీ విధానాలు, వాడే పద్ధతులు ఇప్పుడు ఇంటర్నెట్‌లో హాట్ టాపిక్‌గా మారాయంటే అర్థం చేసుకోవచ్చు.
కరోనా కషాయం తయారీకి సంబంధించి ఒక విధానం బాగా వైరల్ అవుతోంది. ఇది కరోనాను తగ్గించే మందు కాదు. కేవలం మీ ఇమ్యూనిటీని అంటే వ్యాధినిరోధక శక్తిని మాత్రం మెరుగుపరచగలదు. అందుకే ఈ కషాయాన్ని తయారుచేసుకుని తాగడం తప్పు అని చెప్పలేం, అలాగని వంద శాతం కరక్టేనని కూడా చెప్పలేం. ఎలాగూ ఇంట్లోనే ఉంటున్నారు కాబట్టి కషాయాన్ని తయారుచేసుకుని తాగి అంతో ఇంతో ఇమ్యూనిటీ పెంచుకుందామని అందరూ అనుకుంటున్నారు. దీన్ని తయారుచేయడం చాలా సులభం. ఒక టేబుల్ స్పూన్ పసుపు, రెండు లవంగాలు, 1 నిమ్మకాయ (తొక్క సహా), తోలు తీసిన అల్లం వీటన్నింటినీ కలిపి ఒక లీటర్ నీటిలో మరగబెట్టాలి. లీటర్ నీళ్లు కాస్త అరలీటర్ అయ్యే వరకు సన్నమంట మీద మరగనివ్వాలి. అంతే కరోనా కషాయం రెడీ.
మరొక్కసారి గుర్తుచేసుకోవాల్సిన విషయం ఏంటంటే..ఇది కరోనాకు మందు కాదు. కేవలం వ్యాధినిరోధకతను పెంచే ఒక హెర్బల్ టీ లాంటిది మాత్రమే. ఇది కొవిడ్‌ను పూర్తిగా తగ్గిస్తుందని ఏ డాక్టర్ అధికారికంగా ప్రకటించలేదు. అలాగని తాగడం మంచిది కాదు అని చెప్పడం లేదు. ఎలాగూ ఇది జలుబు, దగ్గు వచ్చే సీజన్ కాబట్టి ఇది కషాయం తాగడం వల్ల సాధారణ జలుబు రోగాల నుంచి కూడా ఉపశమనం దొరుకుతుంది. ఒకవేళ వారం రోజులకు ఉపశమనం దొరకకుంటే వెంటనే డాక్టర్‌ను సంప్రదించి కరోనా టెస్ట్ చేయించుకోండి. అంతేకానీ అతిగా కషాయం తాగడం వల్ల ప్రయోజనం ఉండదని గుర్తుంచుకోండి.
జనాల్లో పెరుగుతున్న కరోనా స్టిగ్మా వల్ల ఈ కషాయానికి ఇంత పేరు వస్తోందని నిపుణులు అంటున్నారు. అయితే, ఈ కరోనా కషాయం తయారీ, దాని ఉపయోగాల గురించి వాట్సాప్ ఫార్వర్డ్ మెసేజ్‌లు బాగా వైరల్ అవుతున్నాయి. అలాంటి మెసేజ్‌లు ఫార్వర్డ్ చేయడానికి ఎప్పుడూ సిద్ధంగా ఉండే వాట్సాప్ అంకుల్స్ ఇప్పుడు పండుగ చేసుకుంటున్నారు. అంతేకాదు..ఇంట్లోనే కరోనా కషాయం చేయించి, పిల్లలతో దగ్గరుండి మూడు పూటలా తాగిస్తున్నారు. మంచి ఆరోగ్యం కోసం రోజూ పొద్దున్నే జాగింగ్ వెళ్లాలని డాక్టర్లు ఎన్నిసార్లు చెప్పినా పట్టించుకోని వాట్సాప్ అంకుల్స్, ఇప్పుడు కరోనా కషాయాన్ని తయారు చేసుకోవడానికి పొద్దున్నే ఐదు గంటలకే నిద్రలేచి తాగుతున్నారు.
కరోనా కషాయంలో ఉన్న పసుపు వల్ల వ్యాధినిరోధక శక్తి పెరుగుతుంది. అలాగే అల్లం, లవంగాలు కూడా వైరల్ ఇన్ఫెక్షన్లను తగ్గించడంలో సహాయపడతాయి. సాధారణ జలుబు, దగ్గు విషయంలో ఇవి చాలా ప్రభావవంతంగా పనిచేస్తాయి. కానీ, కరోనా విషయంలో ఆ క్లారిటీ లేదు. అయితే ప్రయోజనాలు మాత్రం ఉన్నాయి. కాబట్టి కరోనా పాయింట్ ఆఫ్ వ్యూలో కాకుండా వ్యాధినిరోధక శక్తి కోసం ఈ కషాయం తాగడంలో ఎలాంటి తప్పు లేదు. ఎలాగూ కషాయం మూడు పూటలా తాగుతున్నాం కదా అని, మాస్కు అక్కర్లేదు, భౌతిక దూరం అవసరం లేదు, ఎలా పడితే అలా తిరగొచ్చు అనే మొండి ధైర్యం పెట్టుకుంటే మాత్రం తప్పులో కాలేసినట్లే. ఎంత కషాయం తాగినా లక్షణాలు కనిపించగానే టెస్టు చేయించుకోవడం మంచిది. ఈ కషాయం తాగిన తర్వాత కరోనా దరికిచేరదు అనే మానసిక స్థైర్యం పెంచుకోవడం తప్పు లేదు. కానీ, అతిగా పెంచుకుంటే మొదటికే మోసం వస్తుంది. కాబట్టి కషాయం తాగినా తాగకున్నా జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది.