ఇద్దరు నర్సులకు అందిన బీమా పరిహారం

by srinivas |
ఇద్దరు నర్సులకు అందిన బీమా పరిహారం
X

దిశ, న్యూస్‌బ్యూరో: కరోనా పేషెంట్లకు చికిత్స చేస్తూ వైరస్ ఇన్‌ఫెక్షన్‌కు గురై మృతిచెందిన ఇద్దరు నర్సులకు కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన రూ.50లక్షల బీమా పరిహారం అందింది. హైదరాబాద్‌లోని ఛెస్ట్ ఆసుపత్రిలో సీనియర్ నర్సుగా పనిచేస్తూ పదవీ విరమణకు వారం రోజుల ముందు కరోనా వైరస్‌కు బలైన విక్టోరియా జయమణికి రూ.50లక్షల బీమా పరిహారం నామినీ బ్యాంకు ఖాతాలో జమ అయినట్లు రాష్ట్ర వైద్యారోగ్య శాఖ అధికారులు తెలిపారు. జనగాం జిల్లాకు చెందిన స్టాఫ్ నర్సు పవిత్ర కూడా కరోనా డ్యూటీలో ఉంటూ రోడ్డు ప్రమాదానికి గురై చనిపోవడంతో ఆమె నామినీ బ్యాంకు ఖాతాలో రూ.50లక్షల బీమా పరిహారం జమ అయినట్లు వివరించారు. మిగిలినవారి క్లెయిమ్‌లు కూడా త్వరలోనే పరిష్కారం అయ్యి తలా రూ.50లక్షల చొప్పున నామినీల బ్యాంకు ఖాతాల్లో జమ కానున్నాయని వైద్యారోగ్య శాఖ అధికారులు పేర్కొన్నారు. రాష్ట్రంలో ఇప్పటివరకు కరోనా బారిన పడి 16మంది వైద్య సిబ్బంది చనిపోయారు. ఇందులో తొమ్మిది మంది క్లెయిమ్‌లకు సంబంధించిన దరఖాస్తు ప్రక్రియ ముగిసిందని ఒక అధికారి పేర్కొన్నారు.

Advertisement

Next Story

Most Viewed