పల్లెకు పాకుతున్నది..!

by Aamani |

దిశ, ఆదిలాబాద్: నిన్నటిదాకా పట్టణ ప్రాంతాలకే పరిమితమైన కరోనా వైరస్ క్రమంగా పల్లెకు పాకుతున్నది. వాస్తవానికి గ్రామీణ ప్రాంతాలకు విదేశాల నుండి వచ్చిన ప్రవాస భారతీయులు తమ స్వస్థలాలకు చేరి, కరోనా వైరస్ ఇంకుబేషన్ కాలమైన 14రోజులు కావస్తున్నది. కేవలం 20శాతం మంది మాత్రమే చివరి రోజుల్లో జిల్లాకు వచ్చారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో సుమారు 3వేలకు పైగా విదేశాల్లో ఉండేవారు జిల్లాకు వచ్చారు. వీరిలో 600 మంది మాత్రమే మార్చ్ 20వ తేదీ తర్వాత వచ్చినట్లు రికార్డులు చెబుతున్నాయి. దీన్నిబట్టి విదేశాల నుండి వచ్చే క్రమంలో తక్కువ మంది మాత్రమే కరోనా బారిన పడే ప్రమాదం ఉందని అధికారులు అంచనా వేశారు. అనుకున్నట్టుగానే ఏప్రిల్ మొదటి వారం పూర్తయ్యే దాకా గ్రామీణ ప్రాంతాల నుంచి కరోనా కేసులు నమోదు కాలేదు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో నిర్మల్, భైంసా, అదిలాబాద్ పట్టణాల్లో మాత్రమే కరోనా కేసులు వచ్చాయి. తూర్పు జిల్లాలోని పట్టణ ప్రాంతాలయిన మంచిర్యాల, కాగజ్‌నగర్, ఆసిఫాబాద్, బెల్లంపల్లి తదితర ప్రాంతాలతో పాటు గ్రామీణ ప్రాంతాల్లోనూ కరోనా కేసుల ఊసు లేదు.

క్రమంగా పల్లెలకు కరోనా

ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో పట్టణాలకే పరిమితమైందనుకున్న కరోనా వైరస్ క్రమంగా పల్లెలకు పాకుతున్నది. గడిచిన వారం రోజులుగా… రోజుకో మారుమూల పల్లెల్లో కరోనా కేసులు వెలుగు చూస్తుండడం ఆందోళన కలిగిస్తున్నది. నిర్మల్ జిల్లా నర్సాపూర్ మండలం చాక్‌పల్లి గ్రామంలో ముగ్గురికి, లక్ష్మణచందా మండలం రాచాపూర్ గ్రామంలో ఒకరికి, అలాగే మామడ మండలంలోని కొత్తలింగంపల్లి వాసికి, పెంబి మండలం రాయదారి గ్రామానికి చెందిన మరొకరికి కరోనా సోకింది. ఆదిలాబాద్ జిల్లాలోని ఉట్నూర్ మండలం హస్నాపూర్ గ్రామానికి చెందిన ఒక వ్యక్తికి కరోనా సోకగా, నేరడిగొండ మండల కేంద్రానికి చెందిన ముగ్గురికి వైరస్ సోకడం కలకలం రేపుతుంది.

పట్టణాలకు మాత్రమే పరిమితమైందనుకున్న వైరస్ కాస్త పల్లెలకు విస్తరిస్తుండటంతో ఆందోళన కలిగిస్తోంది. గ్రామీణ ప్రాంతాల్లో జనసమ్మర్ధం అంతంతమాత్రంగానే ఉంటున్నప్పటికీ కరోనా కేసులు నమోదు అవుతుండడం పట్ల పల్లె వాసులు కలవరపడుతున్నారు. అయితే మర్కజ్ వెళ్లి వచ్చిన వారికి మాత్రమే మొదట్లో కరోనా కేసులు నమోదు కాగా తాజాగా విదేశాల నుంచి వచ్చిన వారికి, అలాగే ఫస్ట్ కాంటాక్ట్ మరొకరు కరోనా బారిన పడడం ఆందోళనకు కారణం అవుతున్నది. లాక్‌డౌన్ తర్వాత పది రోజులకు పైగా కరోనా ఆనవాళ్లు లేకపోవడంతో పల్లె జనం సంబరపడ్డారు. ఇప్పుడు క్రమంగా పల్లెల్లో కరోనా కేసులు నమోదు అవుతుండడంతో ఆందోళన చెందుతున్నారు.

Tags: Coronavirus, Positive cases in villages, Adilabad, Nirmal district Narsapur, Delhi Markaz, Lockdown

Advertisement

Next Story

Most Viewed