కరీంనగర్‌లో కరోనా.. ఓరుగల్లులో ఒమిక్రాన్..!

by Sridhar Babu |
omicran
X

దిశప్రతినిధి, కరీంనగర్ : ప్రపంచాన్ని కలవరపెడుతున్న కరోనా మహమ్మారి ఉత్తర తెలంగాణను వదిలిపెట్టడం లేదు. కరోనా వైరస్ దేశంలోకి ఎంట్రీ ఇచ్చిన ఆరంభంలోనే ఉత్తర తెలంగాణను వదలలేదు. ముఖ్యంగా కరీంనగర్, వరంగల్ జిల్లాలను కొవిడ్-19 కలవర పెడుతోంది. కరోనా ఫస్ట్ వేవ్ టైంలో మొట్టమొదటగా కరీంనగర్‌లోనే కేసులు వెలుగుచూశాయి. ఇండోనేషియా నుంచి వచ్చిన మర్కజ్ మత ప్రచారకుల్లో కరోనా లక్షణాలు కనిపించడంతో కరీంనగర్ జాతీయ స్థాయిలో వార్తల్లో నిలిచింది. ఆ తర్వాత ఢిల్లీలో జరిగిన మత ప్రచారానికి చెందిన సభలకు జిల్లాకు చెందిన వారు హాజరై వచ్చిన వారికి కరోనా సోకిందన్న ప్రచారం జరిగింది. దీంతో అటు పోలీసులు, ఇటు నిఘా వర్గాలు, జిల్లా అధికార యంత్రాంగం అప్రమత్తం అయింది.

ఇండోనేషియాకు చెందిన మత ప్రచారకులను గుర్తించి వారికి పరీక్షలు చేసిన అనంతరం హైదరాబాద్ తరలించి చికిత్స అందించారు. ఆ తరువాత స్థానికులకు కూడా కరోనా సోకడంతో వారిని ఐసోలేషన్ సెంటర్లకు తరలించారు. ఆ తరువాత కరీంనగర్‌లోని పలు ప్రాంతాలను కంటైన్‌మెంట్ జోన్లుగా గుర్తించారు. ఆయా ప్రాంతాలను దిగ్భందించిన జిల్లా అధికార యంత్రాంగం సుమారు రెండు నెలల పాటు అన్ని రకాల సౌకర్యాలు అందించారు. నిత్యవసరాల నుంచి మొదలు మెడిసిన్స్ వరకు అన్నింటిని సరఫరా చేశారు. చివరకు మొబైల్ ఏటీఎంను కూడా కంటైన్ మెంట్ జోన్లలో అందుబాటులో ఉంచి కట్టడి చేశారు. దేశవ్యాప్తంగా కరీంనగర్‌లో కరోనా కేసులు, కంటైన్‌మెంట్ జోన్ల ఏర్పాటు చర్చనీయాశంగా మారింది. దీంతో కరీంనగర్ అనగానే ఇతర ప్రాంతాల వారు ఉలిక్కిపడే పరిస్థితులు వచ్చాయి. ఈ మహమ్మారి జిల్లా వాసులను కరోనా ఎంత భయంలోకి నెట్టిందో అర్థం చేసుకోవచ్చు.

ఒమిక్రాన్‌తో ఓరుగల్లు..

తాజాగా ప్రపంచాన్ని ఒమిక్రాన్ వేరియంట్ కలవరపెడుతోంది. ఈ నేపథ్యంలోనే హైదరాబాద్‌లో ఒమిక్రాన్ కేసులు నమోదు కావడంతో తెలంగాణ ప్రజలు మరోసారి భయాందోళనకు గురయ్యారు. హైదరాబాద్‌లో కేసులు వెలుగుచూసిన రెండు నుంచి మూడు రోజుల్లోనే వరంగల్ మహానగరంలో మరొక వ్యక్తికి ఒమిక్రాన్ లక్షణాలు ఉండటాన్ని గుర్తించారు. దీంతో ఒమిక్రాన్ మరోసారి ఉత్తర తెలంగాణ ప్రజలపై పగబట్టినట్టు తేలిపోయింది. విదేశాలకే పరిమితమైన ఈ మహమ్మారి తాజాగా వరంగల్ నగరాన్ని తాకడంతో మరోసారి ఉత్తర తెలంగాణ జిల్లాలు వార్తల్లో నిలిచాయి. కరోనా మొదటగా కరీంనగర్‌లో వెలుగుచూస్తే.. ఒమిక్రాన్ వేరియంట్ మాత్రం వరంగల్ వాసులను ఆందోళనకు గురిచేస్తోంది. ఏదిఏమైనా ప్రపంచాన్ని కలవరపెడుతున్న ఈ మహమ్మారి ఎంట్రీతో మరోసారి ఉత్తర తెలంగాణ జిల్లాల ప్రజలు ఎప్పుడు ఏం జరుగుతుందోనని వణికిపోతున్నారు.

Advertisement

Next Story

Most Viewed