నాలుగు వారాల్లో కరోనా కేసులు వన్ టూ 229..

by vinod kumar |   ( Updated:2020-04-04 07:49:40.0  )
నాలుగు వారాల్లో కరోనా కేసులు వన్ టూ 229..
X

దిశ, న్యూస్ బ్యూరో: తెలంగాణలో తొలి కరోనా పాజిటివ్ కేసు నమోదై ఏప్రిల్ 4వ తేదీకి సరిగ్గా నెల రోజులు. ఒక్క కేసుతో మొదలై 229 కేసుల దాకా చేరుకుంది. కొత్త కేసులేవీ రాకుంటే ఏప్రిల్ 7వ తేదీ తర్వాత ‘కరోనా-ఫ్రీ తెలంగాణ’ అవుతుందని ముఖ్యమంత్రి కేసీఆర్ ఇటీవల వ్యాఖ్యలు చేశారు. అప్పటికల్లా రాష్ట్రంలోని మొత్తం 25,937 మంది క్వారంటైన్ గడువు పూర్తవుతుందని, విదేశీ విమానాలన్నీ ఆగిపోయినందున కొత్తగా పాజిటివ్ కేసులకు ఆస్కారం లేదని దీమా వ్యక్తం చేశారు. ఈ నెల 29వ తేదీన ఆయన ఈ దీమా వ్యక్తం చేసేనాటికి రాష్ట్రంలో మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 70 కాగా, కొద్దిమంది డిశ్చార్జి కావడంతో 58 మాత్రమే యాక్టివ్ కేసులు ఉన్నాయి. విదేశాల నుంచి ఈ వైరస్ వచ్చినందున విమానాలన్నీ ఆగిపోవడంతో క్వారంటైన్‌లో ఉన్నవారు కోలుకుంటున్నందున కొత్త కేసులు నమోదయ్యే అవకాశాలు చాలా తక్కువని అన్నారు. కానీ ముఖ్యమంత్రి ప్రకటన చేసిన తర్వాత ఈ వారం రోజుల్లో పాజిటివ్ కేసుల సంఖ్య మూడున్నర రెట్లు పెరిగి 229కు చేరుకుంది. ముఖ్యమంత్రి వ్యాఖ్యలతో ప్రజలు ఊపిరి పీల్చుకుని మరుసటి రోజుకే రోడ్లమీదకు రావడం మొదలుపెట్టారు. కానీ ఒకే రోజున 75 పాజిటివ్ కేసులు నమోదయ్యే స్థాయికి చేరుకుంది. అప్పటిదాకా కొన్ని జిల్లాలకు మాత్రమే పరిమితమైన కరోనా పాజిటివ్ కేసులు ఇప్పుడు దాదాపు అన్ని జిల్లాలకూ పాకింది.

తెలంగాణలో ఇప్పటివరకు నమోదైన కరోనా పాజిటివ్ కేసుల్లో సగానికి పైగా ఢిల్లీ నిజాముద్దీన్ మర్కజ్‌తో ప్రత్యక్షంగానో, పరోక్షంగానో సంబంధాలు ఉన్నవే. దేశవ్యాప్తంగా సుమారు 400 పాజిటివ్ కేసులకు మర్కజ్‌కు వెళ్ళివచ్చిన హిస్టరీ ఉన్నట్లు తేలిందని కేంద్ర వైద్యారోగ్య మంత్రిత్వశాఖ జాయింట్ డైరెక్టర్ లవ్ అగర్వాల్ తెలిపారు. రాష్ట్రంలో మృతిచెందిన 11 మందికీ మర్కజ్‌తో సంబంధాలున్నాయి. తెలంగాణలో తొలి కరోనా పాజిటివ్ కేసు మార్చి 4వ తేదీన నమోదైంది. పది రోజుల వరకూ ఆ ఒక్క కేసే కొనసాగింది. ఆ తర్వాత నాలుగు రోజుల పాటు రొజుకొకటి చొప్పున గత నెల 17వ తేదీ వరకు మొత్తం ఐదు పాజిటివ్ కేసులే నమోదయ్యాయి. అంటే దాదాపు రెండువారాల పాటు కేవలం ఐదు కేసులే ఉన్నాయి. కరీంనగర్ జిల్లాలో పర్యటిస్తున్న ఇండోనేషియా పౌరుల్లో ఎనిమిది మందికి కరోనా పాజిటివ్ ఉన్నట్లు గత నెల 18న వెల్లడైంది. వీరంతా ఢిల్లీలోని మర్కజ్‌కు వెళ్ళివచ్చినవారే. అక్కడి నుంచి వరుసగా పాజిటివ్ కేసుల సంఖ్య నమోదుకావడం పెరిగింది. చివరకు ఏప్రిల్ 3వ తేదీన ఒకేరోజున 75 పాజిటివ్ కేసులు నమోదుకావడం వైద్యారోగ్య శాఖను విస్మయానికి గురిచేసింది. ఏప్రిల్ 7వ తేదీ నాటికి రాష్ట్రం ‘కరోనా-ఫ్రీ తెలంగాణ’ అవుతుందనుకుంటే పాజిటివ్ కేసుల సంఖ్య ఊహకు అందని తీరులో పెరగడం చర్చనీయాంశమైంది.

మొదటి రెండు వారాల్లో (మార్చి 3 నుంచి 17 వరకు) కేవలం ఐదు కేసులు మాత్రమే నమోదైతే మూడవ వారం (మార్చి 18 నుంచి 25 వరకు)లో 36, నాల్గవ వారం (మార్చి 26 నుంచి ఏప్రిల్ 2 వరకు)లో 113 కేసులు నమోదయ్యాయి. వారం రోజులు గడుస్తున్నాకొద్దీ పాజిటివ్ కేసుల సంఖ్య నాలుగైదు రెట్ల చొప్పున పెరుగుతోంది. ఏప్రిల్ 3 నుంచి ఐదవవారం ప్రారంభమైందనుకుంటే తొలి రోజునే 75 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఇంకెన్ని కొత్త కేసులు నమోదవుతాయో అనే ఆందోళన వైద్యారోగ్య శాఖను వెంటాడుతోంది. ఇంకా సుమారు 800 మంది రిపోర్టు రావాల్సి ఉందని ఆ శాఖ అధికారులు సూచనప్రాయంగా తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం మాత్రం షిప్టులవారీగా 24 గంటలూ రాష్ట్రంలో ఆరు ల్యాబ్‌లలో పరీక్షలు జరుగుతున్నట్లు పేర్కొంది. ఏప్రిల్ 7వ తర్వాత క్వారంటైన్‌లో ఒక్కరు కూడా ఉండరని, పరిస్థితులు మెరుగవుతాయని, ‘కరోనా-ఫ్రీ తెలంగాణ’ అవుతుందనుకుంటే కేసులు పెరిగిపోతున్నాయనే ఆందోళన అధికారుల్లో వ్యక్తమవుతోంది.

Tags: Telangana, Corona, Markaz, Deaths, Indonesia

Advertisement

Next Story

Most Viewed