ప్రభుత్వ కార్యాలయాలకు కరోనా ఫీవర్

by Shyam |
ప్రభుత్వ కార్యాలయాలకు కరోనా ఫీవర్
X

దిశ, న్యూస్ బ్యూరో: లాక్‌డౌన్ ఆంక్షలను సడలించడంతో ప్రభుత్వాఫీసుల్లో వంద శాతం ఉద్యోగులు హాజరుకావాల్సిందేనని ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. కానీ దాని వెన్నంటే పాజిటివ్ కేసులు నమోదవుతూ ఉన్నాయి. మరో మార్గం లేక శానిటైజేషన్ పేరుతో రెండు మూడు రోజుల పాటు ఆ బ్లాకులకు సెలవు ఇవ్వక తప్పడంలేదు. ప్రైమరీ కాంటాక్టులతో పాటు ఆ బ్లాకులోని ఉద్యోగులను హోమ్ క్వారంటైన్‌కు పంపిస్తున్నారు ఉన్నతాధికారులు. ప్రభుత్వ కార్యకలాపాలు యధావిధిగా జరగాలని భావించిన ప్రభుత్వం లాక్‌డౌన్ ఆంక్షలను సడలించడంతో ఊహించని కొత్త చిక్కులు వచ్చిపడ్డాయి. పదుల సంఖ్యలో ఉద్యోగులు ఇళ్ళకే పరిమితం కావాల్సి వచ్చింది. వారం, పదిరోజుల వ్యవధిలో బేగంపేట్‌లోని మెట్రో రైల్ భవన్‌లో ఉన్న సీఎంఓ కార్యాలయం, ఆ తర్వాత తాత్కాలిక సచివాలయంలోని ఆర్థిక శాఖ పనిచేసే బ్లాకులు, జీహెచ్ఎంసీ హెడ్ క్వార్టర్‌లోని హెల్త్ సెక్షన్, ఇప్పుడు ఏకంగా మేయర్ కార్యాలయాల్లో పనిచేసే ఉద్యోగులకు పాజిటివ్ రావడంతో తాత్కాలికంగా మూతపడక తప్పలేదు.

గచ్చిబౌలిలోని కరోనా స్పెషల్ ఆసుపత్రిగా ఉన్న టిమ్స్‌లో సైతం ఇన్‌ఛార్జి సూపరింటెండెంట్‌గా ఉన్న కొండాపూర్ ఏరియా ఆసుపత్రి సూపరింటెండెంట్‌కు కరోనా పాజిటివ్ నిర్ధారణ అయింది. ఇంకా ఆసుపత్రిలో కరోనా పేషెంట్ల అడ్మిషన్లే జరగలేదుగానీ ఒక నర్సుకు కూడా పాజిటివ్ వచ్చింది. ఉస్మానియా ఆసుపత్రికి చెందిన ఈ నర్సులు గత రెండు వారాలుగా టిమ్స్‌లో పనిచేస్తున్నారు. రెండు రోజుల క్రితం పాజిటివ్ రావడంతో గాంధీ ఆసుపత్రిలో చేరాల్సి వచ్చింది. ఇక పోలీసు స్టేషన్లలో సైతం పదుల సంఖ్యలో పోలీసులకు, అధికారులకు పాజిటివ్ రావడంతో చాలా మందిని హోమ్ క్వారంటైన్‌కు తరలించాల్సి వచ్చింది. ఆ మేరకు విధుల్లో కొరత ఏర్పడింది. దక్షిణ మధ్య రైల్వేలోని ఒక మహిళా ఉన్నతాధికారికి పాజిటివ్ రావడంతో సోమవారం వరకూ ఆ బ్లాకులో పనిచేసే ఉద్యోగులందరినీ ఇళ్ళకే పరిమితం కావాల్సిందిగా ఉత్తర్వులు జారీ అయ్యాయి. ఇలా ఒక్కో ఆఫీసులో పాజిటివ్ కేసులు వస్తుండడంతో సంబంధిత సెక్షన్‌లోని ఉద్యోగులందరినీ రోజుల తరబడి క్వారంటైన్‌లో పెట్టాల్సి వస్తోంది.

ఇంతకాలం లాక్‌డౌన్ కారణంగా పరిమిత సంఖ్యలో మాత్రమే ఉద్యోగులతో పనిచేసిన ఆఫీసులు మెజారిటీ ఉద్యోగులకు వర్క్ ఫ్రం హోమ్ అవకాశం కల్పించాయి. కానీ ఆంక్షలను ఎత్తివేసి సడలింపులు ఇవ్వడంతో వంద శాతం ఉద్యోగులు విధులకు హాజరుకావాల్సి వచ్చింది. కానీ పాజిటివ్ కేసులు వస్తుండడంతో ఆఫీసు పనులకు అంతరాయం ఏర్పడుతోంది. మేయర్‌కు నాలుగు రోజుల వ్యవధిలో రెండుసార్లు కరోనా నిర్ధారణ పరీక్షలు చేయాల్సి వచ్చింది. జిల్లాల స్థాయిలో కూడా పరిస్థితి ఇందుకు భిన్నంగా ఏమీ లేదు. సిద్దిపేట జిల్లాకు చెందిన ఒక మంత్రి వ్యక్తిగత సహాయకుడికి కూడా కరోనా పాజిటివ్ వచ్చింది. జిల్లా కలెక్టర్ కూడా సెల్ఫ్ క్వారంటైన్‌లోకి వెళ్ళిపోయారు. ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా చిన్నచిన్న పొరపాట్లతో కరోనా ఇన్‌ఫెక్షన్‌కు గురికావడం, ఫలితంగా ఐసొలేషన్ లేదా క్వారంటైన్‌లోకి వెళ్ళిపోవాల్సి వస్తోంది. ఇది సిబ్బందిలో ఆందోళనలకు కారణమవుతోంది.

Advertisement

Next Story

Most Viewed