మరికొద్ది రోజుల్లో కూరగాయలు కొరత

by Shyam |
మరికొద్ది రోజుల్లో కూరగాయలు కొరత
X

దిశ, హైదరాబాద్: కరోనా ప్రభావంతో రోజురోజుకి జనజీవనం స్తంభించిపోతోంది. వారం రోజులుగా దైనందిన కార్యకలాపాలన్నీ ఎక్కడివి అక్కడే నిలిచిపోతున్నాయి. సాధారణ జీవనానికి అవసరమయ్యే నిత్యావసర వస్తువులు నిర్దేశిత సమయంలోనే అందుబాటులో ఉంటున్నందున ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. ముఖ్యంగా ఆహారానికి వినియోగించే కూరగాయలు లభ్యమవుతున్నా.. ధరలు ఇష్టానుసారంగా ఉంటున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం ధరల నియంత్రణపై కఠిన చర్యలు తీసుకుంటామని ఇటీవల చెప్పడంతో కొంత మేర ధరలు అదుపులోకి వచ్చాయి. అయితే, కరోనా కారణంగా మొత్తం రవాణ వ్యవస్థ నిలిచిపోవడం, దేశమంతా లాక్‎డౌన్ కారణంగా ప్రజలంతా ఇండ్లకే పరిమితం కావడంతో నగరానికి వచ్చే కాయ కూరల దిగుమతులు తగ్గుతున్నాయి. హైదరాబాద్ నగరంలోని పలు రైతు బజార్లకు సమీప గ్రామాలకు చెందిన రైతులు కూర గాయాలు తెచ్చి విక్రయిస్తుంటారు. అయితే, ఈ కూరగాయాలు క్రమేపీ రోజువారీ దిగుమతులు తగ్గుతున్నాయి. నగరంలోని సరూర్ నగర్ రైతు బజార్‎కు రంగారెడ్డి జిల్లాలోని యాచారం, ఇబ్రహీంపట్నం, హయత్ నగర్, మంచాల, సరూర్ నగర్ మండలాల నుంచి ప్రతిరోజూ కూరగాయలు వస్తుంటాయి. అయితే, ఈ నెల 22న దేశ వ్యాప్తంగా జనతా కర్ఫ్యూ కంటే ముందు రోజు శనివారం 819 క్వింటాళ్ళు రాగా, జనతా కర్ఫ్యూ నిర్వహించిన అనంతరం సోమవారం 670 క్వింటాళ్ళు మాత్రమే వచ్చాయి.

నిత్యావసర వస్తువల సరఫరాకు ఎలాంటి ఆటంకాలు లేనప్పటికీ, కరోనా ఎఫెక్టు విస్తరిస్తున్న కొద్దీ నిత్యాసవర వస్తువుల కొరత తీవ్రతరం అవుతున్నాయి. అనంతరం సోమవారం లాక్ డౌన్ ప్రకటించినా, ప్రజలు భాగస్వామ్యం పెద్దగా లేకపోవడంతో.. సోమవారం సిద్దం చేసిన కూరగాయలు మంగళవారం 858 క్వింటాళ్ళు వచ్చాయి. అయితే, ప్రభుత్వం మంగళవారం లాక్ డౌన్ కార్యక్రమాన్ని సీరియస్‎గా తీసుకోవడం వల్ల బుధవారం కేవలం 683 క్వింటాళ్ళు మాత్రమే అందుబాటులోకి వచ్చాయి. ఇదే పరిస్థితి నగరంలోని మెహిదీపట్నం, ఎర్రగడ్డ తదితర రైతుబజార్లలోనూ ఇదే పరిస్థితి నెలకొంటుంది. కరోనా ప్రభావం ఫలితంగా రానున్న మరికొద్ది రోజుల్లోనే, ముఖ్యంగా నగర వాసులకు నిత్యావసర వస్తువులు కొరత కానున్నాయి.

Tag: Corona Effect, Vegetables, Hyderabad, Saroornagar, Farmers Bazaar

Advertisement

Next Story

Most Viewed