కరోనా గట్టి దెబ్బ కొట్టింది

by vinod kumar |   ( Updated:2020-05-16 07:41:21.0  )
కరోనా గట్టి దెబ్బ కొట్టింది
X

దిశ, వెబ్‌డెస్క్: కరోనా లాక్‌డౌన్ ఎఫెక్ట్ భారత ఎగుమతులపై తీవ్ర ప్రభావం చూపింది. చరిత్రలో ఎన్నడూ లేనంతగా పతనమైనట్టు గణాంకాలు చెబుతున్నాయి. ఏప్రిల్‌ నెలలో ఎగుమతులు ఏకంగా 60.28 శాతం, దిగుమతులు 58.65 శాతం క్షీణించడం ఆందోళన కలిగిస్తోంది. డిమాండ్ తగ్గడంతో పాటు కరోనా ఎఫెక్ట్‌తో సరఫరా వ్యవస్థలో తీవ్ర అంతరాయం ఏర్పడింది. దీంతో భారీ ఆర్డర్లు రద్దైపోయాయి. దీని ప్రభావం భారత ఎగుమతులపై పడిందని భారత వాణిజ్య రంగం అంచనా వేస్తోంది. ఇనుప ఖనిజం, ఫార్మా విభాగాలు తప్పితే మిగతా 28 రంగాలు ఎగుమతుల్లో ప్రతికూల వృద్ధినే నమోదు చేయడం విశేషం.

2011-12 నుంచి భారత ఎగుమతులు ప్రతీ నెలా 30 వేల కోట్ల డాలర్లకు అటూఇటూగా నమోదు అవుతున్నాయి. ఏప్రిల్‌ నెల ఎగుమతుల విలువ కేవలం 1,036 కోట్ల డాలర్లు అంటే రూ. 77,700 ఉండగా.. దిగుమతుల విలువ కేవలం 1,712 కోట్ల డాలర్లు అంటే రూ. 1.28 లక్షల కోట్లుగా ఉంది. వాణిజ్య లోటు గత ఏడాది ఏప్రిల్‌తో పోల్చితే 1,533 కోట్ల డాలర్లు అంటే 1.15 లక్షల కోట్ల రూపాయల నుంచి 676 కోట్ల డాలర్లు అంటే 50,700 కోట్ల రూపాయలకు తగ్గింది. 2016 మే నెల తర్వాత వాణిజ్య లోటు మరో కనిష్ఠ స్థాయి ఇదేకావడం విశేషం. మార్చిలో ఎగుమతులు 34.57 శాతం తగ్గితే ఏప్రిల్ నెల కూడా భారీ క్షీణత నమోదు చేయడం విశేషం.

ఇక ఎగుమతుల క్షీణత విభాగాల వారీగా చూస్తే..

రత్నాభరణాలు -98.74 శాతం క్షీణించాయి. తోలు ఉత్పత్తులు 93.28 శాతం క్షీణత నమోదు చేశాయి. పెట్రోలియం ఉత్పత్తులు -66.22 శాతం క్షీణించాయి. ఇంజనీరింగ్‌ వస్తువులు -64.76 శాతం క్షీణత నమోదు చేశాయి. ఇక దిగుమతుల విషయానికి వస్తే 30 కీలక రంగాల్లో తీవ్ర ప్రభావం పడింది. పెట్రో ఉత్పత్తుల డిమాండ్ పడిపోవడంతో ఆయిల్‌ దిగుమతులు 59.03 శాతం క్షీణించి 466 కోట్ల డాలర్లకు (రూ.34,950 కోట్లు) దిగజారినట్టు వాణిజ్య మంత్రిత్వ శాఖ వెల్లడించింది. ఇక నాన్‌ ఆయిల్‌ దిగుమతులు 58.5 శాతం తగ్గి 1246 కోట్ల డాలర్లకు క్షీణించాయి. మరోవైపు బంగారం కూడా డిమాండ్ లే గత ఏప్రిల్‌తో పోల్చితే 400 కోట్ల డాలర్లు పడిపోయింది.

Advertisement

Next Story

Most Viewed