గణేశ్ నవరాత్రులపై కరోనా ఎఫెక్ట్

by Shyam |
గణేశ్ నవరాత్రులపై కరోనా ఎఫెక్ట్
X

దిశ ప్రతినిధి, ఆదిలాబాద్ :

ఆది దేవుడి పూజకు అవాంతరాలు ఎదురుకానున్నాయి.. మానవాళిని కలవర పెడుతున్న కరోనా దేవుళ్లనూ వదిలేలా లేదు.. ఎలుకపై కూర్చోని ఎల్ల లోకములు తిరిగే గణపతికి భూలోకంలో మాత్రం నిబంధనల బ్రేక్ ​పడనుంది.. ఏటా ఉత్సాహంగా జరుపుకునే నవరాత్రులు ఈ యేడు కళ తప్పనున్నాయి. ఊరికో వినాయకుడిని ప్రతిష్ఠించడానికి అధికారులు అవకాశం ఇస్తున్నారు. కానీ, పట్టణాల్లో మాత్రం ఉత్సవాలకు సంబంధించి కొవిడ్ నిబంధనలు వర్తిస్తాయని చెబుతున్నారు. సిటీల్లో విగ్రహాల ఏర్పాటుకు అనుమతులు లేవని, పోలీసులు చెబుతున్నారు.

ప్రతి యేటా అత్యంత ఉత్సాహంగా జరుపుకునే గణనాథుల పండుగకు ఈసారి కరోనా అడ్డంకిగా మారింది. ప్రధానం గా జిల్లా కేంద్రాలు, ప్రధాన పట్టణాల్లో విగ్రహాల ప్రతిష్ఠాపన విషయంలో ప్రతిష్టంభన నెలకొన్నది. అయితే ఒక్కో ఊరిలో ఒక వినాయకుడిని పెట్టుకోవడానికి సానుకూలంగా స్పందిస్తున్న అధికారులు పట్టణాల్లో మాత్రం ఏర్పా టుకు కొవిడ్​–‌‌19 నిబంధనలు వర్తిస్తాయని చెబుతున్నారు. దీంతో ఈ యేడాది టౌన్లలో ఉత్సవాలు జరుగుతాయా… లేదా అన్నది అనుమానంగా కనిపిస్తోంది. ప్రభుత్వం నుం చి ఎలాంటి ఆదేశాలు రాలేదని, అందుకే గల్లీల్లో నిర్వహణకు అనుమతులు లేవని పోలీసులు చెబుతున్నారు. కరోనా నేపథ్యంలో ఈ ఏడాది ఇండ్లలోనే నిర్వహించుకుంటే మంచిదని వారు సూచిస్తున్నారు.

పట్టణాల్లోనే సమస్య..!

ఊరికి ఒకటి చొప్పున వినాయక విగ్రహాలను ప్రతిష్ఠించడానికి అధికారులు అనుమతిస్తున్నారు. అయితే పట్టణాలకు సంబంధించి ఉత్సవాల నిర్వహణకు ప్రతిబంధకాలు ఎదురవుతున్నాయి. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని నిర్మల్, ఆదిలాబాద్, బైంసా, మంచిర్యాల, కాగజ్​నగర్, ఆసిఫాబాద్ తదితర ప్రధాన పట్టణాల్లో ప్రతి సంవత్సరం పెద్ద ఎత్తున వినాయక ఉత్సవాలు జరిగేవి. ఆయా ప్రాంతాల్లో 15 నుంచి 30 అడుగుల ఎత్తులో వివిధ ఆకృతుల్లో ఉన్న విగ్రహాలను పోటీపడి ప్రతిష్ఠించేవారు. అలాగే పెద్ద పెద్ద సెట్టింగ్​లు, మండపాలను వెరైటీగా డెకరేషన్ చేయడం, ప్రతిస్థాపన మొదలు నిమజ్జన ఉత్సవాలను మండపాల నిర్వాహకులు, యువజన సంఘాలు వైభవోపేతంగా నిర్వహించేవారు. అయితే ఈ ఏడాది కరోనా కారణంగా ఉత్సవాలు జరిగేలా కనిపించడం లేదు.

అనుమతులు వస్తాయా..?

జిల్లా కేంద్రంతో పాటు ప్రధాన పట్టణాల్లో గణేశ్​ఉత్సవాల నిర్వహణకు ప్రభుత్వం నుంచి అనుమతులు వస్తాయా… లేదా..? అన్నది అనుమానంగా కనిపిస్తోంది. చవితి పండుగకు పది రోజులైనా లేదు. అయినా ఇప్పటి వరకు పండుగ నిర్వహణపై ఎలాంటి స్పష్టత లేదు. ఒకవేళ వచ్చినా… అతి తక్కువ ఎత్తులో ఉండే వినాయకుల ప్రతిష్ఠాపన, పూజా కార్యక్రమాలు, నిమజ్జనం వంటి కార్యక్రమాలను సాధారణంగా నిర్వహించేందుకు అనుమతులు రావొచ్చని పోలీసులు అభిప్రాయపడుతున్నారు. అయితే కమ్యూనిటీ గణేశ్​ విగ్రహాల ఏర్పాటు కు మాత్రం ఇప్పటివరకు ఎలాంటి అనుమతులు రాలేదు. ఆదిలాబాద్, నిర్మల్, భైంసా త దితర పట్టణాల్లో పోలీసు యంత్రాంగం గుర్తించే వి నాయకులే ఒక్కోచోట 50 దాకా ఉంటాయి. ఈ సారి ఇలాంటి నెంబర్లను పోలీసులు కేటాయించలేదు. దీన్నిబట్టి ఉత్సవాలు పట్టణాల్లో అనుమానంగానే కనిపిస్తోందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.

ఉన్నతాధికారుల ఆదేశాల కోసం చూస్తున్నాం..

నిర్మల్ జిల్లా కేంద్రంలో ఆయా వీధుల్లో వినాయక విగ్రహాల ఏర్పాటుకు ఇప్పటివరకు ఎలాంటి అనుమతులు లేవు. కమ్యూనిటీ వినాయకుల ప్రతిష్ఠాపనకు కొవిడ్–19 నిబంధనలు వర్తిస్తాయి. ఇప్పటి వరకు తమకు అందిన ఆదేశాల ప్రకారం అందరూ ఇళ్లలోనే ఉత్సవాలు జరుపుకోవాల్సిందే. గల్లీల్లో ప్రతిష్ఠించే వినాయకులకు సంబంధించి ఉన్నతాధికారుల ఆదేశాల కోసం ఎదురు చూస్తున్నాం.

-సీఐ జాన్ దివాకర్

Advertisement

Next Story

Most Viewed