కరోనా ఎఫెక్ట్.. బైక్‌ను దహనం చేసిన ఇంటి ఓనర్

by Anukaran |   ( Updated:2020-07-14 11:09:30.0  )
కరోనా ఎఫెక్ట్.. బైక్‌ను దహనం చేసిన ఇంటి ఓనర్
X

దిశ, వెబ్ డెస్క్: ప్రస్తుత పరిస్థితులు చాలా డేంజర్‌ జోన్ ఉండటంతో ఎవరు తుమ్మినా.. దగ్గినా.. అంటరాని ఉగ్రవాదులను చూసినట్టు చూస్తున్నారు. ఇక జ్వరం ఉందని తెలిస్తే.. దూరంగా పరుగులు తీస్తున్నారు. అంతలా జనాల్లో అనుమానం పెంచేసి.. సమాజాన్ని మార్చేసింది కోవిడ్ మహమ్మారి. ఇలాంటి అనుమానంతోనే.. ఓ యువకుడి బైక్‌ను తగులబెట్టాడు ఇంటి యజమాని. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావు పేటలోని డ్రైవర్ కాలనీలో ఈ ఘటన చోటు చేసుకుంది. స్థానికుల వివరాల ప్రకారం… పశ్చిమగోదావరి జిల్లా జీలుగుమిల్లి చెందిన ఓ యువకుడు మంగళవారం అశ్వారావుపేటలోని బంధువుల ఇంటికి వెళ్లాడు. బంధువుల ఇంటి వద్ద బైక్ పార్క్ చేసేందుకు స్థలం లేకపోవడంతో.. మరో ఇంటి ముందు తన బైక్ నిలిపాడు. ఐతే ఆ ఇంటి ముందు బైక్ నిలపడంపై యజమాని ఆగ్రహం వ్యక్తం చేశాడు. మీ ప్రాంతంలో కరోనా విజృంభిస్తోందని.. నీకు కూడా ఉందేమో అంటూ మండిపడ్డాడు. కరోనా సమయంలో అసలు ఇక్కడికి ఎందుకు వచ్చావు? అంటూ నిలదీశాడు. అలా మాటా మాటా పెరిగి గొడవ పెద్దయింది. ఆగ్రహంతో ఊగిపోయిన ఇంటి యజమాని.. అదే బైక్ నుంచి పెట్రోల్ తీసి.. దాన్ని తగులబెట్టాడు. ఘటనపై బాధితుడు అశ్వారావు పేట పోలీసులకు ఫిర్యాదు చేశాడు. యువకుడి ఫిర్యాదు మేరకు పోలీసులు ఘటనా స్థలానికి వెళ్లి పరిశీలించారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement

Next Story

Most Viewed