‘రాష్ట్రంలో కరోనా వ్యాధి వ్యాప్తి తగ్గుతుంది’

by Sridhar Babu |
‘రాష్ట్రంలో కరోనా వ్యాధి వ్యాప్తి తగ్గుతుంది’
X

దిశ, కరీంనగర్ సిటీ : రాష్ట్రంలో ప్రస్తుత పరిస్థితుల్లో కరోనా విస్తృతి తగ్గుతుందని, లాక్ డౌన్ ను మరింత కఠినంగా అమలు చేయాలని, రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు జిల్లా కలెక్టర్లను, పోలీసు ఉన్నతాధికారులను ఆదేశించారు. కరోనా చికిత్స, లాక్‌డౌన్‌ అమలు, ధాన్యం కొనుగోలు తదితర అంశాలపై శుక్రవారం జిల్లా కలెక్టర్లు, సీపీలు, జిల్లా వైద్య శాఖ అధికారులు, పోలీసు ఉన్నతాధికారులతో ముఖ్యమంత్రి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి జిల్లాల వారీగా సమీక్షించారు. రాష్ట్రానికి ఆర్థికంగా వేల కోట్ల నష్టం వస్తున్నప్పటికీ, ప్రజల ఆరోగ్య దృష్యా లాక్‌డౌన్ అమలు చేస్తున్నామన్నారు. లాక్‌డౌన్ సమయంలో కొంత మంది యువకులు, ప్రజలు అనవసరంగా బయటకు వస్తున్నారని, దీని పట్ల అత్యంత కఠినంగా వ్యవహరించాలని, కట్టుదిట్టంగా లాక్‌డౌన్ అమలు చేయాలని ఆదేశించారు.

గాంధీ ఆసుపత్రి, వరంగల్‌లోని ఎంజిఎం ఆసుపత్రిని సందర్శించిన సమయంలో, సాధారణంగా ప్రజలు బయటకు రావడం గమనించామని, ఇది చాలా విచారకరమని, దీనిని కఠినంగా వ్యవహరించి నివారించాలని సీఎం డీజీపీకి సూచించారు. ఉదయం 10 గంటల తర్వాత అత్యవసర సేవల మినహాయించి ఎవరు బయటకు రావద్దన్నారు. ప్రభుత్వ ఆసుపత్రులలో కరోనా చికిత్స పకడ్బందీగా అందిస్తున్నామని, అవసరమైన మందులు ఆక్సిజన్ సరఫరా, రెమిడిసివిర్ ఇంజెక్షన్లు, ఇతర మాత్రలు అందుబాటులో ఉన్నాయని తెలిపారు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో పారిశుద్ధ్య నిర్వహణపై కలెక్టర్లు ప్రత్యేక దృష్టి సారించాలని,రెండు రోజుల్లో ప్రతి ప్రభుత్వ ఆసుపత్రిలో ప్రైవేటుకు ధీటుగా, పకడ్బందీగా పారిశుద్ధ్యం జరిగేలా అవసరమైన చర్యలు తీసుకోవాలని కలెక్టర్ లను ఆదేశించారు.

Advertisement

Next Story

Most Viewed