వణుకుతున్న వరంగల్ జిల్లా.. ఒకే కుటుంబంలో ముగ్గురు బలి

by Anukaran |   ( Updated:2020-07-20 20:23:08.0  )
వణుకుతున్న వరంగల్ జిల్లా.. ఒకే కుటుంబంలో ముగ్గురు బలి
X

దిశ ప్రతినిధి, వరంగల్: ఉమ్మడి వరంగల్ జిల్లాలో కరోనా విజృంభిస్తోంది. పల్లె, పట్నం తేడా లేకుండా అన్ని వర్గాలను కకావికలం చేస్తోంది. నాలుగు రోజుల వ్యవధిలోనే ఒకే ఇంట్లో ముగ్గురిని బలితీసుకుంది. ఇటీవల వరంగల్ పోలీస్ కమిషనరేట్ కార్యాలయంలో 15 మందికి పైగా వైరస్ సోకింది. తాజాగా వరంగల్ నగర మేయర్ దంపతులు కూడా కరోనా బారిన పడ్డారు. దీంతో ప్రజలు ఆందోళన చెందుతున్నారు. వ్యాపారస్తులు స్వచ్ఛందంగా లాక్‌డౌన్ విధించుకుంటున్నారు.

వణికిస్తున్న వైరస్

ఉమ్మడి జిల్లా ప్రజలను వైరస్ వణికిస్తోంది. ఇప్పటికే పలు కాలనీలను కంటైన్మెంట్ జోన్లుగా ప్రకటించడంతో ప్రజలు ఇండ్లల్లో నుంచి బయటకు రావడానికి జంకుతున్నారు. వరంగల్ అర్బన్ జిల్లాలో 453 పాజిటివ్ కేసులు నమోదు కాగా, ఇప్పటి వరకు 8 మంది వరకు మరణించారు. ఇక వరంగల్ రూరల్ జిల్లాలో జూన్ 10 వరకు ఒక్క పాజిటివ్ కేసు నమోదు కాలేదు. కానీ జూన్ తర్వాత 181 మందికి కరోనా సోకింది. ఇప్పటి వరకు ఒకరు మృత్యువాత పడ్డారు. జనగామలో హైదరాబాద్ నుంచి వచ్చిన వారితో వ్యాపారికి కరోనా సోకింది. అతడి కారణంగా 80 మందికి కరోనా అంటుకుంది. ఇప్పటి వరకు ముగ్గురు మరణించారు. తాజాగా పాలకుర్తిలో ఒకరు మరణించారు. మహబూబాబాద్ జిల్లాలో 91మంది కరోనా బారిన పడ్డారు. ఇప్పటికే ముగ్గురు మరణించారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో 83 మందికి పాజిటివ్ నిర్ధారణ అయింది. ఇక్కడ మరణాలు లేక పోయినా ప్రధానంగా సింగరేణి, రెవెన్యూ ఉద్యోగులు వణికిపోతున్నారు. ములుగు జిల్లా ఏజెన్సీలో పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి. ఇప్పటి వరకు 46 కేసులు నమోదు కావడంతో అటవీ ప్రాంత ప్రజలు బయటకు రావడం లేదు. గూడాలకే పరిమితం అవుతున్నారు.

పెరుగుతున్న కేసులు

వరంగల్ జిల్లాలో రోజురోజుకూ కరోనా కేసులు పెరుగుతున్నాయి. ఆదివారం ఒక్కరోజే 167 కేసులు నమోదయ్యాయి. కరోనా బాధితులకు వైద్యసేవలు అందించేందుకు తీసుకుని వెళ్లే కుటుంబ సభ్యులు, ఆయా గ్రామాల్లో పర్యవేక్షణ చేసే ఆఫీసర్లు, సిబ్బందికి సైతం కరోనా సోకుతోంది. వరంగల్ నగర మేయర్ దంపతులకు కరోనా పాజిటివ్ రావడంతో మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు, సిబ్బంది బెంబేలెత్తి పోతున్నారు. ఇప్పటికే పలువురు ప్రజా ప్రతినిధులే కాకుండా వైద్యం అందించే డాక్టర్లు, సమాచారం అందించే జర్నలిస్టులు, ప్రభుత్వ ఉద్యోగులు, పోలీసులకు కరోనా వైరస్ సోకింది. పోలీస్ కమిషనరేట్ పరిధిలో సుమారు 50 మందికిపైగా పోలీసులకు కరోనా నిర్ధారణ అయింది. హన్మకొండలోని పోస్టల్ కాలనీకి చెందిన ఒకే కుటుంబంలో ముగ్గురు మరణించగా గర్భిణీ కరోనా బారిన పడి చికిత్స పొందుతోంది. వరంగల్ నగరంలోని దేశాయిపేటలో ఒకే కుటుంబంలో ముగ్గురికి కరోనా సోకగా.. ఒకరు చనిపోయారు. ఇద్దరు చికిత్స పొందుతున్నారు.

సెల్ఫ్ లాక్‌డౌన్

కరోనా బారిన పడిన వారి సంఖ్య పెరుగుతుండడంతో వరంగల్‍ ట్రైసిటీలో రిస్క్ ప్రాంతాల్లో జనం సెల్ఫ్ లాక్‌డౌన్ విధించుకుంటున్నారు. హన్మకొండలోని ఎక్సైజ్ కాలనీ, పోస్టల్ కాలనీ, సాయినగర్ కాలనీ, బాలసముద్రం, కొత్తూరు జెండా, ప్రేమ్ నగర్ కాలనీ, పోచమ్మకుంట, పెద్దమ్మగడ్డ, కాకతీయ కాలనీ, గోపాల్ పూర్. వరంగల్ లోని ఓ సిటీ, పెరుకవాడ, గణేశ్ నగర్ రంగశాయిపేట్, శంభునిపేట్, రామన్నపేట ప్రాంతాలు కంటైన్ మెంట్ ఏరియాలుగా మారాయి. వరంగల్ అర్బన్ జిల్లాలో కంటైన్మెంట్ జోన్లుగా వసంతపూర్ – ఫోర్ట్ వరంగల్, దీన్‌దయాల్ నగర్ – జూలైవాడ, కరీమాబాద్- ఉర్సు, కొత్తవాడ – 80 అడుగుల రహదారి, మాట్వాడ – ఎస్ కె సేవా సమాజ్ దగ్గర, కిషన్‌పురా – రాఘవేంద్ర టవర్లు, ఎన్జీఓస్ కాలనీ – వడ్డేపల్లి, రెడ్డి కాలనీ – హన్మకొండ.

ఒక్కరోజే 157 కేసులు

ఉమ్మడి వరంగల్ జిల్లాలో సోమవారం ఒక్కరోజే 157 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. వరంగల్ అర్బన్ జిల్లాలో అత్యధికంగా 73, ములుగు జిల్లాలో 9, జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో 26, మహబూబాబాద్ జిల్లాలో 36, జనగామ జిల్లాలో 12, వరంగల్ గ్రామీణ జిల్లాలో 1 కేసు నిర్ధారణ అయినట్లు వైద్యారోగ్యశాఖ వెల్లడించింది.

జిల్లాల వారీగా కేసుల వివరాలు

జిల్లా మొత్తం కేసులు
వరంగల్ అర్బన్ 643
వరంగల్ రూరల్ 223
మహబూబాబాద్ 148
భూపాలపల్లి 109
జనగామ 97
ములుగు 57
మొత్తం 1,277

Advertisement

Next Story