‘పుర’ లెక్కలు.. పూరా చిక్కులు

by Shyam |   ( Updated:2020-03-15 05:15:04.0  )
Municipal election
X

దిశ, నల్లగొండ: పుర ఎన్నిక‌ల్లో రూ.లక్షలు, కోట్లు ఖ‌ర్చు పెట్టిన పుర అభ్యర్థులు.. తీరా అధికారుల‌కు స‌మ‌ర్పిస్తున్న నివేదిక‌ల్లో మాత్రం వేల‌ల్లో చూపిస్తున్నారట. దీంతో అభ్యర్థుల ఎన్నిక‌ల ఖ‌ర్చుల లెక్కల‌ను చూసిన అధికారుల మైండ్ బ్లాక్ అవుతోంద‌ట‌! పుర ఎన్నిక‌ల్లో గెలిచేందుకు అధికార‌ పార్టీ అభ్యర్థి ఒకరు సుమారు రూ.1.50 కోట్ల వ‌ర‌కు ఖ‌ర్చు పెట్టిండనేది టాక్. కానీ, ఆయ‌న స‌మ‌ర్పించిన ఎన్నిక‌ల ఖ‌ర్చు మాత్రం కేవ‌లం రూ.14 వేలే అని నివేదిక సమర్పించడంతో ఈ విష‌యం తెలిసిన వారందరూ న‌వ్వుకుంటున్నారు.

ఓడిపోయినొళ్లే లెక్కలు సమర్పించారు..

రాష్ట్ర రాజ‌ధానికి దగ్గరగా ఉన్న యాదాద్రి భువ‌న‌గిరి జిల్లాలోని 6 మున్సిపాలిటీల్లో 104 వార్డులున్నాయి. వీటిలో భూదాన్‌ పోచంప‌ల్లిలోని ఒక వార్డు మిన‌హా అన్నింటికీ ఎన్నిక‌లు జ‌రిగాయి. 103 వార్డుల్లో వివిధ రాజకీయ పార్టీల నుంచి 313 మంది, 120 మంది ఇండిపెండెట్లు పోటీ చేశారు. ఎన్నికలు ముగిసి.. పాలక వర్గాలు కొలువుదీరాయి. నిబంధనల ప్రకారం ఎన్నికల్లో పోటీ చేసిన అభ్యర్థులు గెలుపు- ఓటములతో సంబంధం లేకుండా 45 రోజుల్లో ఎన్నికలకు సంబంధించి ఎంత మొత్తం ఖ‌ర్చు చేశారో వివ‌రాల‌ను మున్సిపాలిటీ కార్యాల‌యాల్లో సంబంధిత ఆఫీస‌ర్లకు అందించాలి. ఎన్నికల సంఘం ఇచ్చిన గడువు ఈ నెల 9తో పూర్తయింది. పోటీ చేసిన 433 మందిలో ఇప్పటి వరకు 389 మంది అభ్యర్థులు ఆఫీస‌ర్లకు లెక్కలు అందించారు. ఇంకా 44 మంది త‌మ లెక్కల‌ను అందించాల్సి ఉంది. అయితే వీరంద‌రూ ఓడిపోయిన వాళ్లే.

ఖర్చు రూ. లక్షకు మించొద్దు

ఎన్నికల కమిషన్ నిబంధ‌న‌ల ప్రకారం మున్సిపల్ ఎన్నికల్లో పోటీ చేసిన అభ్యర్థులు రూ. లక్షకు మించి ఖర్చు చేయొద్దు. ఇవి కూడా బ్యాంకులో న‌గ‌దు జ‌మ చేసి.. విడ‌త‌ల వారీగా డ్రా చేయాలి. కానీ, ఈ నిబంధ‌న‌ల‌ను ఏ ఒక్క కౌన్సిల‌ర్ అభ్యర్థి కూడా ప‌ట్టించుకోలేదు. ఒక్కో ఓటుకు రూ. 2 వేల‌ నుంచి రూ. 50 వేల వ‌ర‌కు ఖ‌ర్చు చేశారన్న ప్రచారం జ‌రిగింది. ఇండిపెండెంట్లు స‌హా పార్టీల‌తో సంబంధం లేకుండా ఒక్కొక్కరు రూ. 25 లక్షల నుంచి రూ. 2 కోట్లకు పైగా ఖర్చు చేశారన్నది బహిరంగ రహస్యం. యాదగిరిగుట్టలో ఒక అభ్యర్థి త‌న ఇంటినే అమ్మి పోటీ చేసిన సంగ‌తి తెలిసిందే. ఆలేరులో ఒక అభ్యర్థి కుమార్తె పెండ్లి కోసం స‌మ‌కూర్చుకున్న డ‌బ్బుతో పాటు అప్పు తెచ్చి మ‌రీ ఖ‌ర్చు చేశారు. అయితే, లక్షకు మించి ఖర్చు చేస్తే గెలిచిన అభ్యర్థిపై అన‌ర్హత వేటు ప‌డుతుంది. ఈ భ‌యంతోనే లెక్కలు ఎలా చూపాలో తెలియ‌క అభ్యర్థులు ఇన్నాళ్లు కాల‌యాప‌న చేశారు. దీంతో మున్సిప‌ల్ ఆఫీస‌ర్లే.. స‌ద‌రు అభ్యర్థుల‌కు ఫోన్ చేసి మ‌రీ..ఎన్నిక‌ల ఖ‌ర్చుల లెక్కలు ఇవ్వండ‌య్యా..! అని బ‌తిమాలిన సంద‌ర్భాలు కూడా ఉన్నాయి. ఆఫీస‌ర్లు ఫోన్ చేయ‌డంతో.. కొంద‌రు అభ్యర్థులు త‌మ లెక్కల‌ను రూ. ల‌క్షకు మించి కూడా తెచ్చారు. దీంతో త‌ల ప‌ట్టుకున్న ఆఫీస‌ర్లు.. లెక్కలు ఎలా వేసుకొని రావాలో వారే ద‌గ్గరుండి చూపించి తెప్పించార‌ని తెలుస్తోంది.

ఓడిన అభ్యర్థి రూ. 14 వేలు.. గెలిచిన అభ్యర్థి రూ.21 వేలు

ఎన్నిక‌ల్లో పోటీ చేసిన అభ్యర్థుల లెక్కలు చూస్తే.. ఆశ్చర్యం క‌ల‌గ‌క మాన‌దు. ఒక్కో అభ్యర్థి రూ. 14 వేల నుంచి రూ. 99,800 వ‌ర‌కే ఖ‌ర్చు చేసిన‌ట్టు లెక్కలు స‌మ‌ర్పించారు. ఒక మున్సిపాలిటీలో రెండో స్థానంలో నిలిచిన ఒక అభ్యర్థి రూ. 14,500 మాత్రమే ఖ‌ర్చు చేసిన‌ట్టు లెక్కలు చూపారు. గెలిచిన ఒక కౌన్సిల‌ర్ మాత్రం రూ. 21,400 ఖ‌ర్చు చేసిన‌ట్టు చూపించారు. ఎన్నిక‌ల ఖ‌ర్చు చూపించండి అంటూ ఓ మున్సిపాలిటీ ఆఫీస‌ర్‌.. గెలిచిన కౌన్సిల‌ర్‌కు ఫోన్ చేస్తే.. స‌ద‌రు వ్యక్తి రూ. 1.55 ల‌క్షలు ఖ‌ర్చు చేసిన‌ట్టు లెక్కలు తీసుకొని వ‌చ్చాడు. ఇది గ‌మ‌నించిన ఆఫీస‌ర్‌.. బాబు దీనిని రూ. 99 వేల‌కు కుదించుకొని రా..! అని చెప్పి పంపించిన‌ట్టు స‌మాచారం. దీంతో సద‌రు కౌన్సిల‌ర్ మ‌ళ్లీ లెక్కలు వేసుకొని రూ. 99,800 ఖ‌ర్చు చేసిన‌ట్టు చూపించారు.

ఖ‌ర్చు రూ. 2 కోట్లు.. చూపింది రూ. 82 వేలే

ఎన్నిక‌ల ప్రచార స‌మ‌యంలో ఒక్కో అభ్యర్థి ఓటుకు రూ.1000 నుంచి రూ.40 వేల వ‌ర‌కూ ఖ‌ర్చు చేశారు. ఇందులో చౌటుప్పల్ మున్సిపాలిటీ రికార్డ్ బ్రేక్ చేసింది. ఈ మున్సిపాలిటీలోని ఒక వార్డులో సీపీఐ(ఎం), టీఆర్ఎస్, బీజేపీ అభ్యర్థులు పోటీప‌డి మ‌రీ ఖ‌ర్చు చేశారు. ఈ వార్డులో సీపీఐ(ఎం) అభ్యర్థి ఒక్కో ఓటుకు రూ.30 వేలు పంపిణీ చేస్తే.. టీఆర్ఎస్ అభ్యర్థి రూ.40 వేలు చొప్పున పంపిణీ చేశారు. చివ‌ర‌కు టీఆర్ఎస్ అభ్యర్థి గెలుపొందాడు. వీరిద్దరూ ఈ వార్డులో ఖ‌ర్చు చేసింది అక్షరాల రూ.4 కోట్లు. వీరిలో గెలిచిన అభ్యర్థి తాను ఖ‌ర్చు చేసింది కేవ‌లం రూ.82 వేలే అని లెక్కలు స‌మ‌ర్పించ‌డం గ‌మ‌నార్హం.

లెక్కలు అప్పజెప్పకుంటే..

ఎన్నికల కమిషన్ సూచించిన నిర్దేశిత గడువులోపు అభ్యర్థులు తమ ఎన్నికల ఖర్చులకు సంబంధించి వివరాలు సమర్పించకపోతే తదుపరి జరిగే ఎన్నికల్లో పోటీ చేసే అర్హతను కోల్పోతారు. ఎన్నికల కమిషన్ ఆరేళ్ల పాటు సదరు అభ్యర్థిని ఎన్నికల్లో పోటీ చేయకుండా అనర్హత వేటు వేస్తుంది. అయితే, గ‌డువు ముగిసినా.. మ‌రో 44 మంది ఇప్పటివ‌ర‌కూ లెక్కలు చూప‌లేదు.

మున్సిపల్ వార్డులు పోటీ చేసినోళ్లు లెక్కలు సమర్పించనివారు

భువనగిరి 35 161 —
చౌటుప్పల్ 20 075 12
పోచంపల్లి 13 052 14
ఆలేరు 12 052 —
యాదగిరిగుట్ట 12 048 03
మోత్కూరు 12 045 15

Tags : Municipal election, Contestants, Affidavit, Campaigning details

Advertisement

Next Story

Most Viewed