ఈవీఎంల భద్రత కోసం రాష్ట్ర వ్యాప్తంగా గోదాముల నిర్మాణం

by Shyam |
safety of EVMs
X

దిశ ప్రతినిధి, మేడ్చల్: తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నికల సమయంలో అవసరమైన ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్ (ఈవీఎం), వీవీ ప్యాట్ల భద్రత కోసం అన్ని జిల్లాల్లో ప్రత్యేక గోదాము(స్ట్రాంగ్ రూమ్)లు నిర్మిస్తున్నట్లు రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి డాక్టర్ శశాంక్ గోయల్ అన్నారు. ఈ మేరకు శుక్రవారం మేడ్చల్ – మల్కాజిగిరి జిల్లాలోని శామీర్ పేట్ మండలంలోని అంతాయపల్లిలో నూతన కలెక్టరేట్ ప్రాంగణంలో రూ.1.95 కోట్లతో నిర్మించిన ఈవీఎంలు, వీవీ ప్యాట్ గోదాములను రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి గోయల్ జిల్లా కలెక్టర్ హరీష్, అదనపు కలెక్టర్ నర్సింహారెడ్డి, జిల్లా రెవెన్యూ అధికారి లింగ్యానాయక్ తో కలిసి ప్రారంభించారు.

ఈ సందర్భంగా రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి డాక్టర్ శశాంక్ గోయల్ మాట్లాడుతూ.. జిల్లా వ్యాప్తంగా అన్ని ఎన్నికల సమయాలలో ఎన్నికల కోడ్ వెలువడినప్పటి నుంచి ఎన్నికల ప్రక్రియ మొత్తం పూర్తయ్యే వరకు ఈవీఎంలు ఎంతో ముఖ్యమైనవని అన్నారు. దీనిని దృష్టిలో ఉంచుకొని ఎన్నికల సంఘం ఈవీఎంల భద్రత కోసం ప్రత్యేక దృష్టిసారించిందన్నారు. నిధులకు ఎలాంటి కొరత లేకుండా అన్ని హంగులతో ఈవీఎంలు, వీవీ ప్యాట్ల కోసం ప్రత్యేకంగా గోదాములు (స్ట్రాంగ్ రూమ్ లు) నిర్మించేందుకు నిర్ణయించినట్లు వివరించారు. ఈ సందర్భంగా భవనంతో పాటు రోడ్డు, కాంపౌండ్ వాల్వ్ లను గోయల్ పరిశీలించారు. ప్రస్తుతం కొత్తగా నిర్మించిన స్ట్రాంగ్ రూమ్ గోదాములలో జిల్లాలోని ఆయా నియోజకవర్గాల వారీగా ఈవీఎంలను భద్రపరచడానికి అనువుగా ఎలాంటి ఇబ్బంది లేకుండా కంపార్టుమెంట్లు ఏర్పాటు చేయాలని ఈ సందర్భంగా అధికారులకు సూచించారు.

జిల్లా కలెక్టర్ హరీష్ మాట్లాడుతూ.. ప్రతి ఎన్నికల సమయంలో ఈవీఎంలు, వీవీ ప్యాట్లను జిల్లా కలెక్టరేట్ ఆవరణలోని స్ట్రాంగ్ రూమ్ ల నుంచే తీసుకువెళ్ళడం, తిరిగి అక్కడే భద్రపరచడం వల్ల సమయం వృథా కాకుండా ఉండటంతో పాటు ప్రత్యేక భద్రత కల్పించడం వల్ల ఎలాంటి ఇబ్బందులు ఉండవని కలెక్టర్ హరీశ్ తెలిపారు. గతంలో ఎన్నికల సమయానికి ముందు ప్రభుత్వ, ప్రైవేట్ విద్యా సంస్థల్లో వీటిని భద్రపరచడం ఎన్నికల సమయానికి డిస్ట్రిబ్యూషన్, రిసీవింగ్ సెంటర్ కు తీసుకురావడానికి ఇబ్బందులు ఉండేవని ప్రస్తుతం నిర్మించిన గోదాముల వల్ల ఒకే దగ్గర నుంచి తీసుకువచ్చి తిరిగి అక్కడే స్ట్రాంగ్ రూమ్ లో భద్రపరచడం జరుగుతుందన్నారు. అనంతరం ఈవీఎం గోదాము (స్ట్రాంగ్ రూమ్) ఆవరణలో అధికారులతో కలిసి మొక్కలు నాటారు. ఈ కార్యక్రమంలో ఆర్ అండ్ బి అధికారి శ్రీనివాస్ మూర్తి, ఆర్డీవో రవి, మండల తహశీల్దార్ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Next Story