కాంగ్రెస్ కా హానీ.. నేతల కహానీ!

by Shyam |
కాంగ్రెస్ కా హానీ.. నేతల కహానీ!
X

దిశ, న్యూస్ బ్యూరో: ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో ఓ వెలుగు వెలిగిన కాంగ్రెస్ పార్టీ పరిస్థితి ప్రత్యేక రాష్ట్రంలో కొడిగట్టినట్టుగా ఉంది. ప్రస్తుతం ఆ పార్టీని గాడిలో పెట్టే నాథుడే కరవయ్యాడు. పార్టీలో ఉన్న బడానేతలు ఎవరి అజెండా వారిదన్నట్లుగా వ్యక్తిగత ఇమేజ్ కోసం పాకులాడుతున్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ బలోపేతం కోసం ఎలాంటి కృషి జరగడం లేదన్న వాదనలు ఆ పార్టీ శ్రేణుల నుంచే వినిపిస్తున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో చేసేది ఏమి లేక క్యాడర్ తమ దారి తమది అన్నట్లు ఎవరికి వారు ప్రత్యామ్నాయం వెతుక్కుంటున్నారు. పరిస్థితి ఇలానే ఉంటే రాష్ట్రంలో కాంగ్రెస్ మనుగడ ప్రశ్నార్థకమే అంటున్నారు రాజకీయ విశ్లేషకులు.

కొంతమంది నేతలు పదవులపై చూపెడుతున్న ఉత్సాహం పార్టీ బలోపేతంపై ప్రదర్శించకపోవడంతో రోజురోజుకూ కాంగ్రెస్ పతనం వైపు దిగజారుతోందని కార్యకర్తల్లో చర్చ జరుగుతోది. అసెంబ్లీ ఎన్నికల్లో గెలిపించుకున్న 19 ఎమ్మెల్యేల్లో చివరికి మిగిలింది ఆరుగురు మాత్రమే. ఇంత పెద్ద సంఖ్యలో ఎమ్మెల్యేలు కాంగ్రెస్‌ను వీడి వేరే పార్టీలో చేరారంటే నాయకత్వం వీక్‌‌‌‌‌‌‌గా ఉండటమే కారణమంటున్నారు ఆ పార్టీ నాయకులు. రాష్ట్రంలో నెలకొన్న ప్రజా సమస్యలపై పార్టీ నాయకత్వం కలసికట్టుగా పోరాటం చేయాల్సింది పోయి వ్యక్తిగత ఇమేజ్ కోసం ఎవరికి తోచిన కార్యక్రమాలను వారు చేసుకుంటున్నారు. పీసీసీ ప్రెసిడెంట్‌ ఎన్.ఉత్తమ్‌కుమార్‌రెడ్డి గత ఆరు నెలల నుంచి గాంధీభవన్‌కు అప్పుడప్పుడు వస్తూ మొక్కుబడిగా కార్యక్రమాల్లో పాల్గొనడం ఆ పార్టీని మరింత సమస్యలోకి నెట్టివేసినట్లయింది. గాడిన పెట్టాల్సిన పెద్దలే పార్టీ వ్యవహారాలను పట్టించుకోకుండా తమ సొంత నియోజకవర్గాలకే పరిమితం అవుతున్నారు.

రాష్ట్ర ప్రజానీకంలో కాంగ్రెస్ పార్టీపై నమ్మకం క్రమేణా సన్నగ్గిలుతోంది. ఎప్పటి నుంచో పీసీసీ బాధ్యతల నుంచి తప్పించండని ఉత్తమ్‌కుమార్‌రెడ్డి అధిష్ఠానంతో మొరపెట్టుకుంటున్న విషయం తెలిసిందే. ఎలాగూ పార్టీ బాధ్యతలు నుంచి బయటికి వస్తున్న రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాలు తనకేమి అన్నట్టు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి వ్యవహరిస్తున్నారు. సొంత నియోజకవర్గంలో జరిగే కార్యక్రమాలకే ఆయన ప్రాధాన్యం ఇస్తున్నారని కార్యకర్తలు అంటున్నారు. పార్టీ కార్యక్రమాలను పెద్దగా పట్టించుకోవడం లేదన్నఅసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్‌లు రేవంత్‌రెడ్డి, పొన్నం ప్రభాకర్‌ తమ సొంత జిల్లాల్లో జరిగే పార్టీ కార్యక్రమాలకు మాత్రమే హాజరవుతున్నారు. పొన్నం ప్రభాకర్ అప్పుడప్పుడు గాంధీభవన్ కార్యక్రమాలకు వచ్చినా ఆయన ప్రభావం పార్టీ వ్యవహారాలపై పెద్దగా కనిపించడం లేదు. రేవంత్‌రెడ్డి గాంధీ‌భవన్ గడప తొక్కడం అరుదు అనే చెప్పుకోవచ్చు. కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి ఆర్.సి.కుంతియా వస్తే తప్ప గాంధీ‌భవన్‌లో అడుగు పెట్టే పరిస్థితి లేదు. పీసీసీ ఆధ్వర్యంలో ఎలాంటి సమావేశాలు నిర్వహించినా తనకు సంబంధం లేదన్నట్టు వ్యవహరిస్తూ సొంత అజెండాతో ముందుకు పోతున్నారు. పార్టీ నిర్ణయాలతో సంబంధం లేకుండా రేవంత్ తనకు నచ్చిన విధంగా కార్యక్రమాలు చేసుకుంటూ వ్యక్తిగత ఇమేజ్ పెంచుకోవడం తప్ప పార్టీ బలోపెతం కోసం ఎలాంటి ప్రయత్నాలు చేయడం లేదన్న విమర్శలు వినిపిస్తున్నాయి. పీసీపీ పదవి కోసం పైరవీలు చేస్తున్న ఎంపీ కోమటి‌రెడ్డి వెంకట్‌‌రెడ్డి కూడా గాంధీ‌భవన్‌తో సంబంధం లేదన్నట్లు.. పీసీసీ నిర్ణయాలు తనకేమీ పట్టనట్లు వ్యక్తిగత నిర్ణయాలే అజెండాగా ముందుకు పోతున్నారు. ఇలా ఎవరికి వారు వ్యక్తిగత నిర్ణయాలతో తమ బలం పెంచుకునే ప్రయత్నం చేస్తూ పార్టీని గాడిలో పెట్టే బాధ్యతలు మరిచారు.

Advertisement

Next Story