మా పార్టీ అభ్యర్ధుల్ని ఓడించండి.. ప్రచారం చేస్తున్న కాంగ్రెస్, టీఆర్ఎస్ నేతలు

by Anukaran |
మా పార్టీ అభ్యర్ధుల్ని ఓడించండి.. ప్రచారం చేస్తున్న కాంగ్రెస్, టీఆర్ఎస్ నేతలు
X

దిశ,వెబ్‌డెస్క్: ఎన్నికల ప్రచారంలో నేతలు చాలా జాగ్రత్తగా ఉండాలని సూచించిన సంఘటనలు గతంలో చాలానే జరిగాయి. కాదు కూడదు అంటే సోషల్ మీడియా ట్రోల్స్కు బలవ్వాల్సి ఉంటుంది.

ఎన్నికలంటేనే గెలుపు ఓటములు. ప్రచారం చేస్తే అందుకు తగ్గ ఫలితం ఉంటుంది. కానీ అదే ప్రచారంలో ప్రత్యర్ధిని గెలిపించాలనో లేదంటే సొంతపార్టీ నేతల్ని ఓడించాలనో డైలాగ్ కొడితే ఆ తరువాత నాలుక్కరుచుకోవాల్సిందే. అలా తెలంగాణ ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ , టీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు ప్రచారం నిర్వహించారు.

ఖమ్మం, వరంగల్, నల్గొండ జిల్లాల గ్రాడ్యుయేట్ అభ్యర్ధి రాములు నాయక్ ను గెలిపించాలని కోరుతూ కాంగ్రెస్ పార్టీ ప్రచార సభను ఏర్పాటు చేసింది. ఆ సభకు అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి, మరో సీనియర్ నేత జీవన్ రెడ్డితో పాటు చాలా మంది ప్రముఖులే ఉన్నారు. అయితే ఈ సందర్భంగా జనగాం కాంగ్రెస్ అధ్యక్షుడు రాఘవరెడ్డి టీఆర్ఎస్ కు వ్యతిరేకంగా మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీకి చెందిన రాములు నాయక్ ను పదే పదే ఓడించాలని ప్రసంగించారు.

ఇయాలా.. మన ఎమ్మెల్సీ రాములు నాయక్ ను ఓడియకపోతే.. మన రాములు నాయక్ ను ఓడియకపోతే చాలా కష్టాల్లో ఉన్నాం. మన రాములు నాయక్ ను ఓడియకపోతే మనం నాలుగేళ్లు కష్టాల పాలవుతామంటూ నోరు జారారు. అలా నోరు జారిన ప్రతీసారి జీవన్ రెడ్డి వెనుక నుంచి కాలుతో వారించే ప్రయత్నం చేస్తూనే ఉన్నారు. కానీ లాభం లేకపోయింది. ఈ సారి చేయి ఎత్తినా రాఘవరెడ్డి మాట్లాడుతూనే ఉన్నారు. ఇక పక్కనే ఉన్న కాంగ్రెస్ నేత రాఘవరెడ్డి చెవిలో చెప్పే సరికి సైలెంట్ అయ్యారు. కానీ ఏం లాభం అప్పటికే జరగాల్సిన దుష్ప్రచారం జరిగిపోయింది.

జనగాం కాంగ్రెస్ అధ్యక్షుడు రాఘవరెడ్డికి ఏమాత్రం తీసిపోనంటూ స్టేషన్ ఘన్ పూర్ టీఆర్ఎస్ ఎమ్మెల్యే తాటికొండరాజయ్య ప్రసంగించారు. టీఆర్ఎస్ బలపరిచిన ఎమ్మెల్సీ అభ్యర్ధి పల్లారాజేశ్వరెడ్డిని కాంగ్రెస్ బలపరిచిన పల్లారాజేశ్వరెడ్డి అంటూనే ఉన్నారు.

మనం తప్పకుండా కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్ధి మొదటి ప్రాధాన్యత ఓటు పల్లారాజేశ్వర్ రెడ్డికి ఓటేయాలని అన్నారు.

అభ్యర్ధుల్ని పక్కనే ఉంచి అతన్ని ఓడించాలని ఒకరు. అభ్యర్ధి పార్టీ పేరు మార్చి మిక్స్ చేసింది మరొకరు. దీంతో ప్రచారం చేయకపోయినా నష్టం ఉండదు కాని పేరు మార్చి ప్రచారం చేస్తేనే చావుకొస్తుందంటూ తలలు పట్టుకుంటున్నారు పోటీలో ఉన్న అభ్యర్ధులు.

Advertisement

Next Story

Most Viewed