హస్తంలో విమర్శలు.. రేవంత్ ఓ బచ్చా..

by Anukaran |   ( Updated:2020-08-23 21:06:01.0  )
హస్తంలో విమర్శలు.. రేవంత్ ఓ బచ్చా..
X

దిశ, న్యూస్ బ్యూరో: కాంగ్రెస్ పార్టీలో ఎదురుదాడి పెరిగింది. మల్కాజ్‌గిరి ఎంపీ రేవంత్‌రెడ్డిపై నేతలంతా ఫైర్ అయ్యారు. శ్రీశైలం ప్రమాద అంశంలో రేవంత్‌రెడ్డి వ్యవహారం, మీడియా ప్రచారంపై ఆ పార్టీ సీనియర్ నేతలు తీవ్రస్థాయిలో ధ్వజమొత్తారు. రేవంత్ పార్టీ నేతలను సంప్రదించి నిరసనలు చేయాలని, తన వర్గంతో సోషల్ మీడియాతో సీఎం రేవంత్, టీపీసీసీ చీఫ్ రేవంత్ అంటూ పెట్టిస్తున్నపోస్టులను తొలగించాలని సూచించారు.

రేవంత్ ఓ బచ్చా..

కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత వీహెచ్ ఆదివారం రేవంత్ వైఖరిని తప్పుపట్టారు. రేవంత్ ఓ బచ్చా అంటూ వ్యాఖ్యానించారు. రేవంత్‌రెడ్డికి పార్టీ తరఫున షోకాజ్ నోటీసు ఇవ్వాలని సూచించారు. రేవంత్‌రెడ్డికి తనతో పొంతన లేదని, చిన్నపిల్లగాడు అంటూ చురకలంటించారు. తనకో లెవల్ ఉందని, రేవంత్‌‌కు ఏం లేదంటూ మండిపడ్డారు. అయితే, ఆయనకు టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ ఇస్తే మేం అడ్డు పడలేదని, కానీ, ఒక్కటే దూకుడు పని చేయదని వీహెచ్ మండిపడ్డారు.

జిమ్మిక్కులతో పదవులు రావు..

మరోవైపు మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి కూడా తీవ్రస్థాయిలో ఆగ్రహించారు. ఏ నేతల అభిమానులు వాళ్లకు అనుకూలంగా పోస్టులు పెట్టుకుంటున్నారన్నారు. స్వార్థం కోసం, హీరోయిజం కోసం రేవంత్ రెడ్డి పనిచేస్తున్నారని, జైళ్లకు వెళితే టీపీసీసీ రాదని సూచించారు. జిమ్మిక్కులు చేస్తే పార్టీలో పదవులు రావని చెప్పారు.

రేవంత్‌కు కాంగ్రెస్ అంటే తమాషా..

ఇక తానే పీసీసీ చీఫ్, తానే సీఎం అంటూ పోస్టులు పెట్టించుకుంటున్న రేవంత్‌రెడ్డిపై అధిష్టానానికి ఫిర్యాదు చేస్తానని కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి ధ్వజమెత్తారు. ఏండ్ల నుంచి పార్టీలో పనిచేసుకుంటూ తన్నులు తిని, అష్టకష్టాలు పడి పార్టీ కోసం పనిచేస్తున్నామన్నారు. కాంగ్రెస్ పార్టీలో పదవి కావాలంటే సోనియా, రాహుల్ డిసైడ్ చేస్తారని, ఎవరు పడితే వారు ప్రకటించుకోరని చెప్పారు. రేవంత్ టీడీపీలోనే ఉండి ఏం చేసుకోలేదని, ఆయనకు కాంగ్రెస్ పార్టీ అంటే తమాషాగా ఉందన్నారు. తనకు కూడా పీసీసీ కావాలని, సీఎం కావాలని ఉంటదని, కాంగ్రెస్ పార్టీలో అందరికీ ఉంటుందని జగ్గారెడ్డి చెప్పారు. సోషల్ మీడియా ప్రచారం ఆపకుంటే..వెంటనే రేవంత్‌ను పార్టీ నుంచి పక్కన పెట్టాలని అధిష్టానాన్ని డిమాండ్ చేస్తాననన్నారు. పార్టీని ఏ విధంగా పైకి లేపాలో, ప్రజల్లోకి తసుకుపోవాలని తమకు తెలుసని చెప్పారు. అసలు హీరో హీరో అంటూ సోషల్ మీడియాలో పెడుతున్నారని, కొడంగల్‌లో ఓడిపోయినోడు హీరో ఎట్లా అవుతాడని ప్రశ్నించాడు. తనను కూడా పులి పులి అంటారని, పులులు, సింహాలు రెండు వేల మెజార్టీతో గెలుస్తారా అని, రాజకీయంలో చుక్కలు చూస్తున్నామని, పైసలు లేనిదే రాజకీయాలు చేయలేమని జగ్గారెడ్డి ఘాటుగా వ్యాఖ్యానించారు. ఏండ్ల నుంచి ప్రతి జిల్లాలో కాంగ్రెస్ నేతలు ఉన్నారని వివరించారు.

రేవంత్‌పై గుర్రు..

కాంగ్రెస్ సీనియర్లంతా రేవంత్‌రెడ్డిపై ఎదురుదాడికి దిగినట్లు ప్రచారం జరుగుతోంది. ఇటీవల రేవంత్‌రెడ్డి మీడియాతో మాట్లాడుతూ తమ పార్టీలోని కొంతమంది ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారని వ్యాఖ్యానించడంపై పార్టీ నేతలు ఆగ్రహంగా ఉన్నట్లు స్పష్టమవుతోంది. ప్రస్తుతం రేవంత్‌రెడ్డిని ఒక్కటిగా చేసిన నేతలు బహిరంగంగా విమర్శలకు దిగడమే కాకుండా..అధిష్టానానికి లేఖలు పంపుతున్నారు.

Advertisement

Next Story

Most Viewed