మంత్రి జ‌గ‌దీష్ రెడ్డికి SLBC పై అవ‌గాహ‌న లేదు

by Shyam |
MP Komati Reddy
X

దిశ, నల్లగొండ: నీళ్లు, నిధులు, నియామ‌కాల పేరుతో తెచ్చుకున్న తెలంగాణ‌లో ప్రస్తుతం న‌ల్లగొండ జిల్లా ఎడారిగా మారుతోంద‌ని భువ‌న‌గిరి ఎంపీ కోమ‌టిరెడ్డి వెంక‌ట్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. శనివారం న‌ల్లగొండ జిల్లా కేంద్రంలో జిల్లా ప‌రిష‌త్ స‌ర్వసభ్య సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్ రెడ్డిలు హాజరైయ్యారు. ఈ సందర్భంగా వారు మీడియాతో మాట్లాడుతూ.. నీళ్లు, నిధులు, నియామ‌కాల నినాదంతో తెచ్చుకున్న తెలంగాణ‌లో న‌ల్లగొండ‌, మ‌హ‌బూబ్ న‌గర్, ఖ‌మ్మం జిల్లాల‌కు సాగునీరు కోసం కృషి చేయ‌కుండా ఎడారిగా మారుస్తున్నార‌ని మండిపడ్డారు. దాదాపు పూర్తైన ప్రాజెక్టుల‌కు కొన్ని నిధులు కేటాయిస్తే వినియోగంలోకి వ‌స్తాయ‌ని తెలిపారు.

ఎక్కడ ఆ ప్రాజెక్టుల వ‌ల్ల కాంగ్రెస్ పార్టీకి పేరు వ‌స్తుందనే భయంతోనే నిధులు కేటాయించడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. చెట్లు పెట్టడం, స్మశాన వాటిక‌లు క‌ట్టడం త‌ప్ప కేసీఆర్ సర్కార్ గ్రామాలకు చేసిందేమి లేద‌న్నారు. ఎల్ఎల్‌బీసీ సొరంగం ప‌నులు కాంగ్రెస్ హ‌యంలో రూ.1300 కోట్లు తీసుకొచ్చి 70శాతం ప‌నులు పూర్తిచేస్తే ఏడేళ్ల కాలంలో టీఆర్ఎస్ స‌ర్కార్ ఒక్క రూపాయి విడుద‌ల చేయ‌డం లేద‌ని తెలిపారు. 2014 ఎన్నిక‌ల్లో కుర్చి వేసుకుని సొరంగం పనులు పూర్తి చేస్తాన‌ని చెప్పిన కేసీఆర్ ఇప్పుడు మాట మాట్లాడ‌డం లేద‌ని విమ‌ర్శించారు. ఈ ప్రాజెక్టు పూర్తి అయితే నాలుగు లక్షల ఎక‌రాలకు సాగునీరు అందుతుంద‌ని తెలిపారు. ఏడేళ్లుగా మంత్రిగా ఉన్న జ‌గ‌దీష్ రెడ్డికి అస‌లు ఎస్ఎల్‌బీసీ మీద అవ‌గాహ‌నే లేద‌న్నారు.

అలాగే మూసీ ప్రాజెక్టుకు రూ.350 కోట్లు కేటాయించి పనులు టీఆర్ఎస్ నేత పొంగ‌ులేటి శ్రీనివాస్ రెడ్డికి చెందిన కంపెనీకి ఇస్తే ఇప్పటికీ ప‌నులు అలానే ఉన్నాయ‌ని విమ‌ర్శించారు. ఉత్తర తెలంగాణ‌లోని కాలువ‌ల‌ను వేల కోట్లతో లైనింగ్ పనులు చేస్తూ ఏఎమ్ఆర్ కెనాల్ లైనింగ్‌కు రూ.200 కోట్లు ఇవ్వకుండా చిన్నచూపు చూస్తున్నారని వెల్లడించారు. ద‌ళిత సీఎం, ద‌ళితుల‌కు మూడెక‌రాల భూమి అని అనేక హామీలు ఇచ్చి, అధికారంలోకి వచ్చాక అందరినీ మోసం చేశారని అన్నారు. బ్రాహ్మణ‌వెల్లంల‌, ఎస్ఎల్‌బీసీ, గౌర‌వెల్లి ప్రాజెక్టు కోసం ప్రజ‌ల‌ను క‌లుపుకొని స‌ర్కార్‌పై పెద్ద ఎత్తున పోరాటం చేస్తామ‌ని స్పష్టం చేశారు. న‌ల్గొండ జిల్లాలో కాంగ్రెస్ పార్టీ చాలా బ‌లంగా ఉంద‌న్నారు. ఇక్కడ ఏ ఒక్క నేత గాలికి గెలువ‌లేద‌న్నారు. కాంగ్రెస్ స‌ర్పంచ్‌ల‌కు నిధులు ఇవ్వడంలేద‌ని మండిప‌డ్డారు. ఇదే విష‌య‌మై హైకోర్టును ఆశ్రయించిన‌ట్లు తెలిపారు. స‌ర్పంచ్ అనే వాడు ఏ పార్టీ గుర్తు మీద గెల‌వ‌డ‌నే విష‌యం గుర్తుపెట్టుకోవాల‌ని తెలిపారు. ప్రతి ఒక్క సర్పంచ్‌కు పార్టీలక‌తీతంగా నిధులు మంజూర‌య్యే వర‌కు ఉద్యమిస్తామ‌ని స్పష్టం చేశారు.

Advertisement

Next Story

Most Viewed