ఆ పార్టీ నేతల ప్రచారం నిల్.. పట్టభద్రుల దారెటు..?

by Anukaran |   ( Updated:2021-03-08 08:43:24.0  )
Congress
X

దిశ ప్రతినిధి, నల్లగొండ: ‘పెట్టెటోడు పెట్టడు.. పెట్టెటోడిని పెట్టనీయడు’ అన్న చందంగా మారింది కాంగ్రెస్ పార్టీ పట్టభద్రుల ఓటర్ల పరిస్థితి. వరంగల్-ఖమ్మం-నల్లగొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో కాంగ్రెస్ శ్రేణులకు విచిత్ర పరిస్థితులు ఎదురవుతున్నాయి. ఎన్నికల ప్రచారంలో ఆయా పార్టీల అభ్యర్థులు, ఇండిపెండెంట్లు హోరాహోరీగా ముందుకుసాగుతుంటే.. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి మాత్రం కనిపించడమే లేదు. పట్టభద్రుల ఓటర్లను అభ్యర్థించడం సంగతమో కానీ.. సొంత పార్టీ ఓటర్లను పలకరించే దిక్కులేకుండాపోయింది. దీంతో కాంగ్రెస్ పార్టీకి చెందిన పట్టభద్రుల ఓటర్లలో అసంతృప్తి రగులుతోంది. కాంగ్రెస్ పార్టీకి కొన్ని నియోజకవర్గాల్లో ఇన్‌చార్జులు లేకపోవడం.. మరికొన్ని నియోజకవర్గాల్లో ఉన్నా క్షేత్రస్థాయిలో ప్రచారం నిర్వహించకపోవడం పార్టీ శ్రేణులను కలవరపాటుకు గురిచేస్తోంది.

క్షేత్రస్థాయిలో కన్పించని ప్రచారం..

ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో టీఆర్ఎస్, బీజేపీ, ఇండిపెండెంట్లు క్షేత్రస్థాయిలో హోరాహోరీగా ప్రచారం నిర్వహిస్తున్నారు. కానీ, కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి రాములునాయక్ ప్రచారం మాత్రం అటకెక్కిందనే చెప్పాలి. కాంగ్రెస్ పార్టీలో రోల్ మోడల్ అని చెప్పుకునే నేతలంతా రాములునాయక్ ప్రచారానికి రాకపోవడం ఓటర్లను విస్మయానికి గురిచేస్తోంది. వాస్తవానికి కాంగ్రెస్ పార్టీలో ఎన్ని అంతర్గత కుమ్ములాటలు ఉన్నా.. ఎన్నికల విషయానికొస్తే.. దాదాపు కలిసిపోయి ప్రచారం చేస్తారు. కానీ పట్టభద్రుల ఎమ్మెల్సీ విషయంలో ఆ స్పష్టత కొరవడింది. ఒక్క ఉత్తమ్‌కుమార్‌రెడ్డి మినహా మిగతా వారెవరూ పెద్దగా ప్రచారంలో కన్పించకపోవడం రాజకీయవర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.

ఇన్‌చార్జుల కొరత

ఉమ్మడి నల్లగొండ జిల్లాలో కాంగ్రెస్‌కు పలు నియోజకవర్గాలకు ఇన్‌చార్జుల కొరత వేధిస్తోంది. ఒకప్పుడు ఆ పార్టీకి కంచుకోటగా నిలిచిన నకిరేకల్, నల్లగొండ నియోజకవర్గాలకు ఇన్‌చార్జులు ఎవరనే దానిపై పార్టీ శ్రేణుల్లోనూ గందరగోళం నెలకొంది. మరికొన్ని నియోజకవర్గాల్లో ఉన్నా.. క్షేత్రస్థాయిలో పట్టభద్రులను కలిసి ఓట్లు అడగడంలో ఘోరంగా విఫలమవుతున్నారనే చెప్పాలి. పార్టీ పదవుల విషయంలో రచ్చ రచ్చ చేసే నాయకులు ప్రచారంలో కన్పించకపోవడం పార్టీలోని అసంతృప్తి వర్గాలను బహిర్గతం చేస్తోంది. ఇదిలా ఉంటే నాగార్జునసాగర్ ఉపఎన్నిక హడావుడిలో ఉన్న టీపీసీసీ నేతలు పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికను అంత పట్టించుకోవడం లేదు.

పార్టీ పట్టభద్రులది అదే పరిస్థితి..

ఉమ్మడి నల్లగొండ జిల్లాలోని పలు నియోజకవర్గాల్లో నాయకత్వలేమి ఉన్నా క్షేత్రస్థాయిలో కార్యకర్తల ఆదరణ మాత్రం తగ్గలేదు. అయితే ప్రచారంలో పాల్గొనాలని పిలుపునిచ్చే నేతలు కరువవ్వడం పార్టీ శ్రేణులను అంతర్మథనంలో పడేస్తోంది. చివరకు ఆ పార్టీ అనుబంధ సంఘాలు, సానుభూతిపరులైన పట్టభద్రులు పార్టీ పరిస్థితిపై డోలాయమానంలో పడ్డారనే చెప్పాలి. అయితే వారు పక్కా కాంగ్రెస్ మనుషులని ముద్రపడడంతో ఇతర పార్టీల నేతలు వారిని పలకరించడం లేదు. ఇటు సొంత పార్టీ నేతలు ఆదరించకపోవడంతో ఓటు ఎవరికి వేయ్యాలనే దానిపై హస్తం పార్టీ పట్టభద్రులు సందిగ్ధంలో పడ్డారనే చెప్పాలి. ఇప్పటికైనా అగ్రనేతలు క్షేత్రస్థాయిలోని పట్టభద్రుల ఓటర్లపై దృష్టి సారించాలని పార్టీ శ్రేణులు కోరుతున్నారు.

Advertisement

Next Story

Most Viewed