వివాదంలో టీఆర్ఎస్ ఎమ్మెల్యే.. కేసు నమోదు..!

by Anukaran |   ( Updated:2021-07-05 00:19:43.0  )
వివాదంలో టీఆర్ఎస్ ఎమ్మెల్యే.. కేసు నమోదు..!
X

దిశ, అచ్చంపేట: కాంగ్రెస్ సీనియర్ నాయకుడిపై టీఆర్ఎస్ ఎమ్మెల్యే దాడి వ్యవహారం నాగర్‌ కర్నూల్‌ జిల్లాలో చర్చనీయాంశంగా మారింది. అచ్చంపేట నియోజకవర్గం లింగాల మండల పరిధిలోని కొత్తకుంటపల్లి గ్రామానికి చెందిన కాంగ్రెస్ పార్టీ సీనియర్ లీడర్ జ్ఞానేశ్వర్ రెడ్డి పై ఆదివారం అర్ధరాత్రి ఎమ్మెల్యే గువ్వల బాలరాజు దాడి చేశారని.. ఎమ్మెల్యే ఇలా చేయడం ఏంటని డీసీసీ అధ్యక్షుడు డాక్టర్ వంశీకృష్ణ తీవ్రంగా ఖండించారు. సోమవారం లింగాల పోలీస్ స్టేషన్ ముందు ధర్నా నిర్వహించారు.

ఈ సందర్భంగా వంశీకృష్ణ మాట్లాడుతూ… నియోజకవర్గంలో ఎమ్మెల్యే గువ్వల బాలరాజు రౌడీయిజానికి వ్యతిరేకంగా ఉద్యమిస్తామని హెచ్చరించారు. నియోజకవర్గ ప్రజలకు సేవ చేసేందుకు గువ్వల రాజకీయాల్లోకి రాలేదని, గూండా గిరి చేసేందుకు వచ్చారని, పోలీసుల సహకారంతో దాడులు చేస్తున్నారని ఆరోపించారు. ఎమ్మెల్యే ఆయన అనుచరులతో దాడులు చేస్తున్నారని, ఇది ప్రజాస్వామ్యం ప్రభుత్వమా, రౌడీ ప్రభుత్వమా అంటూ నిలదీశారు. ఎమ్మెల్యేపై హత్యాయత్నం కేసు నమోదు చేయాలని డిమాండ్ చేశారు.

బాధితుడు మాట్లాడుతూ..

అంతకుముందు బాధితుడు జ్ఞానేశ్వర్ రెడ్డి మాట్లాడుతూ.. ఎమ్మెల్యే వాహనం ఆదివారం రాత్రి తన ఇంటి ముందుకు వచ్చిందన్నారు. ఇదే క్రమంలో రాజకీయం చాలా ఎక్కువ అయింది రా అంటూ.. ఎమ్మెల్యే గువ్వల బాలరాజు మీదకు వచ్చారని, ఎమ్మెల్యే పురమాయించడంతో డ్రైవర్ దాడి చేశాడని జ్ఞానేశ్వర్ తెలిపారు. దీనికితోడు పోలీసులు కూడా తనను పట్టుకున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.

పోలీసులను నిలదీసిన సతీష్ మాదిగ..

కాంగ్రెస్ పార్టీ కార్యకర్త జ్ఞానేశ్వర్ రెడ్డి పై ఎమ్మెల్యే దాడి చేసిన విషయం తెలుసుకున్న కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి దేవని సతీష్ మాదిగ ఆదివారం అర్ధరాత్రే స్టేషన్‌లోని పోలీసులను నిలదీశారు. అప్రజాస్వామికంగా ఒక ప్రజా ప్రతినిధి దాడులు చేయడం దారుణమన్నారు. ఇందుకు పోలీసులు అధికార పార్టీ నాయకులకు తొత్తులుగా మారకూడదని, ప్రజాస్వామ్యాన్ని కాపాడాలని, ఎమ్మెల్యేపై కేసు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. పోలీసుల సమక్షంలో దాడులు చేస్తున్నారంటే పరిస్థితి మరింత విషమంగా మారుతోందన్నారు. గువ్వలపై కేసు నమోదు చేసేంతవరకు కదిలేది లేదని… వాదిస్తూ కేసు నమోదు అనంతరం స్టేషన్ నుంచి వెనుదిరిగారు సతీష్. ఈ సంఘటనతో మరోసారి అచ్చంపేట నియోజకవర్గంలో అధికార-ప్రతిపక్ష పార్టీల మధ్య అగ్గి రాజుకుంది.

Advertisement

Next Story

Most Viewed