గాంధీభవన్ సాక్షిగా… రేవంత్‌ను నిలదీసిన కాంగ్రెస్ నేతలు

by Shyam |   ( Updated:2021-11-03 05:30:28.0  )
గాంధీభవన్ సాక్షిగా… రేవంత్‌ను నిలదీసిన కాంగ్రెస్ నేతలు
X

దిశ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ పీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డి ఆ పార్టీ నేతలకు టార్గెట్ అయ్యారు. హుజూరాబాద్‌లో ఘోరంగా ఓడిపోవడంపై పలువురు నేతలు నిలదీశారు. అభ్యర్థి ఎంపికలోనే లోపముందని, గెలుపు కోసం పార్టీ సీరియస్‌గా వ్యవహరించలేదని విమర్శించారు. పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి మాణిక్కం ఠాగూర్ సమక్షంలోనే రేవంత్‌పై ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఇతర పార్టీలతో లోపాయికారీ ఒప్పందం కుదుర్చుకున్నట్లు కూడా వ్యాఖ్యలు వెల్లువెత్తాయి. రాష్ట్ర రాజకీయ వ్యవహారాల కమిటీ సమావేశంలో ప్రస్తుతం జరుగుతున్న సభ్యత్వ నమోదు, ఇకపై ఆన్‌లైన్ ద్వారా చేపట్టాల్సిన డిజిటల్ మెంబర్‌షిప్ డ్రైవ్ గురించి చర్చించాల్సి ఉన్నప్పటికీ.. వాటి గురించి చర్చించలేదు. హుజూరాబాద్ ఫలితంపైనే ప్రధాన చర్చ జరిగింది.

కాంగ్రెస్ పార్టీకి స్పష్టమైన ఓటు బ్యాంకు ఉన్నప్పటికీ.. బలహీనమైన అభ్యర్థిని నిలబెట్టి ఉద్దేశపూర్వకంగానే ఓడిపోయేలా పార్టీ నాయకత్వం వ్యవహరించిందని వ్యాఖ్యానించారు. ఈ క్రమంలో సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క, సీనియర్ నాయకురాలు రేణుకాచౌదరి మధ్య కూడా ఘాటుగానే వాదన జరిగినట్లు సమావేశంలో పాల్గొన్నవారు తెలిపారు. హుజూరాబాద్ విషయంలో కోమటిరెడ్డి వెంకటరెడ్డి, జగ్గారెడ్డి ఇప్పటికే బహిరంగ వ్యాఖ్యలు చేసి రేవంత్ వ్యవహారశైలిని తప్పుపట్టారు. సమావేశానికి హాజరైన జానారెడ్డి.. తన అవసరం ఉన్నట్లయితేనే జోక్యం చేసుకుంటానని, ఇప్పుడు ఆ చొరవ తీసుకోలేనని చెప్పి పది నిమిషాలు మాత్రమే సమావేశంలో పాల్గొని వెళ్ళిపోయారు.

2023 వరకు నేను ఏం మాట్లాడను.. ఆ తర్వాతే నోరు విప్పుతా : జగ్గారెడ్డి

Advertisement

Next Story

Most Viewed