హస్తం ఆగమాగం.. అధిపత్యం కోసం అంతర్గత కుమ్ములాట

by Shyam |
హస్తం ఆగమాగం.. అధిపత్యం కోసం అంతర్గత కుమ్ములాట
X

దిశ ప్రతినిధి, మేడ్చల్: మేడ్చల్ జిల్లాలో హస్తం పార్టీ ఆగమాగమవుతుంది. ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే కూన శ్రీశైలం గౌడ్ పార్టీకి రాజీనామా చేసి, బీజేపీలో చేరడం అధిష్టానాన్ని షాక్‌కు గురిచేసింది. దీంతో జిల్లాలో కాంగ్రెస్‌కు కొలుకోలేని దెబ్బ తగిలింది. ఆ పార్టీ పీసీసీ రేసులో ఉన్న రేవంత్ రెడ్డికి ముఖ్య అనుచరుడిగా ఉన్న ‘కూన’ పార్టీని వీడడం తీవ్ర చర్చకు దారితీస్తోంది. శ్రీశైలం గౌడ్ పార్టీని వీడడంతో జిల్లాలో ఆ పార్టీపై తీవ్ర ప్రభావం చూపడంతోపాటు పార్టీలో రేవంత్ హవాకూ కొంత మేర బ్రెక్ పడే అవకాశాలున్నట్లు అభిప్రాయం వ్యక్తమవుతోంది.

మరికొందరి చూపు కమలం వైపు…

కాంగ్రెస్ నుంచి పీసీసీ రేసులో ఉన్న కీలక నేత రేవంత్ రెడ్డి మేడ్చల్ జిల్లా అంతటికి పార్లమెంట్ సభ్యుడిగా కొనసాగుతున్నారు. జిల్లా పరిధిలో 38మంది జీహెచ్ఎంసీ కార్పొరేటర్లకు గాను ఇటీవల జరిగిన బల్దియా ఎన్నికల్లో కేవలం ఇద్దరు మాత్రమే కాంగ్రెస్ తరపున కార్పొరేటర్లుగా గెలుపొందారు. ఇప్పటికే ఆ పార్టీ అధిష్ఠానం పీసీసీ ఎంపికను నాన్చడం.. రేవంత్ రెడ్డికి పగ్గాలు కట్టబెట్టకపోవడంతో మనస్తాపానికి గురై కూన శ్రీశైలం గౌడ్ పార్టీకి రాజీనామా చేసినట్లు చర్చ నడుస్తోంది. కష్టకాలంలో ఓ వైపు బీజేపీ పుంజుకొని, అధికార పార్టీకి ప్రత్యామ్నాయ శక్తిగా ఎదుగుతుంటే. మరోవైపు పార్టీలో ఆధిపత్యం కోసం కొనసాగుతున్న అంతర్గత కుమ్ములాటలు పార్టీ శ్రేణులను మరింత కుంగతీస్తున్నాయి.

సంస్థాగతంగా..

గత ఏడేళ్లుగా కాంగ్రెస్ పార్టీ సంస్థాగతంగా బలహీనపడింది. తెలంగాణ ఏర్పడిన తర్వాత 2014లో జరిగిన సాధారణ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఘోర పరాజయం పాలవ్వగా, అప్పట్లో గ్రేటర్ నుంచి గెలిచిన ఎమ్మెల్యేలు పార్టీని విడి అధికార పక్షంలో చేరారు. రెండున్నరేళ్ల క్రితం (2018లో) జరిగిన శాసనసభ ఎన్నికల అనంతరం కూడా అదే పరిస్థితి పునరావృతమైంది. కాంగ్రెస్ ప్రజా సమస్యలపై దృష్టి సారించి ప్రజల మద్దతు కూడగట్టుకోలేక పోవడంతోపాటు సంస్థాగతంగా బలపడడంలో కూడా వెనుకబడింది. దీంతో ఆ పార్టీ ఉనికిని కోల్పోయినట్లయింది. జిల్లాలో బల్దియా ఎన్నికలు తీవ్ర ప్రభావం చూపాయి. సిట్టింగ్ ఎంపీ, కార్యనిర్వహక అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ఎన్నికల ప్రచారంలో అంత తానై వ్యవహారించినా రెండు సీట్లకే పరిమితం కావడం, జీహెచ్ఎంసీ ఎన్నికలపై ఎన్నో ఆశలు పెట్టుకున్నప్పటికీ అధికార పక్షం ముందు కాంగ్రెస్ నిలబడలేకపోయింది. తాజా రాజకీయ పరిణామాలతో ప్రదేశ్ కాంగ్రెస్ పార్టీతోపాటు ఆ పార్టీ జి రథసారథులు సైతం పదవులకు రాజీనామాలు చేయడంతో పార్టీ భవితవ్యం ప్రశ్నార్థకంగా మారింది.

Advertisement

Next Story