అసోం ప్రజలు తెలివిగా ఓటేయాలి : మన్మోహన్ సింగ్

by Shamantha N |
Congress leader Manmohan Singh
X

న్యూఢిల్లీ: అసోం ప్రజలు తెలివిగా ఓటేయాలని, ప్రజాస్వామ్యాన్ని, రాజ్యాంగాన్ని పరిరక్షించే ప్రభుత్వాన్ని గెలిపించుకోవాలని మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ పిలుపునిచ్చారు. రాష్ట్ర అసెంబ్లీ తొలి విడత ఎన్నికలకు ఒక రోజు ముందు అసోం ప్రజలనుద్దేశించి వీడియో సందేశమిచ్చారు. 1991 నుంచి 2019 వరకు అసోం నుంచి రాజ్యసభకు ఎంపీగా ఎన్నికైన సింగ్ మాట్లాడుతూ, ‘దశాబ్దాలుగా అసోం నాకు రెండో ఇల్లులాంటిది. కేంద్ర ఆర్థిక మంత్రిగా, పదేళ్లు దేశ ప్రధానిగా సేవలందించడానికి అసోం ప్రజలు నాకు అవకాశమిచ్చారు. ఈ రోజు నేను మీలో ఒకడిగా మాట్లాడుతున్నాను.

మీరు మీ భవిష్యత్తు, మీ పిల్లల భవిష్యత్తును నిర్ణయించుకునే తరుణం ఆసన్నమైంది. ఈ ఎన్నికల్లో తెలివిగా ఓటేయండి. తరుణ్ గొగోయ్ సారథ్యంలో అసోం శాంతి మార్గంలో ప్రయాణాన్ని ప్రారంభించింది. కానీ, ఇప్పుడు మరో సవాల్‌ను ఎదుర్కొంటున్నది. మతం, సంస్కృతి, భాషల ఆధారంగా సమాజాన్ని విచ్ఛిన్నం చేస్తున్నారు. భయోత్పాత వాతావరణం నెలకొంది. అందుకే ప్రజలు ఆలోచించి ఓటేయాలి. ప్రజాస్వామ్యాన్ని, రాజ్యాంగాన్ని పరిరక్షించే ప్రభుత్వానికి ఓటేయండి’ అని తెలిపారు. అలాగే, అసోంలో కాంగ్రెస్ మ్యానిఫెస్టోలోని ఐదు హామీలను గుర్తుచేశారు. కాంగ్రెస్‌కు అధికారమిస్తే సీఏఏను రద్దు చేస్తామని, ఉద్యోగాలిస్తామని, తేయాకు కార్మికులకు వేతనాలు పెంచుతామని, 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్, ప్రతి కుటుంబానికి రూ. 2000ల అలవెన్సులు అందిస్తామని తెలిపారు.

Advertisement

Next Story

Most Viewed