జగన్‌కు సాధ్యమైంది.. కేసీఆర్‌కు ఎందుకు కాదు.. కుంభం అనిల్ ప్రశ్న

by Shyam |
Congress leader Kumbham Anilkumar reddy
X

దిశ, భువనగిరి: కరోనా, బ్లాక్ ఫంగ‌స్‌ వ్యాధులకు ప్రభుత్వమే పూర్తిగా ఉచిత చికిత్సను అందించాల‌ని కాంగ్రెస్ యాదాద్రి-భువనగిరి జిల్లా అధ్యక్షుడు కుంభం అనిల్ కుమార్ రెడ్డి అన్నారు. సోమవారం భువనగిరి జిల్లా కేంద్రంలోని బాబు జగ్జీవన్‌రామ్ చౌరస్తా వద్ద కాంగ్రెస్ ఆధ్వర్యంలో సత్యాగ్రహ దీక్ష చేపట్టారు. ఈ దీక్షలో పాల్గొన్న కుంభం అనిల్ మాట్లాడుతూ… జిల్లాలోని ప్రతి ఒక్కరికీ ఉచితంగా వ్యాక్సిన్ అందించాల‌ని, అలాగే బ్లాక్ ఫంగస్, కరోనా చికిత్సలను ఆరోగ్య శ్రీలో చేర్చాలని డిమాండ్ చేశారు. కరోనా మహమ్మారిని అడ్డుకోవడంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పూర్తిగా విఫలం అయ్యాయని విమర్శించారు.

కరోనా సోకిన బాధితులు రోగంతో పోరాడుతుంటే.. ప్రైవేట్ ఆస్పత్రి యాజమాన్యాలు అధిక బిల్లులతో చంపుతున్నారని మండిపడ్డారు. ప్రైవేట్, కార్పొరేట్ ఆస్పత్రులు కరోనా చికిత్స పేరుతో బాధితుల రక్తం తాగుతున్నా.. ప్రభుత్వాలు ఎందుకు పట్టించుకోవడం లేదని ప్రశ్నించారు. పక్క రాష్ట్రంలో చిన్న వయసున్న ముఖ్యమంత్రి జగన్‌ కరోనా, బ్లాక్ ఫంగస్ చికిత్సలు ఆరోగ్య శ్రీలో చేర్చినప్పుడు ఎంతో అనుభవం ఉన్న కేసీఆర్‌కు ఎందుకు సాధ్యం కావడం లేదని అన్నారు. నేడు జరుగబోయే కేబినేట్ సమావేశంలో అధికారికంగా కరోనా, బ్లాక్ ఫంగస్ చికిత్సలను ఆరోగ్య శ్రీలో చేర్చుతున్నట్లు ప్రకటించాలని డిమాండ్ చేశారు.

Advertisement

Next Story