కేసీఆర్ కూటమిలోకి కాంగ్రెస్.. నిజమేనా ?

by Anukaran |
కేసీఆర్ కూటమిలోకి కాంగ్రెస్.. నిజమేనా ?
X

దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణ సీఎం కేసీఆర్ పెట్టే కూటమిలో కాంగ్రెస్ చేరబోతుందా? లేకుంటే కేసీఆర్ తీసుకునే నిర్ణయాలకు వెనుక నుండి సపోర్ట్ చేయనుందా? ఈ మేరకు జాతీయ నేతలు, రాష్ట్ర నేతలను హైకమాండ్‌ రెడీ చేస్తుందా! అంటే అవుననే చర్చ.. ప్రస్తుతం రాష్ట్ర రాజకీయాల్లో తెరపైకి వస్తోంది. గత మూడేళ్లుగా నేషనల్ పాలిటిక్స్‌పై ఫోకస్ పెట్టిన కేసీఆర్ 2019పార్లమెంట్ ఎన్నికల సమయంలోనే ఢిల్లీ వెళ్లి దేశానికి దిశా నిర్దేశం చేస్తానన్నారు. కానీ ఎన్డీయే బంపర్ మెజార్టీతో గెలవడంతో తన ప్రయత్నాలను వాయిదావేసిన కేసీఆర్.. కొంతకాలం బీజేపీతో సఖ్యతగానే మెలిగారు. అయితే రాష్ట్ర రాజకీయాల్లో ఇటీవలే చోటుచేసుకున్న పరిణామాల అనంతరం తన వైఖరిలో మార్పొచ్చింది. ఈ నేపథ్యంలోనే కేంద్రం తీసుకొచ్చిన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా చేపట్టిన భారత్ బంద్‌కు కేసీఆర్ మద్దతు ఇవ్వడం, మరుసటి రోజే కాంగ్రెస్‌ సైతం ధర్నాల్లో పాల్గొంటామని స్పష్టం చేయడంతో ఎక్కడో టీఆర్ఎస్, కాంగ్రెస్ మధ్య రాజీ కుదిరిందన్న అనుమానాలకు బలం చేకూరుతోంది.

జాతీయ పార్టీలైన కాంగ్రెస్, బీజేపీ దేశంలో ఎక్కువకాలం పరిపాలన కొనసాగించాయి. స్వాతంత్ర్యానికి ముందే కాంగ్రెస్ పార్టీ పుట్టగా, దానికి వ్యతిరేకంగా బీజేపీ పురుడు పోసుకుంది. అయితే 2014 నుంచి కాంగ్రెస్ పార్టీ దేశవ్యాప్తంగా బలహీనపడటంతో.. భారతీయ జనతా పార్టీకి ఎదురే లేకుండా పోయింది. కాంగ్రెస్ ‘ముక్త్ భారత్‌’ నినాదాన్ని ఆరేళ్ల కిందనే ప్రకటించిన కమలనాథులు ఆ దిశగానే అడుగులు వేస్తూ దేశంలో మెజార్టీ రాష్ట్రాల్లో అధికారం చేజిక్కించుకున్నారు. ఈ క్రమంలోనే కాంగ్రెస్‌ పార్టీని కోలుకోనీయకుండా వ్యూహాలు రచిస్తూ అమలుచేయడంలో సక్సెస్ అవుతున్నారు. అలా కీలక రాష్ట్రాల్లోని నేతలకు కాషాయ కండువాలు కప్పి, కాంగ్రెస్‌ను అంతర్గతంగా దెబ్బతీస్తున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో కార్యకర్తలకు అండగా ఉండాల్సిన కాంగ్రెస్ హైకమాండ్.. ఆ ప్రయత్నాలు చేయకపోవడం ఆ పార్టీ పరిస్థితిని రోజురోజుకూ దిగజారుస్తోంది.

దేశవ్యాప్తంగా కాంగ్రెస్ బలహీనపడటం.. ప్రత్యామ్నాయంగా మరో పార్టీ కనపడక పోవడం వల్లే జాతీయ స్థాయిలో బీజేపీని ఆదరిస్తున్నారన్న పాయింట్‌ రైజ్ అవుతోంది. మరోవైపు కాంగ్రెస్‌ పార్టీ బాధ్యతల విషయంలో రాహుల్‌గాంధీ వెనుకడుగు వేయడమూ వారికి అనుకూలంగా మారింది. ఇదే క్రమంలో ఎన్డీయే తీసుకుంటున్న నిర్ణయాలపై ఒంటికాలిపై లేస్తున్న కేసీఆర్.. బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు దేశాన్ని ఏలడంలో విఫలం అయ్యాయని, ప్రజలు ఇంకెన్నిరోజులు అవస్థలు పడాలని.. తనకు అవకాశం ఇస్తే దేశానికి మార్గనిర్దేశనం చూపేందుకు రెడీ అంటూ ఆ దిశగా అడుగులు వేస్తూ… వ్యవసాయ చట్టాల విషయంలో కేంద్రానికి వ్యతిరేకంగా దేశవ్యాప్త బంద్‌కు మద్దతు తెలిపి కొత్త స్ట్రాటజీకి తెరతీశారు.

జాతీయ రాజకీయాల్లోకి వెళ్లేందుకు ఇప్పటికే ఇతర రాష్ట్రాల సీఎంలతో మాట్లాడుతున్న కేసీఆర్ వెంట ఇకపై కాంగ్రెస్ పార్టీ సైతం కలిసి వస్తుందన్న చర్చలు సాగుతున్నాయి. ఇప్పటికిప్పుడు కాంగ్రెస్ నాయకత్వ బాధ్యతలు మీదేసుకొని పార్టీని ముందుకు నడిపేవారు లేనందున హస్తం పార్టీ అధిష్ఠానం సైతం బీజేపీకి వ్యతిరేకంగా కేసీఆర్‌తో జట్టుకట్టడమా? లేకుంటే బయట నుంచి సపోర్టు చేయడమా? ఏదో ఒకటి జరుగుతుందన్న అభిప్రాయాలు వెల్లడవుతున్నాయి. ఇప్పటికే లెప్ట్‌ పార్టీలు సైతం దేశవ్యాప్తంగా ఎన్డీయేకు వ్యతిరేకంగా ఉద్యమాలు చేస్తున్నందున, ఈ రెండు జాతీయ పార్టీలు కూడా కేసీఆర్‌కు సపోర్ట్ చేస్తాయన్న అంశాలు తెరపైకి వస్తున్నాయి. అవసరమైతే వామపక్ష నేతల ఇళ్లకు సైతం వెళ్లి మాట్లాడుతానని కేసీఆర్‌ చెబుతుండటం ఈ వాదనకు మరింత బలం చేకూరుస్తోందన్న రూమర్లు వినబడుతున్నాయి.

2001లో టీఆర్ఎస్ పార్టీని స్థాపించిన కేసీఆర్.. అన్ని వర్గాలను కూడగట్టుకొని తెలంగాణ రాష్ట్రాన్ని తీసుకొచ్చిన ఫేమ్, తనకు జాతీయ రాజకీయాల్లో అనుకూలంగా మారుతుందన్న ఊహాగానాలు వినపడుతున్నాయి. పార్లమెంట్ ఎన్నికలకు ఇంకా మూడున్నరేళ్ల సమయం ఉన్నందున ఇప్పటి నుంచే రంగంలోకి దిగి జాతీయ స్థాయిలో టీమ్‌ను రెడీ చేసుకుంటే ఎన్డీయేకు ప్రత్యామ్నాయంగా కేసీఆరే కనపడుతారని, ఆ దిశగా ఇప్పుడు కేసీఆర్ తీసుకురాబోయే కూటమి సక్సెస్ అవుతుందన్న అభిప్రాయాలు విశ్లేషకుల నుంచి వినపడుతున్నాయి. అయితే ఉద్యమ సమయంలో తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేస్తే టీఆర్ఎస్‌ను కాంగ్రెస్‌లో కలుపుతానని, ఆ తర్వాత మాట మార్చిన కేసీఆర్‌ను.. కాంగ్రెస్ హైకమాండ్ నమ్మి మద్దతిస్తుందా లేకుంటే సోనియా గాంధీ ఆధ్వర్యంలోనే వచ్చే ఎన్నికలకు రెడీ అవుతుందా అన్నది ముందు ముందు చూడాల్సిన అంశం.

Advertisement

Next Story