ఆ.. అయినా మీ గురించి నాకెందుకులే..

by Anukaran |
disha kathasravanthi
X

దిశ, కథాస్రవంతి : “పారిజాతం పిన్నిగారూ.. పారిజాతం పిన్నిగారూ.. ఇంటికి అనుకోకుండా చుట్టాలు వచ్చారు కాసిని పాలుంటే పోస్తారా” అంటూ వచ్చింది ఎదురింటి కన్యాకుమారి పారిజాతంగారి ఇంటికి.

“దానిదేం భాగ్యం అమ్మాయ్.. ఇప్పుడే తెస్తానుండు” అని ఆవిడకు పాలు పోసి “పొద్దున మార్కెట్ కి వెళుతుంటే మీ ఆయన ఎవరితోనో మాట్లాడుతూ కనిపించాడు.. మీ ఆయనతో ఉంది నువ్వేనేమో అనుకోని పలకరిద్దామని దగ్గరికెళ్ళి చూస్తే వేరే ఆవిడ ఉంది. వెంటనే వెనక్కొచేశాను” అని చెప్పింది పారిజాతం పిన్ని.

అసలే మొగుడి మీద ఎప్పటినుండో గుమ్మడికాయంత అనుమానం ఉన్న కన్యాకుమారి “నేననుకోని పొరబడ్డారంటే.. ఆవిడకూ నా వయసే ఉండి ఉంటుంది కదా పిన్నిగారూ” అంటూ ఆరాలు తీసింది.

“ఇంచుమించు నీ వయసే అయ్యుంటుందమ్మాయ్. మీ వారితో ఒకటే.. ఇక ఇకలూ.. పక పకలూనూ.. అవన్నీ నీతో చెప్పకూడదులే.. అయినా ఇవన్నీ నాకెందుకులే.. ఏదో కొంచెం జాగ్రత్త పడతావని చెప్తున్నాను అంతే” అంది పారిజాతం పిన్ని దీర్ఘాలు తీస్తూ.

ఇది విన్న కన్యాకుమారికి ఒళ్ళుమండిపోయి ఇంటికెళ్ళి చుట్టాల ముందే భర్తను నిలదీసింది.

“ఆమె నా కొలీగ్.. మార్కెట్ లో కనిపిస్తే పలకరించాను” అని భర్త ఎంత చెప్తున్నా వినకుండా.. “ఎంత కొలీగ్ అయితే మాత్రం ఊరంతా చూసేలా ఆ ఇక ఇకలూ పక పకలూ అవసరమా?” అంటూ గొడవపడింది.

ఇదంతా పారిజాతం పిన్ని వాళ్ళ ఇంటి కిటికీ నుండి చూస్తూ సంబరపడింది.

పారిజాతం గారు ఆ కాలనీకి కొత్తగా వచ్చారు. భర్త పోయిన ఆమె.. పిల్లలు కూడా లేకపోవడంతో ఒంటరిగా ఉంటున్నారు. అందరితో చాలా కలివిడిగా ఉండే ఆమెను వయసుతో పనిలేకుండా ఆ కాలనీలో ఉండే ప్రతిఒక్కరూ ‘పారిజాతం పిన్నిగారూ’ అంటూ ఆప్యాయంగా పిలుస్తూ ఉండేవారు.

పారిజాతం పిన్నిగారికి గొడవలు పెట్టడం అంటే మహా సరదా.. భార్యాభర్తలు, అత్తాకోడళ్ళు, వదినామరదళ్ళు, స్నేహితులు ఇలా ఎవరినీ వదిలిపెట్టకుండా పైకి వారిపై ప్రేమ ఒలకపోస్తూ అందరిమధ్య గొడవలు పెడుతూ వారు గొడవపడుతుంటే చూసి ఆనందిస్తూ ఉండేది.

ఒకరోజు పక్కింటి పంకజాక్షి దగ్గరికెళ్ళి “ఏంటమ్మా పనంతా నీ కొడలితో చేయిస్తూ నువ్వు సీరియళ్లు చూస్తూ కూర్చుంటావటగా? అన్నీ నువ్వు చెప్పినవే వండాలటగా? ఆమెకు నచ్చినవి అస్సలు వండుకోని తిననివ్వవట కదా. పాపం మీ కోడలు నా దగ్గర చెప్పుకోని కన్నీళ్లు పెట్టుకుంది.. పాపం ఆమె చెప్తుంటే విని నా గుండె తరుక్కుపోయిందనుకో.. అయినా ఇవన్నీ నాకెందుకులే ఏదో మీరు బాగుండాలని చెప్తున్నా అంతే” అంటూ అక్కడ నుండి ఇంటికెళ్లిపోయి అత్తాకోడళ్ళ గొడవ వినడానికి పక్కింటి గోడకు చెవ్వు ఆనిచ్చి నిలబడింది పారిజాతం పిన్ని .

ఆమె అనుకున్నట్టుగానే పంకజాక్షి కొడలితో గొడవపడింది. “నేను ఇవేవీ చెప్పలేదు మొర్రో.. నాకు వంకాయ కూర ఇష్టంలేదు కానీ ఇంట్లో వారికి ఇష్టమని చేశాను అని మాత్రమే చెప్పాను” అని కోడలు ఎంత చెబుతున్నా వినకుండా రెచ్చిపోయి అరుస్తున్న అత్త అరుపులు విని మహా సంతోష పడింది పారిజాతం పిన్ని.

మరుసటి రోజు ఉదయం ఆవిడ గుడికి వెళ్లబోతూ గుడి పక్కనే ఉన్న రాములమ్మ ఇంటికెళ్లింది. రోజూ వీరిద్దరూ కలిసి గుడికి వెళ్తుండేవారు.

ఆ రోజు రాములమ్మ ఒంట్లో నలతగా ఉండడం వలన గుడికి రాలేనని చెప్పడంతో పారిజాతం పిన్ని “అయితే మరి నేను వెళ్ళొస్తాను ఆరోగ్యం జాగ్రత్త” అని చెప్పి వెళ్లబోతుండగా రాములమ్మ కూతురు కనిపించి పిన్నిగారిని పలకరించి లోపలికి వెళ్ళిపోయింది.

పిన్నిగారు రాములమ్మకేసి చూసి “మొన్న మా మేడ పైన వడియాలు పెట్టడానికి వెళ్ళినపుడు అనుకోకుండా కిందకి చూశాను.. మీ అమ్మాయి ఓ కుర్రాడితో బండి మీద వెళ్తుంది. ఇంతకీ ఆ కుర్రాడు ఎవరు?? మీకు తెలిసినవాడేనా? జాగ్రత్తమ్మా అసలే ఈ మధ్య కుర్రాళ్ళను నమ్మలేకున్నాం” అంది.

రాములమ్మకు ఆ కుర్రాడు ఎవరో తెలియకపోయినా పిన్నిగారు వేరేగా అనుకోకుండా ఉండడానికి “ఆ అబ్బాయి నా కూతురు క్లాస్ మేట్ పిన్నిగారు.. ఆ రోజు కాలేజ్ కి ఆలస్యం అవడంతో అతని బండి మీద వెళ్ళింది” అని చెప్పింది తడబడుతూ.

విషయం అర్థం చేసుకున్న పిన్నిగారు “ఆ.. అయినా నాకెందుకులే మీ ఇంటి విషయాలు. ఏదో.. చెప్తే ముందే జాగ్రత్త పడతారు కదా అని చెప్తున్నా అంతే.. చిలక ఏ గోరింకతోనో ఎగిరిపోయాక బాధపడి ఉపయోగం ఉండదు కదా..” అని అక్కడ నుండి వెళ్ళిపోయింది.

గుడి నుండి తిరిగొచ్చేటప్పుడు రాములమ్మ ఇంటినుండి ఆమె తిట్లు, కూతురు సంజాయిషీలు, ఏడుపులు వినిపిస్తుంటే “హమ్మయ్య కడుపు నిండిపోయింది.. ఈ రోజు భోజనం కూడా అవసరం లేదు” అనుకుంటూ ముందుకు నడిచింది పారిజాతం పిన్ని.

ఇలా దాదాపుగా కాలనీలోని ఏ ఒక్క ఇంటినీ వదిలిపెట్టలేదు పిన్నిగారు.

కొన్నిరోజుల తరువాత కాలనీ వాసులందరికీ పిన్నిగారి భాగోతం తెలిసి ఆవిడ ఇంటి మీదకి గొడవకి రావడంతో పిన్నిగారు భయపడి పక్క ఊరిలోనే ఉంటున్న ఆమె చెల్లెలి కొడుకు రామలింగంకి విషయం చెప్పి వీలైనంత తొందరగా రమ్మని చెప్పింది.

రామలింగం, అతని భార్య హుటాహుటిన బయలుదేరి ఆవిడ ఇంటికి వచ్చేసి “ఈ రోజు నుండి పారిజాతం పిన్నీని ఎవ్వరితో కలవనివ్వము, అసలు బయటకు కూడా పంపము” అని మాట ఇచ్చాక గొడవ సద్దుమణిగి వచ్చిన వారంతా వెళ్లిపోయారు.

ఆ రోజు నుండి రామలింగం దంపతులు పిన్నిగారిని బయటకు వెళ్ళనిచ్చేవారు కాదు. రామలింగం అతని భార్యను పిన్నికి కాపలా పెట్టి బయట పనులు చూసుకోని వచ్చేవాడు.

ఎవరికీ గొడవలు పెట్టలేకపోతున్నందుకు ముద్ద దిగట్లేదు పిన్నిగారికి. మనసంతా గందరగోళంగా అనిపిస్తుంది. ఏం చేయాలి అని ఆలోచిస్తున్న ఆమెకు ఒక ఆలోచన తట్టింది.

భార్య స్నానానికి వెళ్లిన సమయంలో రామలింగం దగ్గర కూర్చొని “ఏంటోరా నీ పెళ్ళానికి పొద్దస్తమానం ఫోన్లే.. నువ్వు బయటికెళ్ళి వచ్చేదాకా గదిలో కూర్చొని తలుపులు వేసుకోని గంటలు తరబడి ఫోను మాట్లాడుతూనే ఉంటుందనుకో. తల్లిదండ్రులు కూడా లేరు కదా… మరి ఎవరు చేస్తున్నారంటావ్?? ఆ.. అయినా నాకెందుకులే ఏదో సొంత కొడుకులాంటి వాడివి కదా.. జాగ్రత్త పడతావులే అని చెప్తున్నా” అంది పారిజాతం పిన్ని చేతులు తిప్పుకుంటూ..

రామలింగంకి పారిజాతం పిన్ని గురించి తెలిసినా.. ఒకసారి అడిగితే పోయేదేముందిలే అని భార్యను పిలిచి అడిగాడు.

“కాలక్షేపానికి నా స్నేహితురాళ్లతో మాట్లాడుతుంటే.. మీ పిన్ని గురించి తెలిసీ కూడా ఆవిడ మాటలు నమ్మి నన్నే అవమానిస్తారా” అని భర్తతో గొడవపడి ఏడుస్తూ ఆమెను పెంచిన మేనామామగారింటికి వెళ్ళిపోయింది. భార్యను అనవసరంగా బాధపెట్టినందుకు పశ్చాత్తాపంతో రామలింగం కూడా ఆమె వెనకే వెళ్ళిపోయాడు.

ఇదంతా చూసిన పారిజాతం పిన్నిగారి ఆనందానికి అవధులు లేకుండా పోయాయి.

– సాయి స్రవంతి

Advertisement

Next Story