కమిషనర్ ఆకస్మిక పర్యటన.. పది రోజుల్లో పూర్తి చేయాలని డెడ్ లైన్

by Sridhar Babu |
కమిషనర్ ఆకస్మిక పర్యటన.. పది రోజుల్లో పూర్తి చేయాలని డెడ్ లైన్
X

దిశ, బూర్గంపాడు: గ్రామ అభివృద్ధిలో అధికారుల పనితీరు మెరుగుపడాలని రాష్ట్ర పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ కమిషనర్ డాక్టర్ శరత్ అన్నారు. ఆదివారం ఉదయం బూర్గంపాడు మండలం మోరంపల్లి బంజర గ్రామంలో ఆయన ఆకస్మికంగా పర్యటించారు. తొలుత గ్రామ శివారులోని వైకుంఠధామాన్ని పరిశీలించారు. అనంతరం కాలినడకన గ్రామంలోని కొత్తూరు, పాత బజార్, ఎస్సీ కాలనీలో పర్యటించారు. గ్రామ అభివృద్ధి, సమస్యలను గ్రామస్తులను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా గ్రామస్తులు గ్రామంలో డ్రైనేజీ వ్యవస్థ అస్తవ్యస్తంగా ఉందని, అంతర్గత రహదారులు కూడా సరిగ్గా లేవని ఆయన దృష్టికి తీసుకెళ్లారు. అనంతరం గ్రామ శివారులో ఏర్పాటు చేసిన పల్లె ప్రకృతి వనాన్ని పరిశీలించిన కమిషనర్ అసహనం వ్యక్తం చేశారు.

పల్లె ప్రకృతి వనంలో మొక్కలు నాటడం పట్ల తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. పల్లె ప్రకృతి వనంలో చిట్టడివి తలపించే విధంగా మొక్కలు నాటాలని సూచించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గ్రామ అభివృద్ధిలో అధికారుల పనితీరు మెరుగుపడాలన్నారు. ఇంత పెద్ద పంచాయతీకి జూనియర్ కార్యదర్శిని నియమించడం ఏమిటని అధికారులను ప్రశ్నించారు. పంచాయతీకి సీనియర్ కార్యదర్శిని నియమించేందుకు చర్యలు తీసుకోవాలని డీపీవోను ఆదేశించారు. వారం రోజుల్లో అధికారులతో టెలీ కాన్ఫరెన్స్ ఏర్పాటు చేస్తానని, అప్పటిలోగా పనులు పూర్తి చేయాలన్నారు. ఈ సందర్భంగా పల్లె ప్రకృతి వనంలో తమతో ఫోటో దిగాలని అధికారులు కోరగా… ప్రకృతి వనం ఇలా ఉంటే ఫోటో ఎలా దిగాలి? ప్రకృతి వనం మెరుగుపడిన తర్వాత ఫోటో దిగుదాం అని చెప్పారు.

Advertisement

Next Story

Most Viewed