రోడ్ల‌పై క‌నిపిస్తే క్వారంటైన్‌లో వేయండి

by Shyam |
రోడ్ల‌పై క‌నిపిస్తే క్వారంటైన్‌లో వేయండి
X

దిశ, న‌ల్ల‌గొండ‌: క‌రోనా మ‌హమ్మారి విజృంభిస్తోన్న నేప‌థ్యంలో బాధ్యతాయుతంగా వ్య‌వ‌హ‌రించాల్సిన పౌరులు అన‌వ‌స‌రంగా రోడ్ల మీద క‌నిపిస్తే వారిని ప్ర‌భుత్వ క్వారంటైన్‌ల‌కు త‌ర‌లించాల‌ని సూర్య‌పేట జిల్లా క‌లెక్ట‌ర్ విన‌య్ కృష్ణారెడ్డి పోలీసుల‌ను ఆదేశించారు. క‌రోనా క‌ట్ట‌డి కోసం జిల్లా యంత్రాగం అనేక ఆంక్ష‌లు విధించిన‌ప్ప‌టికీ ప్ర‌జ‌లు వాటిని పట్టించుకోకుండా నిర్లక్ష్యంగా వ్యవహరించడం క‌లెక్ట‌ర్‌కు ఆగ్ర‌హం తెప్పించింది. సూర్య‌పేట జిల్లా కేంద్రంలోని కొత్త‌గూడెం బ‌జార్ సంద‌ర్శ‌న‌కు వెళ్లి తిరిగి క‌లెక్ట‌రేట్‌కు వెళుతుండ‌గా రోడ్ల‌పై జ‌నం విచ్ఛ‌ల‌విడిగా సంచ‌రిస్తుండ‌టంతో ఆయ‌న తీవ్ర ఆగ్ర‌హానికి గుర‌య్యారు. ఉద‌యం 7గంట‌ల నుంచి మ‌ధ్యాహ్నం ఒంటిగంట వరకు మాత్ర‌మే అనుమతించిన‌ప్ప‌టికీ ఇప్ప‌టివ‌ర‌కూ వీరికి రోడ్ల మీద ఏంప‌ని అంటూ.. త‌న వాహ‌నాన్ని ఆపి కొంత మందిని మందలించారు. కొత్తగూడెం బజార్‌లో పాజిటివ్ కేసు నమోదు అయినా ప్రాంతంలో వైద్య ఆరోగ్య, మున్సిపల్, పోలీసు అధికారులతో కలెక్టర్ సమీక్ష జరిపారు. రెడ్‌జోన్‌గా ప్ర‌క‌టించిన ప్రాంతాల నుంచి ప్రజలెవ్వరూ బయటకురావొద్దని విజ్ఞప్తి చేశారు. పట్టణంలో పోలీసు బందోబస్తు పెంచాలని ఎస్పీ భాస్క‌ర‌న్‌ను ఆదేశించారు. డీఎంఎచ్‌వో నిరంజన్, ఆర్డీవో మోహన్ రావు, డీఎస్పీ నాగేశ్వరరావు, సీఐ శివశంకర్ నాయక్, మున్సిపల్ చైర్ పర్సన్ పెరుమాళ్ల అన్నపూర్ణలు కార్యక్రమంలో పాల్గొన్నారు.

Tags : collector, outraged, crowds, roads, suryapet, lackdown, nalgonda

Advertisement

Next Story