- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
కష్టంగా ఉంది.. బస్సులు నడపండి: కలెక్టర్లు
దిశ, ఏపీ బ్యూరో: గత కొంత కాలంగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తాంబూలాలిచ్చేశాం తన్నుకు చావండి అన్న రీతిలో లాక్‌డౌన్ విధించినా.. కరోనా కట్టడి కావడం లేదని, అందుకే కరోనాతో సహజీవనం చేయాల్సిందేనని ప్రకటనలు చేస్తున్న సంగతి తెలిసిందే. దీంతో కరోనా వైరస్ వ్యాప్తి నిరోధానికి విధించిన లాక్‌డౌన్ చివరి దశ నడుస్తోందన్న స్పష్టత వచ్చేసింది. లాక్‌డౌన్ సడలింపులతో కొనసాగుతుందన్న ఊహాగానాలు కూడా ఉన్నాయి. ఈ నేపథ్యంలో వివిధ రాష్ట్రాలతో పాటు విదేశాల నుంచి కూడా భారీ సంఖ్యలో స్వస్థలాలకు చేరుతున్నారు. ఇది ప్రభుత్వాధికారులకు సవాల్‌గా మారుతోంది.
ఏపీలో అడుగుపెట్టిన వారందరి వివరాలు నమోదు చేసుకోవడం, అందర్నీ క్వారంటైన్ చేయడం, పరీక్షలు నిర్వహించడం, పాజిటివ్ వేరుగా, అనుమానితులను వేరుగా, నెగిటివ్‌లను ఇంటికి పంపిస్తూ, పాలనపరమైన నిర్ణయాలు తీసుకోవడం ఉన్నతాధికారులకు శక్తికి మించిన భారంగా మారుతోంది. ఈ నేపథ్యంలో అంతర్రాష్ట్ర సరిహద్దులను పంచుకుంటున్న, వలస కార్మికుల తాకిడి ఎక్కువగా ఉన్న జిల్లాల కలెక్టర్లు ప్రభుత్వానికి ఒక విన్నపం చేశారు. అంతర్రాష్ట్ర బస్సు సర్వీసులను నడపాలని కోరుతున్నారు.
ఇలా బస్సులను నడపడం వల్ల ఆయా బస్సు స్టేషన్లలోనే వారి వివరాలు పూర్తిగా నమోదవుతాయని వారు చెబుతున్నారు. వాటిని షేర్ చేసుకుంటే సరిపోతుందని వారు చెబుతున్నారు. ఇప్పుడు ప్రైవేటు విమానాలు, ప్రైవేటు వాహనాల్లో వేలాది మంది ఆంధ్రప్రదేశ్‌కు తరలివస్తున్న వేళ, వారందరి వివరాలను సేకరించడం చాలా కష్టసాధ్యంగా ఉందని చెబుతున్నారు. ఆయా రాష్ట్రాల్లో ట్రాన్స్‌పోర్ట్ సర్వీసులు నడుస్తున్నందున ఎవరూ రాష్ట్రంలోకి కొత్తగా వచ్చారో తెలుసుకోవడం కాస్త ఇబ్బందిగా ఉందని వారు అభిప్రాయపడుతున్నారు.
అలాకాకుండా రాష్ట్ర ప్రభుత్వమే బస్సులు నడిపితే సగం పని భారం తగ్గుతుందని, ఇతర కార్యక్రమాలకు సిబ్బందిని కేటాయించే వెసులుబాటు ఉంటుందని పేర్కొంటున్నారు. ఇప్పటి వరకూ తెలంగాణ నుంచి 4 వేల మందికి పైగా వచ్చారని, వారందరినీ స్క్రీనింగ్ చేసి, వారి వివరాలు, వారు వెళుతున్న ప్రాంతాల వివరాల సేకరణ పెను సమస్యగా మారిందని కలెక్టర్లు తెలిపారని రవాణా శాఖ ముఖ్య కార్యదర్శి ఎంటీ కృష్ణబాబు వ్యాఖ్యానించారు. రాష్ట్రాల మధ్య బస్సు సర్వీసులను తిరిగి ప్రారంభించడంపై మరో రెండు రోజుల్లో నిర్ణయం వెలువడుతుందని, జూన్ 8 నుంచి బస్సులు పునఃప్రారంభం అయ్యే అవకాశాలున్నాయని ఆయన అన్నారు.
కేంద్రం ఇప్పటికే అన్ని రకాల బస్సు సేవలనూ నడిపేందుకు అనుమతించినప్పటికీ ఏపీఎస్ఆర్టీసీ బస్సులు నడిపేందుకు ఇంకా రాష్ట్ర ప్రభుత్వం నుంచి అనుమతి రాలేదు. నాలుగో దశ లాక్‌డౌన్ నిబంధనల మినహాయింపు తరువాత తాము తెలంగాణ ప్రభుత్వానికి లేఖ రాస్తూ, బస్సు సర్వీసుల పునరుద్ధరణపై విన్నవించామని, ఇప్పటివరకూ తమకు సమాధానం రాలేదని ఆయన చెప్పారు. తమిళనాడు మాత్రం ఇతర రాష్ట్రాల బస్సులను ఇప్పట్లో అనుమతించబోమని స్పష్టం చేసిందని కృష్ణబాబు వెల్లడించారు. ఇతర రాష్ట్రాల ప్రయాణికులను తెలంగాణ అనుమతిస్తున్నదన్న విషయాన్ని మీడియా ప్రస్తావించగా, ఈ విషయంలో స్పష్టమైన విధానాన్ని ఇంకా తెలంగాణ ప్రభుత్వం విడుదల చేయలేదని, ఈ విషయంలో మరోమారు లేఖను రాయనున్నామని ఆయన తెలిపారు.