చేగూర్‌లో పరిస్థితిని సమీక్షించిన కలెక్టర్, సీపీ

by Shyam |   ( Updated:2020-04-03 23:17:39.0  )
చేగూర్‌లో పరిస్థితిని సమీక్షించిన కలెక్టర్, సీపీ
X

దిశ, రంగారెడ్డి:రంగారెడ్డి జిల్లా నందిగామ మండలం చేగూర్ గ్రామంలోని కన్హా శాంతివనాన్ని కలెక్టర్ అమోయ్ కుమార్, సైబరాబాద్ సీపీ సజ్జనార్, జాయింట్ కలెక్టర్లు హరీష్, ప్రతీక్ జైన్, డీసీపీలు విజయ్‌కుమార్, ప్రకాష్‌రెడ్డిలు శనివారం సందర్శించారు. అనంతరం కలెక్టర్ అమోయ్ కుమార్, సీపీ సజ్జనార్ మాట్లాడుతూ చేగూర్‌లో కిరాణా షాపు నిర్వహకురాలు భారతమ్మ (55) అనారోగ్యంతో ఏప్రిల్ 1న ఉస్మానియా ఆసుపత్రిలో మృతిచెందారన్నారు. అనుమానంతో వైద్యులు ఆమె రక్త నమూనాలను పరీక్షలకు పంపించగా కరోనాతోనే మృతిచెందినట్లు నిర్ధారణ అయిందని తెలిపారు. వెంటనే కుటుంబ సభ్యులను వైద్య పరీక్షల నిమిత్తం క్వారంటైన్ కేంద్రానికి తరలించామన్నారు. అంత్యక్రియల్లో పాల్గొన్న వారిని కూడా వైద్య పరీక్షల నిమిత్తం గాంధీ హాస్పిటల్‌కి తరలించామని తెలిపారు. భారతమ్మ ఇంట్లో అద్దెకు ఉండే నలుగురు యువకులు (బీహార్ నుంచి ముగ్గురు, చేగూర్ నుంచి ఒకరు) ఢిల్లీ నిజాముద్దీన్ నుంచి హైదరాబాద్‌కు సంపర్క్ క్రాంతి ఎక్స్‌ప్రెస్‌లో వచ్చారని తెలిసిందన్నారు. ఈ రైల్లో మర్కజ్ వెళ్ళిన యాత్రికులు ఉండొచ్చనే అనుమానాలు ఉన్నాయన్నారు. భారతమ్మ నిర్వహిస్తున్న కిరాణా షాపునకు గ్రామస్తులు వస్తుంటారని, ఈ క్రమంలో 30 బృందాలతో ఇంటింటికీ తిరిగి వైద్య పరీక్షలు చేస్తున్నారన్నారు. గ్రామస్తులు 14 రోజులపాటు స్వీయ నిర్బంధంలో ఉండాలని సూచించారు.

Tags: Collector, CP Sajjanar, toured, Chegur village, corona positive, rangareddy

Advertisement

Next Story

Most Viewed