- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
సాంకేతిక వ్యవస్థలో ‘జాత్యహంకార’ కోణాలు.. మానవజీవితంలో ‘ఏఐ’ పాత్ర
దిశ, ఫీచర్స్ : సైన్స్, ఇంజినీరింగ్ కలయికతో రూపుదిద్దుకున్న తెలివైన యంత్రాలు, కంప్యూటర్ ప్రోగ్రామ్‌లనే ‘ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్’ అంటారు. ఈ పరిజ్ఞానాన్ని ఇప్పటికే అనేక రంగాల్లో వినియోగిస్తున్నారు. కృత్రిమ మేధస్సుతో ప్రపంచంలో విప్లవాత్మక మార్పులు వస్తాయనడంలో ఎలాంటి సందేహం లేదు. అయితే ఏఐ అభివృద్ధిని నియంత్రించలేకపోతే చరిత్రలో దాన్ని అత్యంత చెత్త విషయంగా చెప్పుకునే రోజులొస్తాయని, తగిన జాగ్రత్తలు తీసుకోకుంటే మూడో ప్రపంచ యుద్ధానికి కృత్రిమ మేధస్సే కారణం అవుతుందని ప్రముఖ భౌతిక శాస్త్రవేత్త స్టీఫెన్ హాకింగ్ గతంలో చెప్పారు.
అంతేకాదు జాతి, మత, కుల, లింగ వివక్ష చూపడం మనుషులకు మాత్రమే తెలుసని ఇప్పటివరకు మనం భావించాం. కానీ యంత్రాలు కూడా ఆయా భేదాలు చూపుతాయని లేటెస్ట్ నెట్‌ఫ్లిక్స్ డాక్యుమెంటరీ ‘కోడెడ్ బయాస్’ వివరించింది. సాంకేతిక పరిజ్ఞాన సమక్షంలో సమాజ భవిష్యత్తు ఎలా ఉంటుందనే ముఖ్యమైన ప్రశ్నను ఈ సినిమా మనముందుంచింది.
భారత సంతతి దర్శకురాలు షాలిని కాంతయ్య తెరకెక్కించిన ‘కోడెడ్ బయాస్’ అనే నెట్‌ఫ్లిక్స్ డాక్యుమెంటరీ.. మెషిన్స్ చూపించే వివక్షను వివరించింది. మహిళలు, బ్లాక్ లైవ్స్, నియామకం, హౌసింగ్, క్రిమినల్ ప్రొఫైలింగ్ వంటి అంశాల్లో వివక్ష కనిపించడంతో పాటు అనేక విషయాల్లోనూ అది ప్రజల జీవితాలను ప్రభావితం చేస్తుందని డాక్యుమెంటరీలో చూపించారు. డాక్యుమెంటరీ 85 నిమిషాలు మాత్రమే ఉన్నా, చాలా లోతైన ఇతివృత్తంతో సాగుతుంది. కొత్త యంత్రాలు కొత్త సమాజాన్ని సృష్టించడం లేదు. పాత ప్రపంచంలోని వివక్ష నమూనాలైన సెక్సిజం, క్లాసిజం, జాత్యహంకారం వంటి వాటిని ప్రతిబింబిస్తున్నాయి.
మెజాన్ ఉద్యోగ నియామకం కోసం ఆటోమేటెడ్ సాఫ్ట్‌వేర్‌ను ఉపయోగించగా, మహిళా దరఖాస్తుదారులందరినీ ఏఐ తిరస్కరించడం యాదృచ్ఛికం కాదు. అది ఏఐ చూపించిన వివక్షకు ఉదాహరణగా చెప్పొచ్చు. ‘ఫేసియల్ రికగ్నిషన్ నల్లజాతీయుల పట్ల వివక్ష చూపిస్తుంది. ఇప్పటికే ఎంతోమంది అమాయకులను పోలీసులు అరెస్ట్ చేశారు. బ్లాక్, బ్రౌన్ వర్గాలకు హాని కలిగించడానికి, నేరాల్లో వారిని ఇరికించడానికి ఈ టెక్నాలజీ పోలీసులకు వరంగా మారింది’ అని రేసియల్ జస్టిస్, సివిల్ రైట్స్ అడ్వొకేట్స్ ఎన్నో ఏళ్లుగా ఆరోపిస్తున్న విషయం తెలిసిందే. ప్రజల డీఎన్ఏ, వేలిముద్రలను ప్రభుత్వ సంస్థలు, చట్ట సంస్థలు తీసుకోవడానికి నియమాలు ఉన్నాయి. కానీ బయోమెట్రిక్ ఫోటోలను పొందడం, వాటిని డేటాబేస్‌లో భద్రపరచడం గురించి ఎలాంటి నియమాలు లేకపోవడం గమనార్హం.
డాక్యుమెంటరీ కథ విషయానికొస్తే..మసాచుసెట్స్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీకి చెందిన కంప్యూటర్ శాస్త్రవేత్త జాయ్ బులమ్విని, డేటా సైంటిస్ట్, ఆథర్ ఆఫ్ ది బెస్ట్ సెల్లింగ్ బుక్ (ది వెపన్ ఆఫ్ మ్యాథ్ డిస్ట్రక్షన్) రైటర్ కాథీ ఓ నీల్, యూకేకు చెందిన ఎన్జీవో సంస్థ డైరెక్టర్ సిల్కీ కార్లోల చుట్టే ఈ డాక్యుమెంటరీ కథ నడుస్తుంది. ఫేసియల్ రికగ్నిషన్ సాఫ్ట్‌వేర్‌తో కూడిన అసైన్‌మెంట్‌లో పనిచేస్తున్నప్పుడు ఫేసియల్ రికగ్నిషన్ అల్గారిథం ఆమె ముఖాన్ని గుర్తించలేదనే విషయాన్ని బులమ్విని తెలుసుకుంటుంది.
ఆమె ఓ వైట్ మాస్క్ తన ముఖాన ధరించి ప్రయత్నించగా, వెంటనే యాక్సెప్ట్ అవుతుంది. దీంతో ఆమె ‘కోడెడ్ బయాస్’ను వ్యతిరేకిస్తూ పదుల సంఖ్యలో ఆర్టికల్స్ రాస్తుంది. ఈ క్రమంలో ఆమె తన గొంతును ‘కాంగ్రెస్ సభ’లో వినిపించే అవకాశం వస్తుంది. తన పరిశోధన నుంచి ఫేసియల్-డిటెక్షన్ టెక్నాలజీపై కాంగ్రెషనల్ హియరింగ్ వరకు బులమ్విని ప్రయాణాన్ని ఒక త్రూ లైన్‌గా ఉపయోగించి, అనేక స్థానిక, అంతర్జాతీయ కథలను ఎంతో అద్భుతంగా చూపించారు.
ఒక ఆటోమేటెడ్ సాఫ్ట్‌వేర్ టెక్సాస్‌లోని ఉపాధ్యాయులను గ్రేడింగ్ చేయడానికి ఉపయోగించారు. ఈ క్రమంలో హ్యూస్టన్‌కు చెందిన ఒక ఉపాధ్యాయుడు సంవత్సరాల అనుభవంతో పాటు ఉత్తమ ఉపాధ్యాయ పురస్కారం ఉన్నప్పటికీ అల్గారిథమ్ బయాస్ వల్ల తన ఉద్యోగాన్ని కోల్పోతాడు. లండన్ వీధుల్లోని ఏఐ ఆధారిత క్లోజ్డ్ సర్క్యూట్ టీవీ కెమెరాల ఆధారంగా అనుమానితులను పోలీసులు పట్టుకోవడాన్ని అబ్జర్వ్ చేసిన వాచ్ డాగ్ సమూహం దాన్ని సవాల్ చేసింది.
ఏఐ సాంకేతికత కెమెరాలు తరచూ మిస్‌లీడ్ చేస్తూ, పాదచారుల డేటాతో అనుసంధానించాయి. ఇలా సాంకేతికత అత్యంత వృద్ధి చెందినప్పటికీ దాని విభిన్న కోణాలను విశ్లేషిస్తూ, ‘కోడెడ్ బయాస్’ సమగ్రమైన, కొన్ని సమయాల్లో భయానకమైన ప్రపంచాన్ని మన ముందుంచుతుంది. టెక్ ఎరాలో మనల్ని టెక్నాలజీ రక్షించడం కాదు, దాన్నుంచి మనల్ని మనం కాపాడుకోవాలనే విషయాన్ని చెప్పకనే చెప్పారు మేకర్స్. ‘నిజమైన నియంత్రణ కార్పొరేట్స్ చేతుల్లోనే ఉంది. మొదట, ప్రజల కొనుగోలు ప్రాధాన్యతలను ప్రోగ్రామ్ చేసి, డబ్బు ఆర్జించారు. ప్రస్తుతం వాళ్లు మన పౌర స్వేచ్ఛను అణచివేస్తున్నారు’ అని దర్శకురాలు షాలిని కాంతయ్య తెలిపారు.
దర్శకురాలు సమస్యలకు పరిష్కారాలపై ఆలోచించడం కంటే అల్గారిథమ్స్ బెదిరింపులు, వాటి సంభాషణలపై ఎక్కువ దృష్టి పెట్టడం ఓ లోపంగా చెప్పొచ్చు. కొన్ని సీన్స్ నాటకీయంగా, అసందర్భోచితంగా అనిపించినా డాక్యుమెంటరీ ఓ మంచి మెసేజ్ అందించింది. అనేక సందర్భాల్లో ఈ డాక్యుమెంటరీ మరొక నెట్‌ఫ్లిక్స్ మాస్టర్ పీస్, డాక్యుమెంటరీ ‘ది సోషల్ డైలమా’ను గుర్తు చేస్తుంది. పౌరులను ప్రభావితం చేసే అల్గారిథంలోని పక్షపాతానికి వ్యతిరేకంగా పోరాడటానికి ఈ చిత్రం ప్రేరణనివ్వగా, ఇండివిడ్యువల్ ప్రైవసీ, ఇన్‌స్టిట్యూషనల్ డిస్క్రిమినేషన్, ఇండస్ట్రియల్ డీ హ్యుమనైజేషన్ వంటి అంశాలు ఇప్పటికీ అపరిష్కృతంగానే ఉన్నాయని డాక్యుమెంటరీ ప్రస్తావిస్తోంది.