బ్యాడ్ టచ్ టీచర్స్.. అవగాహన పేరుతో అకృత్యాలు

by Aamani |
బ్యాడ్ టచ్ టీచర్స్.. అవగాహన పేరుతో అకృత్యాలు
X

దిశ,జగిత్యాల ప్రతినిధి: జగిత్యాల రూరల్ మండలంలోని ఓ గ్రామంలో ప్రభుత్వ పాఠశాలలో హెచ్ఎం గా పనిచేస్తున్న ఉపాధ్యాయుడు ఓ విద్యార్థిని తో అసభ్యంగా ప్రవర్తించాడు. సంప్రదాయ దుస్తుల్లో వచ్చినప్పుడు లైంగికంగా వేదించసాగాడు. సదరు ఉపాధ్యాయుడి తీరుపై భయాందోళనకు గురైన విద్యార్థిని పాఠశాలకు వెళ్లాలంటేనే భయపడే పరిస్థితికి వచ్చింది. ధైర్యం చేసి తల్లిదండ్రులకు విషయం చెప్పడంతో శుక్రవారం విద్యార్థిని పేరెంట్స్ జిల్లా విద్యాధికారి తో పాటు పోలీసులకు కంప్లైంట్ చేశారు. బాధితుల ఫిర్యాదు మేరకు పోలీసులు హెచ్ఎం పై ఫోక్సో యాక్ట్ కింద కేసు నమోదు చేశారు.

జగిత్యాల టౌన్ పరిధిలోగల ఓ ప్రభుత్వ పాఠశాలలో ఉపాధ్యాయుడు కొంతకాలం క్రితం ఓ విద్యార్థినిలకు సోషల్ మీడియాలో అసభ్యకరమైన వీడియోలను బలవంతంగా చూపించాడు. పేరెంట్స్ కి చెబితే ఉపాధ్యాయుడు ఏం చేస్తాడోనన్న భయానికి స్టూడెంట్స్ ఇంట్లో చెప్పలేదు. ఉపాధ్యాయుడు తీరుతో విసుగు చెందిన ముగ్గురు విద్యార్థులు స్కూల్ కి వెళ్లడమే మానేశారు. అనుమానం వచ్చిన తల్లిదండ్రులు ఆరా తీయగా అసలు విషయం వెలుగులోకి వచ్చింది. దీంతో ఓ విద్యార్థి పేరెంట్స్ ఫిర్యాదు మేరకు సదరు ఉపాధ్యాయుడిపై పోలీసులు ఫోక్సో కేసు నమోదు చేశారు.

జగిత్యాల పట్టణానికి మూడు కిలోమీటర్ల దూరంలో గల ప్రముఖంగా పేరున్న పాఠశాలలో ఓ టీచర్ గుడ్ టచ్ బ్యాడ్ టచ్ అవేర్నెస్ పేరుతో స్టూడెంట్ ని లైంగికంగా వేధించాడు. టీచర్ ఆగడాలతో విసుగెత్తిన విద్యార్థిని పేరెంట్స్ దగ్గర విషయం చెప్పి బోరున విలపించింది. ఈ ఘటనపై స్కూల్ యాజమాన్యాన్ని నిలదీసిన పేరెంట్స్ వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేయగా పోక్సో చట్టం కింద కేసు బుక్ చేసి నిందితుడి రిమాండ్ చేశారు.

విద్యార్థులను గాడిలో పెట్టాల్సిన కొందరు టీచర్లే దారి తప్పుతున్నారు. అభం శుభం తెలియని చిన్నారులపై లైంగిక వేధింపులకు పాల్పడుతున్నారు. ఉపాధ్యాయ వృత్తికే మచ్చ తెచ్చే విధంగా కొందరు ఉపాధ్యాయులు వ్యవహరిస్తున్నారు. ఇటీవల జగిత్యాల జిల్లాలో జరిగిన వరుస ఘటనలు పరిస్థితి తీవ్రతకు అద్దం పడుతున్నాయి. కొన్నిచోట్ల ప్రభుత్వ టీచర్లతో పాటు ప్రైవేటు టీచర్లు ఇలాంటి అకృత్యాలకు పాల్పడుతున్నట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. తల్లిదండ్రుల తర్వాత అంతటి పాత్ర పోషించాల్సిన టీచర్లే విచక్షణ కోల్పోయి స్టూడెంట్స్ పట్ల హద్దులు మీరి ప్రవర్తించడం పేరెంట్స్ లో ఆందోళన కలిగిస్తుంది. టీచర్లు విద్యార్థులను ఉన్నత శిఖరాలకు చేర్చే విధంగా పాఠ్యాంశాలు బోధిస్తూ వారి బంగారు భవిష్యత్తుకు బాటలు వేస్తుంటే కొందరు టీచర్ల ప్రవర్తన మాత్రం ఉపాధ్యాయ వృత్తికే మచ్చ తెచ్చే విధంగా ఉంది.

రెండు నెలల్లో మూడు ఘటనలు..

చిన్నారులపై జరుగుతున్న ఆకృత్యాలను అరికట్టేందుకే విద్యాశాఖ తో పాటు పోలీస్ డిపార్ట్మెంట్ ఆధ్వర్యంలో గుడ్ టచ్ బ్యాడ్ టచ్ ద్వారా స్కూల్ పిల్లలకు అవగాహన కల్పిస్తున్నారు. అయితే దీన్ని ఆసరాగా చేసుకున్న కొంతమంది వక్రబుద్ధి గల ఉపాధ్యాయులు విద్యార్థినులను అసభ్యంగా తాకుతూ లైంగికంగా వేధిస్తున్నారు. రెండు నెలల వ్యవధిలో జిల్లాలో పనిచేస్తున్న ఇద్దరు ప్రభుత్వ టీచర్లతో పాటు ఓ ప్రైవేట్ టీచర్ పై ఫోక్సో కేసులు నమోదయ్యాయి. అకృత్యాల బారిన పడకుండా అవగాహన కల్పించాల్సిన ఉపాధ్యాయులే ఇలాంటి చర్యలకు పాల్పడుతూ ఉండడం ఆందోళన కలిగిస్తుంది. విద్యాసంస్థల్లో కేవలం మహిళ టీచర్లు మాత్రమే గుడ్ టచ్ బ్యాడ్ టచ్ పై అవగాహన కల్పించాల్సి ఉండగా కొందరు అందుకు విరుద్ధంగా వ్యవహరిస్తూ ఇలాంటి ఘటనలకు కారణమవుతున్నారు.

కఠిన చర్యలు అవసరం..

జిల్లాలో రెండు నెలల్లో చిన్నారులపై లైంగిక వేధింపులకు సంబంధించి మూడు ఘటనలు చోటు చేసుకున్నాయి. అయితే ఇవి పేరెంట్స్ ఆరా తీయగా వెలుగులోకి వచ్చిన ఘటనలే. ఇలాంటి బ్యాడ్ టీచర్స్ పట్ల ఉన్న భయంతో స్టూడెంట్స్ భయపడి బయటకు చెప్పని ఘటనలు కూడా ఉండవచ్చు అన్న చర్చ జిల్లా వ్యాప్తంగా జరుగుతోంది. పిల్లల తల్లిదండ్రులు ఎలాగోలా ధైర్యం చేసి ఫిర్యాదు చేస్తున్నప్పటికీ సంబంధిత శాఖ అధికారులు చర్యలు తీసుకోవడంలో వెనకడుగు వేస్తున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. బ్యాడ్ టీచర్స్ విషయంలో కేవలం చట్టపరమైన చర్యలు మాత్రమే కాకుండా సొంత శాఖ నుండి కూడా కఠినంగా వ్యవహరించాలని డిమాండ్లు పెద్ద ఎత్తున వినిపిస్తున్నాయి. తాజా ఘటన నేపథ్యంలో జిల్లా అధికారులు ఎలాంటి చర్యలు చేపడతారు అన్నది చూడాల్సి ఉంది.

మహిళా టీచర్లకూ తప్పని వేధింపులు

మెట్ పల్లి డివిజన్ లోని ఓ మండలం లో ప్రభుత్వ స్కూల్ లో తోటి మహిళా టీచర్ ను లైంగిక వేధింపులకు గురి చేయడంతో ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసిన ఘటన చోటు చేసుకుంది. ఉన్నతాధికారులు సైతం మెమో జారీ చేసి చేతులు దులుపుకోవడం అప్పట్లో విమర్శలు వెల్లువెత్తున్నాయి. ప్రభుత్వ, ప్రైవేటు సంస్థల్లో పనిచేస్తున్న మహిళల హక్కులను కాపాడడానికి భారత ప్రభుత్వం 2003 సంవత్సరంలో పని ప్రదేశాల్లో మహిళలపై లైంగిక వేధింపుల నివారణ చట్టాన్ని తీసుకొచ్చింది. అయితే ఈ చట్టం పై మహిళలకు జిల్లా అధికారులు ఆశించిన స్థాయిలో అవగాహన కల్పించలేదనేది వాస్తవం. ఇలాంటి వేధింపులను అరికట్టడానికి పెద్ద ఎత్తున అవగాహన కార్యక్రమాలు చేపట్టాలని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

బాధితులకు అండగా ఉంటాం : రఘు చందర్, జగిత్యాల డీఎస్పీ

ఎవరైనా స్టూడెంట్స్ ను వేధింపులకు గురి చేస్తే చట్ట ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటాం. ఫిర్యాదు చేసిన వారికి అండగా ఉండటంతో పాటు వివరాలు పూర్తి గోప్యంగా ఉంచుతాం. షీ టీం ద్వారా విద్యా సంస్థల్లో, ఇతర ప్రాంతాల్లో గుడ్ టచ్, బ్యాడ్ టచ్ ల పై అవగాహన కల్పిస్తున్నాం. బాధితులకు అన్ని రకాల సహాయ, సహకరాల అందించేందుకు భరోసా సెంటర్ కూడా ఏర్పాటు చేశాం. బాధితులు భయపడకుండా నిర్భయంగా పోలీసులకు ఫిర్యాదు చేయాలి.

ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూడాలి : అక్రమ్ మాలిక్, ఏఐఎస్ఎఫ్ జిల్లా కార్యదర్శి.

ఘటన జరిగిన తర్వాత బాధితులకు పోలీసు శాఖ పూర్తి అండగా ఉంటూ వస్తోంది. అయితే అసలు ఇలాంటి ఘటనలే జరగకుండా చూడాల్సిన బాధ్యత విద్యాశాఖ అధికారులపై ఉంది. ప్రస్తుత ఘటనల నేపథ్యంలో ప్రత్యేక కమిటీలు ఏర్పాటు చేసి నెలకు ఒకసారైనా ఉపాధ్యాయులకు సైతం కౌన్సిలింగ్, ఇతర శిక్షణ కార్యక్రమాలు నిర్వహించాల్సిన అవసరం ఏర్పడింది. బాధ్యులపై కఠినంగా చర్యలు తీసుకొని భవిష్యత్తులో మళ్లీ ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూడాలి.

Next Story