జోరుగా అక్రమ రిజిస్ట్రేషన్లు.. నిబంధనలు బేఖాతరు

by Aamani |
జోరుగా అక్రమ రిజిస్ట్రేషన్లు.. నిబంధనలు బేఖాతరు
X

దిశ, జమ్మికుంట టౌన్ : జమ్మికుంట పట్టణ చుట్టుపక్కల నిబంధనలకు విరుద్ధంగా వెలిసిన అక్రమ రియల్ వెంచర్లపై కొరడా ఝళిపించాల్సిన మున్నివల్ శాఖాధికారులు ఉదాసీనంగా వ్యవహరిస్తున్నారు. మరోవైపు ప్రభుత్వ ఆదేశాలకు భిన్నంగా సబ్ రిజిష్టర్, అనుమతి లేని లే అవుట్లలోని ప్లాట్లను సైతం రిజిస్ట్రేషన్ చేస్తుండడంతో కొత్తగా వెంచర్లు పుట్టుకువస్తున్నాయి. ఈ వ్యవహారంలో ప్రజాప్రతినిధులు కూడా ప్రేక్షకపాత్ర వస్తుండడంతో ఇక్కడ రియల్ ఎస్టేట్ వ్యాపారం మూడు పువ్వులు, ఆరు కాయలుగా సాగుతున్నది. డీటీసీపీ అనుమతులు లేకుండానే రియల్ వ్యాపారులు వ్యవసాయ భూములను వ్యవసాయేతర భూములుగా మార్చి ప్లాట్లు చేసి విక్రయాలు జరుపుతున్నారు.

నిబంధనలు తెలియని కొనుగోలుదారులు వాటిని కొనుగోలు చేసి తీవ్రంగా నష్టపోతున్నారు. అనుమతులు లేకుండా వెలుస్తున్న వెంచర్లలో ప్లాట్ల హద్దురాళ్లను తొలగించాల్సిన అధికారులు ప్రజాప్రతినిధుల ఒత్తిళ్లకు తలొగ్గి వాటిని తొలగించడం లేదని తెలుస్తోంది. రియల్ ఎస్టేట్ వ్యాపారులు స్థానిక ప్రజా ప్రతినిధులను మచ్చిక చేసుకుని రిజిస్ట్రేషన్లకు అడ్డు రాకుండా చూసుకుంటున్నట్లు జమ్మికుంటలో ప్రచారం జరుగుతుంది.దీనికి గాను వీరు ఎకరానికి 2 నుంచి 3 లక్షల రూపాయల వరకు వసూలు చేస్తున్నట్లు ప్రచారం జరుగుతుంది.

పుట్టుకొస్తున్న వెంచర్లు..

జమ్మికుంట మున్సిపాలిటీ ఏర్పాటైన తర్వాత పట్టణంలోని పలు చోట్ల రియల్ వెంచర్లు వెలిశాయి. సుమారు 20 నుండి 50 ఎకరాల వ్యవసాయ భూములను రియల్ ఎస్టేట్ వ్యాపారులు కొనుగోలు చేసి ఎలాంటి అనుమతులు లేకుండానే వెంచర్లు పెట్టి క్రయ, విక్రయాలు జరుపుతున్నారు. ప్లాట్ల విక్రయాలు జరపాలంటే డైరెక్టర్ ఆఫ్ టౌన్ అండ్ కంట్రీ ప్లానింగ్ అనుమతి తీసుకోవాల్సి ఉంటుంది. వ్యవసాయ భూమి అయితే తప్పనిసరిగా నాలా కన్వర్షన్ చేయాలి, కొత్త మున్సిపల్ చట్టం ప్రకారం 30, 40 అడుగుల వెడల్పుతో రోడ్లు ఏర్పాటు చేసి, ఇతర సౌకర్యాలు కల్పించి, మున్సిపాలిటీకి 10 శాతం భూమిని రిజిస్ట్రేషన్ చేయాలి. అవేమీ లేకుండానే జమ్మికుంట మున్సిపల్ పరిధిలో 10 కు పైగా అక్రమంగా వెంచర్లు వెలిసి వ్యాపారం చేస్తున్నట్లు సమాచారం వీటిలో ఒక్క దానికి కూడా అనుమతులు లేకుండానే ప్లాట్లు అమ్మినట్లు తెలుస్తుంది.

పట్టించుకునే నాథుడే కరువయ్యాడు..

ఇటీవల పట్టణంలో కొత్తగా వెలిసిన మూడు రియల్ వెంచర్ల లో డీటీసీపీ అనుమతులు లేకుండానే ప్లాట్లు చేశారని వచ్చిన ఫిర్యాదుల మేరకు మున్సిపల్ అధికారులు వెంచర్లో ఏర్పాటు చేసిన హద్దురాళ్లను తొలగించారు.. దీనికి అనుమతులు లేవని, ఇక్కడ ఎవరు కూడా ప్లాట్లను కొనుగోలు చేయరాదని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. కానీ జమ్మికుంట మున్సిపాలిటీ పరిధిలో గల అనుమతి లేని రియల్ వెంచర్లలో యథేచ్ఛగా క్రయ, విక్రయాలు జరుగుతున్నా కూడా పట్టించుకునే నాథుడు లేదు. ప్లాట్లను కొనుగోలు చేస్తున్న వాళ్లు భవిష్యత్తులో ఇంటి అనుమతులకు వెళితే కొత్త మున్సిపల్ చట్టం ప్రకారం అనుమతులు ఇచ్చే అవకాశాలు లేవు. 18 నుంచి 20 అడుగుల వెడల్పుతోనే రోడ్లు ఉన్నందున కొత్త చట్టం ప్రకారం 30, 40 అడుగుల రోడ్లు ఉండాలి. ఆ మేరకు రోడ్లు లేకపోవడంతో ప్లాట్లను కొనుగోలు చేస్తున్న వాళ్ళు తీవ్రంగా నష్టపోయే ప్రమాదం ఏర్పడింది. వారికి అనుమతులు ఇవ్వాలంటే తప్పనిసరిగా ఎల్ఆర్ఎస్ చెల్లించి సెట్ బ్యాక్ కావాల్సి ఉంటుంది.

హద్దు రాళ్లు లేకుండానే అమ్మకాలు..

జమ్మికుంట పట్టణంలోని కొన్ని వెంచర్లలో హద్దురాళ్లు లేకుండానే అమ్మకాలు జరుపుతున్నారు. హద్దు రాళ్లు ఉంటే అధికారులు స్పందించి రాళ్లను తీస్తున్నారని కొనుగోలుదారులకు ఇల్లు కట్టేటప్పుడు మేము సహకరిస్తాం, మేమున్నాం కదా అని మభ్యపెట్టి , రిజిస్ట్రేషన్ చేస్తున్నాం కదా అని చెప్పి మాయమాటలతో కొనుగోలుదారులను మోసం చేస్తున్నారు. హద్దు రాళ్లు పాత కుండానే నాలా కన్వర్షన్ తో రిజిస్ట్రేషన్ చేయడం ఇప్పుడు ట్రెండింగ్ లో ఉంది. నిబంధనలకు విరుద్ధంగా అక్రమంగా వెలిసే రియల్ వెంచర్లను తొలగించేందుకు గాను ప్రభుత్వం జిల్లా కలెక్టర్ నేతృత్వంలో అన్ని జిల్లాల్లో టాస్క్ ఫోర్స్ కమిటీలను ఏర్పాటు చేసింది. కానీ ఇప్పటివరకు డివిజన్ కేంద్రంలో వెలసిన అక్రమ లే అవుట్ల విషయమై టాస్క్ ఫోర్స్ కమిటీ చర్యలు తీసుకోకపోవడం గమనార్హం. ఇప్పటికైనా సంబంధిత అధికారులు స్పందించి అక్రమ లేఅవుట్లపై కొరఢా ఝుళిపించాలని ప్రజలు కోరుతున్నారు.

Next Story

Most Viewed