- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
‘సీజీజీ’లో ఏక్ నిరంజన్..! నియంతలా మాజీ డీజీ రాజేంద్ర నిమ్జ్

దిశ, తెలంగాణ బ్యూరో: గచ్చిబౌలిలోని సెంటర్ ఫర్ గుడ్ గవర్నెన్స్ (సీజీజీ)లో డైరెక్టర్ జనరల్ నియంతలా వ్యవహరిస్తున్నారని అందులో పనిచేసే తెలంగాణ ఉద్యోగులు పెద్ద ఎత్తున ఆరోపిస్తున్నారు. సీజీజీ డైరెక్టర్ కాంట్రాక్ట్ గడువు ముగిసినా.. అతనికి ఎక్స్‌టెన్షన్ ఇవ్వకున్నా కార్యాలయానికి వచ్చి ఎంప్లాయీస్‌ను ఇబ్బందులకు గురిచేయడంతో పాటు ఇష్టారీతిన అవినీతికి పాల్పడుతున్నాడని ఆరోపణలున్నాయి. ముఖ్యంగా తెలంగాణకు చెందిన వారిని అకారణంగా తొలగిస్తున్నారని విమర్శలొస్తున్నాయి. 2001లో సెంటర్ ఫర్ గుడ్ గవర్నెన్స్ (సీజీజీ)ని గచ్చిబౌలిలో అప్పటి ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ఇది ప్రభుత్వ కార్యాలయాలకు సాంకేతికపరమైన సాయం అందజేస్తుంది. వెబ్‌సైట్‌లకు సర్వర్‌ను మెయింటేన్ చేస్తుంది. సాంకేతికంగా ప్రభుత్వం, ప్రభుత్వ రంగ సంస్థలకు సేవలు అందిస్తుంది. అందుకు తగ్గట్టు సర్వీస్ చార్జిని వసూలు చేస్తుంది. ఆ మేరకే ఒప్పందాలు సైతం చేసుకుంటుంది.
సీజీజీ డైరెక్టర్‌కు విశేష అధికారాలు..
ఈ సంస్థలో కాంట్రాక్టు, అవుట్సోర్సింగ్విధానంలో ఉద్యోగులు సేవలందిస్తున్నారు. వారిని నియమించుకునే అధికారాన్ని ప్రభుత్వం సీజీజీ డైరెక్టర్ జనరల్‌కు ఇచ్చింది. ఇది ప్రభుత్వ పరిధిలో ఉన్నా.. పాలకులు ఆ విషయాన్ని మర్చిపోయారనే విమర్శలు వస్తున్నాయి. సీజీజీలో రిటైర్డ్ఐఏఎస్అధికారి రాజేంద్ర నిమ్జ్2016 నుంచి డైరెక్టర్జనరల్గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. రాష్ట్రంలో పదవీకాలం పూర్తి చేసుకున్న అధికారులు, ఉద్యోగులకు ఉద్వాసన పలకాలని ఇటీవల తెలంగాణ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. దీంతో సీజీజీ డీజీని ఎప్పుడు సాగనంపుతారా? అని ఉద్యోగులంతా ఎదురుచూస్తున్నారు.
తెలంగాణ ఉద్యోగులే టార్గెట్..
సీజీజీ డైరెక్టర్ వ్యవహారం అందులో పనిచేసే తెలంగాణ ఉద్యోగులకు శాపంగా మారింది. అకారణంగా వారిని జాబ్ నుంచి తొలగిస్తున్నట్టు ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఆయన బయటకు చూపే కారణాలు ఏదైనా.. అంతర్గత కారణాలు వేరుగా ఉన్నాయని టాక్. ఆయన అక్రమాలు, కుంభకోణాల గురించి ఎవరికైనా తెలిసిందని అనుమానం వస్తే చాలు. తప్పుడు కారణాలు చూపి వారిని తొలగిస్తున్నారని ఉద్యోగులు ఆవేదన చెందుతున్నారు. ఆయన తొలగించిన వారిలో తెలంగాణకు చెందినవారే అధికం. ప్రత్యేక రాష్ట్రం వచ్చినా ఇక్కడి వారికి ప్రాధాన్యత లేకపోవడంపై ఐటీ నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఉద్యోగ కాలం ముగిసినా ఏండ్లుగా ఒకే పదవిలో ఉంటూ.. పొలిటికల్ అండదండలతో పెత్తనం చెలాయిస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. అంతేకాకుండా సీజీజీని ఆయన కుటుంబ గెస్టు హౌస్‌గా మార్చుకున్నారని, వారి ఇంట్లోని వ్యక్తుల బర్త్ డేలు, ఇతర కార్యక్రమాలను ఆఫీసులో చేస్తారని ఫొటోలు, వీడియోలను సైతం ఉద్యోగులు చూపిస్తున్నారు.
వారికే ప్రయారిటీ..
సీజీజీలో తెలంగాణ వారిని కాదని.. ముఖ్యంగా మహారాష్ట్రకు చెందిన వారికే ప్రాధాన్యత ఇస్తూ నియామకాలు చేస్తున్నారని ఉద్యోగులు ఆరోపిస్తున్నారు. లోకల్ వారిని అవమానించేలా వ్యవహరిస్తూ ఇతర రాష్ట్రాల వారిపై అధిక ప్రేమ చూపిస్తున్నారని విమర్శలొస్తున్నాయి. నెలకు లక్షల వేతనాలు ఉండే ఉద్యోగాల్లో ఇతర రాష్ట్రాల వారిని నియమిస్తూ.. చిన్నచిన్న పోస్టుల్లో మాత్రం లోకల్ వ్యక్తులను నియమిస్తున్నారని ఆరోపణలున్నాయి. సీజీజీలో జరిగే అనేక అక్రమాలపై విచారణ జరిపితే ఆశ్చర్యపోయే విషయాలు వెలుగులోకి వస్తాయని ఉద్యోగులే చెబుతున్నారు.
కుటుంబ పెత్తనం.. లక్షల్లో నకిలీ బిల్లులు డ్రా!
సీజీజీ డైరెక్టర్ భార్యకు అక్కడ ఎలాంటి పొజిషన్ లేకున్నా ఆమె ప్రతి రోజూ అక్కడికి వచ్చి అనధికారికంగా అధికారం చెలాయిస్తున్నారని, అందుకు సంబంధించిన వీడియోలు, ఫొటోలను ఉద్యోగులు బయటపెట్టారు. సీజీజీ వాహనాలను వ్యక్తిగత, కుటుంబ అవసరాల కోసం వాడుకుంటారని.. తప్పుడు బిల్లులు పెట్టడం, నిధులు డ్రా చేయడం వారికి పరిపాటిగా మారిందని ఆరోపిస్తున్నారు. కాంట్రాక్టు ఉద్యోగికి ఈఎల్క్లెయిమ్చేసుకునే అధికారం లేదని ప్రభుత్వమే గతంలో సీజీజీ రాసిన లేఖకు వివరణ ఇచ్చింది. కానీ, డైరెక్టర్ మాత్రం ప్రతిఏటా ఈఎల్పేరిట లక్షల్లో డ్రా చేస్తున్నారని ఆరోపణలున్నాయి. నిధుల డ్రాకు సంబంధించిన పత్రాలను సైతం అక్కడి ఉద్యోగులు చూపిస్తున్నారు. ఆయన అక్రమాలపై చర్యలు తీసుకోవాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి(సీఎస్)కి మెయిల్ద్వారా ఫిర్యాదు చేసినా ఇంతవరకు ఎలాంటి విచారణ జరగలేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
డిసెంబర్‌లోనే కాంట్రాక్టు ముగింపు..
గత డిసెంబర్తోనేఆయన కాంట్రాక్టు పదవీకాలం ముగిసింది. తెలంగాణ ప్రభుత్వం నుంచి ఆయనకు ఎటువంటి కొనసాగింపు ఉత్తర్వులు లేనప్పటికీ నెలల తరబడి కార్యాలయానికి వస్తున్నారని.. ఏ అధికారంతో విధులు నిర్వర్తిస్తున్నారని ఉద్యోగులు ప్రశ్నిస్తున్నారు. ప్రభుత్వం చర్యలు తీసుకోకపోవడంతో ఆయన ‘ఆడింది ఆట.. పాడింది పాట’గా మారిందని విమర్శలు వస్తున్నాయి. ఇప్పటికైనా ఆయన వ్యవహారంపై విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.