RBI: కీలక రేట్లను మరోసారి తగ్గించిన ఆర్‌బీఐ

by S Gopi |
RBI: కీలక రేట్లను మరోసారి తగ్గించిన ఆర్‌బీఐ
X

దిశ, బిజినెస్ బ్యూరో: విశ్లేషకులు ఊహించిన విధంగానే భారతీయ రిజర్వ్ బ్యాంక్(ఆర్‌బీఐ) మరోసారి కీలక రేట్లలో కోత విధించింది. ఈ నెల 7-9 తేదీల మధ్య జరిగిన ద్రవ్య పరపతి విధాన కమిటీ(ఎంపీసీ) సమావేశంలో తీసుకున్న నిర్ణయాలను బుధవారం ఆర్‌బీఐ గవర్నర్ సంజయ్ మల్హోత్రా వెల్లడించారు. ఈ సందర్భంగా.. కీలక రేటును 25 బేసిస్ పాయింట్లకు తగ్గించాలని ఎంపీసీ సభ్యులు నిర్ణయించారు. తద్వారా రెపో రేటు 6.25 శాతం నుంచి 6 శాతానికి తగ్గించినట్టు చెప్పారు. ఈ ఏడాది ఫిబ్రవరిలో జరిగిన సమావేశంలో సైతం ఆర్‌బీఐ రెపో రేటును 25 బేసిస్ పాయింట్ల మేర తగ్గించిన సంగతి తెలిసిందే. ఇదే సమయంలో పాలసీ విధానాన్ని 'తటస్థ' వైఖరి నుంచి 'సర్దుబాటు ' వైఖరికి మారుస్తున్నట్టు సంజయ్ మల్హోత్రా వివరించారు. కీలక రేట్ల తగ్గింపు కోసం కమిటీ సభ్యులు ఏకగ్రీవంగా ఆమోదం తెలిపారు. ఈ తగ్గింపు ద్వారా ప్రజలు తీసుకునే గృహ, వాహన, వ్యక్తిగతం వంటి రిటైల్ రుణాలపై వడ్డీ రేట్ల తగ్గే అవకాశాలు ఉన్నాయి.

విలేకరులతో మాట్లాడే సందర్భంలో తర్వాతి ఎంపీసీ సమావేశంలోనూ రేట్ల తగ్గింపు ఉంటుందా? అన్న ప్రశ్నకు సంజయ్ మల్హోత్రా సమాధారాలు చెప్పారు. మెరుగైన వృద్ధి కోసం, ద్రవ్యోల్బణ కట్టడికీ పనిచేస్తున్నాం. ఈ ఏడాది యూనియన్ బడ్జెట్‌లోనూ అందుకు అనుగుణంగానే ప్రకటనలు వచ్చాయన్నారు. రేట్ల తగ్గింపు కొనసాగుతుంది. అయితే, ఎప్పటివరకు ఈ తగ్గింపు నిర్ణయాలు తీసుకుంటామో చెప్పలేనని చెప్పారు. తాను సాధారణ సంజయ్‌ని మాత్రమేనని, మహాభారతంలో సంజయుడిని కాదని పేర్కొన్నారు.

ఇప్పుడు మేం కూడా రెపో రేటును తగ్గించాం. ఇది ఎప్పటివరకు కొనసాగుతుందని నేను కూడా చెప్పలేం. ఎందుకంటే నేను కేవలం సంజయ్‌ని మాత్రమే.. మహాభారతంలో సంజయుడిని కాదు కదా..! ఆయనలా భవిష్యత్తును చూడగలిగే దివ్యదృష్టి నాకు లేదు’’ అని అన్నారు.

ద్రవ్యోల్బణ అంచనాను 4 శాతానికి తగ్గించిన ఆర్‌బీఐ

ఇప్పటికే నెమ్మదించిన దేశ ఆర్థికవృద్ధిపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సుంకాల ప్రభావం ఎంతమేరకు ఉంటుందనే ఆందోళన కలుగుతోందని ఆర్‌బీఐ గవర్నర్‌ సంజయ్‌ మల్హోత్రా పేర్కొన్నారు. భౌగోళికంగా నెలకొన్న వాణిజ్య భయాల నేపథ్యంలో వృద్ధి రేటు అంచనాను స్వల్పంగా తగ్గించామని సంజయ్ మల్హోత్రా చెప్పారు. 2025-26 ఆర్థిక సంవత్సరానికి వృద్ధి రేటును 6.5 శాతంగా ఆర్‌బీఐ అంచనా వేసింది. ఇదే సమయంలో మెరుగైన వ్యవసాయోత్పత్తి, ముడిచమురు ధరలు తగ్గుముఖం పట్టడంతో ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి ద్రవ్యోల్బణం అంచనాను ఆర్‌బీఐ 4.2 శాతం నుంచి 4 శాతానికి తగ్గించింది. అలాగే, అంతర్జాతీయ నెలకొన్న ఆర్థిక అనిశ్చితుల వల్ల పెట్టుబడులు, వినియోగంపై ప్రతికూలంగా ప్రభావం ఉంటుందని సంజయ్ మల్హోత్రా చెప్పారు. ఫలితంగా వృద్ధి రేటు నెమ్మదించే అవకాశం ఉంది.

తగ్గనున్న ఈఎంఐ భారం

ఆర్‌బీఐ వడ్డీ రేట్ల తగ్గింపుతో ఇళ్ల రుణాలు తీసుకున్న వారికి భారీ ఊరట లభించనుంది. రెపో రేటులో 0.25 శాతం తగ్గింపుతో పాటు ఫిబ్రవరిలో తగ్గించిన మరో 0.25 శాతాన్ని కూడా కలుపుకుంటే అర శాతం వరకు బ్యాంకులు రిటైల్ రుణాలపై వడ్డీ రేట్లను తగ్గించే వీలుంది. ఉదాహరణకు 20 ఏళ్ల కాలానికి రూ.50 లక్షల రుణాన్ని 9 శాతం వడ్డీతో తీసుకుంటే, నెలకు రూ.44,986 ఈఎంఐ చెల్లించాల్సి వస్తుంది. ఈ ఏడాది రెండు సమావేశాల్లో ఆర్‌బీఐ తగ్గించిన 50 బేసిస్ పాయింట్ల కారణంగా ఈఎంఐ రూ.43,391కు తగ్గుతుంది. ఫలితంగా దీర్ఘకాలంలో రూ.4.50 లక్షల వరకు ఆదా అవుతుంది.

బంగారు రుణాలకు మార్గదర్శకాలు

తాజా సమావేశంలో గోల్డ్ లోన్‌లకు సంబంధించి ఆర్‌బీఐ కీలక ప్రకటన చేసింది. గోల్డ్ లోన్ నిబంధనలను కఠినతరం చేస్తూ, త్వరలో దీనికి సంబంధించి మార్గదర్శకాలు జారీ చేయనున్నట్టు ఆర్‌బీఐ వెల్లడించింది. గత కొన్నేళ్ల నుంచి అత్యంత వేగంగా పెరుగుతున్న బంగారు రుణాలను కట్టడి చేయడం కోసం ఆర్‌బీఐ ఈ నిర్ణయం తీసుకుంది.

పీ2ఎం పరిమితి పెంపు

డిజీటల్ చెల్లింపులను మరింత ప్రోత్సహించే లక్ష్యంతో ఆర్‌బీఐ సామాన్యులు వ్యాపారులకు చెల్లింపులు చేసే పర్సన్-టు-మర్చంట్(పీ2ఎం) చెల్లింపుల పరిమితిని గణనీయంగా పెంచింది. యూజర్ల అవసరాలకు అనుగుణంగా దీన్ని పెంచుకునే వెసులుబాటును ఎన్‌పీసీఐకి ఆర్‌బీఐ అనుమతిచ్చింది. ఎక్కువ గోల్డ్ లోన్స్ కారణంగా ముప్పు ఏర్పడవచ్చని, దీన్ని అధిగమించేందుకు ఎన్‌పీసీఐ నిబంధనల ఆధారంగా పర్సన్-టు-మర్చంట్(పీ2ఎం) పరిమితిని రూ. 5 లక్షల నుంచి పెంచుకునేందుకు ఎన్‌పీసీఐకి అనుమతి ఇచ్చింది.



Next Story

Most Viewed