రైతు పండుగగా ‘ఉగాది’.. ప్రజలకు శుభాకాంక్షలు తెలిపిన సీఎం కేసీఆర్

by Anukaran |
CM KCR Ugadi
X

దిశ, తెలంగాణ బ్యూరో : వ్యవసాయ ప్రారంభ సంవత్సరంగా, రైతు పండుగగా ఉగాది ప్రసిద్ధి చెందిందని సీఎం కేసీఆర్ అన్నారు. తెలుగు సంవత్సరాది ఉగాది పర్వదినం ప్లవ నామ సంవత్సరాన్ని పురస్కరించుకొని రాష్ట్ర ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ ఆకులు రాల్చిన ప్రకృతి కొత్త చిగురులతో వసంతాన్ని మోసుకొస్తూ, నూతనోత్తేజాన్ని సంతరించుకుంటూ పక్షుల కిలకిలా రాగాలతో ఆహ్లాదకరమైన కొత్త జీవితానికి ఉగాది ఆహ్వానం పలుకుతుందన్నారు. ప్రతి ఏటా చైత్రమాసంతో ప్రారంభమయ్యే ఉగాది నాడు పచ్చడిని సేవించడం గొప్ప ఆచారమని తెలిపారు. ఈ ఏడాది నీరు సమృద్ధిగా లభిస్తుందని పంచాంగాలు చెప్పుతున్నాయని, వ్యవసాయ రంగానికి ఇది మంచితరుణం అన్నారు. ప్రభుత్వ లక్ష్యానికి ప్రకృతి కూడా తోడు కావడం శుభసూచకమన్నారు.

వేపపూత, మామిడి కాయ, చింతపండులాంటి ప్రకృతి ఫలాలను.. తీపి, వగరు చేదులాంటి షడ్రుచుల పచ్చడి సేవించి పండుగను జరుపుకోవడం సందేశాన్నిస్తుందని కేసీఆర్ అన్నారు. మనిషి జీవితంలోని కష్ట సుఖాలు, మంచి చెడుల వంటి జీవిత సారాన్ని తాత్వికంగా గుర్తుచేసుకునే గొప్ప సాంప్రదాయానికి చిహ్నంగా ఉగాది పచ్చడిని సేవిస్తారని పేర్కొన్నారు. ఉమ్మడి పాలనలోని చేదు అనుభవాలను చవి చూసిన తెలంగాణ రైతు, స్వయంపాలనలో తియ్యటి ఫలాలను అనుభవిస్తున్నారని తెలిపారు.

బ్యారేజీలు నిర్మించామని, సొరంగాలు తవ్వి, లిఫ్టుల ద్వారా నీటిని ఎత్తిపోసి.. నదీజలాలను సాగరమట్టానికి ఎత్తులో ఉన్న బీడుభూములకు నీరందించామన్నారు. తెలంగాణను కోటి ఎకరాల మాగాణిని చేస్తున్న కాళేశ్వరం ప్రాజెక్టు ప్రశంసలందుకుంటుందని తెలిపారు. పాలమూరు ఎత్తిపోతలు, ఆన్ గోయింగ్ సాగునీటి ప్రాజెక్టులను త్వరలోనే పూర్తి చేసుకోబోతున్నామని కేసీఆర్ వివరించారు. తెలంగాణ దేశానికి అన్నపూర్ణగా నిలిచిందని, విమర్శకుల అంచనాలను తారుమారు చేసి పంటల సాగు, ధాన్యం దిగుబడిలో దేశంలోనే ప్రథమ స్థానానికి చేరుకుందని తెలిపారు. రైతు పండించిన పంటను ప్రభుత్వమే కొనుగోలు చేసి కరోనా కాలంలో ఆదుకుంటుందన్నారు.

సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణం, రైతుబంధు, రైతు బీమా, రుణమాఫీ, ఉచిత విద్యుత్ తదితర రైతు సంక్షేమ, వ్యవసాయాభివృద్ధి పథకాల అమలు కోసం ప్రతి ఏటా సుమారు 50 వేల కోట్ల రూపాయలకు పైగా ప్రభుత్వం ఖర్చు చేస్తుందని కేసీఆర్ వివరించారు. రైతును సంఘటిత పరిచేందుకు రైతు బంధు సమితులు ఏర్పాటు చేసి, ఊరూరా రైతు వేదికలను నిర్మించామన్నారు. వ్యవసాయాన్ని తెలంగాణ ప్రభుత్వం పండుగగా మార్చిందని, వ్యవసాయ అనుబంధ రంగాలకు ప్రభుత్వం ప్రాధాన్యం ఇస్తుందన్నారు. రైతు కుటుంబాల్లో వసంతాలను తెచ్చి, పున్నమి వెన్నెలను నింపడమే తెలంగాణ ప్రభుత్వ లక్ష్యమని పేర్కొన్నారు.

Advertisement

Next Story

Most Viewed