బడ్జెట్‌పై కసరత్తు షురూ.. సీఎం కేసీఆర్ సమీక్ష

by Shyam |
బడ్జెట్‌పై కసరత్తు షురూ.. సీఎం కేసీఆర్ సమీక్ష
X

దిశ, తెలంగాణ బ్యూరో: కేంద్ర బడ్జెట్‌లో తెలంగాణకు ఏయే రూపాల్లో ఏమేరకు నిధులు సమకూరనున్నాయో, 15వ ఆర్థిక సంఘం సిఫారసుల మేరకు ఎంత రానుందో అధికారుల నుంచి ముఖ్యమంత్రి కేసీఆర్ వివరాలు తెలుసుకున్నారు. రాష్ట్ర బడ్జెట్‌ను మార్చి నెలలో ప్రవేశపెట్టనున్న నేపథ్యంలో కూర్పుపై ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి రామకృష్ణారావు, ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ తదితరులతో ప్రగతి భవన్‌లో గురువారం సీఎం సమావేశమయ్యారు. కరోనా కారణంగా భారీస్థాయిలో రాష్ట్ర స్వీయ ఆర్థిక వనరులు తగ్గిపోయినందున రానున్న ఆర్థిక సంవత్సరానికి ఏ తరహాలో బడ్జెట్ తయారుకావాలో చర్చించినట్లు తెలిసింది. రెండో టర్ములో ఇప్పటికే రెండేళ్ళు పూర్తయినందున ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీల అమలుకు ఏ మేరకు ఖర్చువుతుందో కూడా ఆరా తీసినట్లు తెలిసింది.

నిరుద్యోగ భృతి, రైతుల రుణమాఫీ, ‘ఆసరా’ పింఛనుదార్ల వయో పరిమితిని 57ఏళ్ళకు కుదించడం, ప్రభుత్వ ఉద్యోగులకు పీఆర్సీ ఫిట్‌మెంట్.. ఇలాంటి హామీలన్నింటినీ అమలుచేయాల్సి ఉన్నందున వాటితో ప్రభుత్వ ఖజానాకు ఏ మేరకు భారం పడుతుందో చర్చించినట్లు తెలిసింది. 14వ ఆర్థిక సంఘం కంటే 15వ ఆర్థిక సంఘం సిఫారసుల ద్వారా రాష్ట్రానికి నిధులు ప్రతీ ఏటా సగటున దాదాపు రెండున్నర వేల కోట్లు తగ్గనున్నట్లు ఇప్పటికే ఆర్థిక శాఖ అధికారులు అంచనా వేశారు. తెలంగాణ రాష్ట్రానికి కేంద్ర బడ్జెట్‌లో పెద్దగా నిధులు వచ్చే అవకాశం లేనందువల్ల స్వీయ ఆర్థిక వనరులను ఏ మేరకు పెంచుకోవచ్చనేదానిపై అధికారులతో సీఎం చర్చించినట్లు తెలిసింది.

కాపిటల్ ఖర్చులపై ఆంక్షలు

ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి రూ. 1.82 లక్షల కోట్లతో బడ్జెట్‌ను రూపొందించిన ప్రభుత్వం రానున్న ఆర్థిక సంవత్సరానికి ఏ స్థాయిలో ఉంటుందనేది ఆసక్తికరంగా మారింది. నవంబరు నెలలో కేసీఆర్ సమీక్ష చేసిన సందర్భంగా కరోనా కారణంగా రాష్ట్రానికి సుమారు రూ. 52 వేల కోట్ల మేర ఆదాయం తగ్గిపోయినట్లు పేర్కొన్నారు. అయితే ‘అన్‌లాక్’ సడలింపులతో ఆదాయం కొంత పెరిగినందున సవరించిన బడ్జెట్ అంచనాలపై ఈ సమావేశంలో చర్చ జరిగినట్లు తెలిసింది. ఎన్నికల హామీల అమలుతో పాటు పాలమూరు-రంగారెడ్డి, డిండి, కాళేశ్వరం మూడో టీఎంసీ తదితర సాగునీటి ప్రాజెక్టులకు కావాల్సిన నిధులపై కూడా చర్చించినట్లు సమాచారం.

పరిమిత ఆర్థిక వనరులతో ఒకవైపు సంక్షేమ పథకాలు, అమలుకు నోచుకోకుండా ఉన్న హామీలు తదితరాలతో పాటు సాగునీటి ప్రాజెక్టులకు ఖర్చు చేయాల్సి ఉన్నందున కొన్నింటిపై కోత పెట్టడమో లేక వనరుల సమీకరణకు ప్రత్యామ్నాయ మార్గాలను ఎంచుకోవడమో తప్పనిసరి అవుతోంది. ఆర్టీసీ బస్సు ఛార్జీలను పెంచక తప్పదని సీఎం కేసీఆర్ ఇప్పటికే ఒక సందర్భంలో వ్యాఖ్యానించినందున రానున్న ఆర్థిక సంవత్సరంలో పెరిగే అవకాశమూ ఉంది. రిజిస్ట్రేషన్ ధరలను సవరించడం, స్టాంపు డ్యూటీ పెంపు తదితరాల ద్వారా కూడా ఆదాయాన్ని పెంచుకోవాలనే ఆలోచన ఉన్నట్లు గత కొంతకాలంగా చర్చ జరుగుతోంది. ఇలాంటివన్నీ రానున్న ఆర్థిక సంవత్సరంలో చోటుచేసుకునే అవకాశం ఉంది. ఇలాంటి ఆర్థిక చిక్కుల నేపథ్యంలో రానున్న కాలంలో కాపిటల్ ఎక్స్‌పెండిచర్ భారీ స్థాయిలో తగ్గే అవకాశం ఉంది.

కొత్త బడ్జెట్ ఏ తీరులో ఉండనుందీ, గతేడాదికంటే పెరుగుదల ఉండే అవకాశం తదితరాలన్నింటిపై సీఎం చర్చించిన వివరాలు వెల్లడికాలేదు.

Advertisement

Next Story

Most Viewed