వ్యవసాయం లాభసాటిగా మారాలి.. రైతులు ధనికులు కావాలి

by Shyam |
వ్యవసాయం లాభసాటిగా మారాలి.. రైతులు ధనికులు కావాలి
X

దిశ, వెబ్‌డెస్క్: ప్రపంచవ్యాప్తంగా ఉన్న వ్యవసాయ పరిస్థితులను అధ్యయనం చేసి వాటిని తెలంగాణలో అమలు చేయాలని ముఖ్యమంత్రి కేసీఆర్ వ్యాఖ్యానించారు. లక్షలాది మంది రైతులతో కోటికి పైగా ఎకరాలతో విస్తారంగా ఉన్న వ్యవసాయ రంగాన్ని లాభసాటిగా మార్చేందుకు వ్యవసాయశాఖ మొండి పట్టుదల, నిరంతర శ్రమతో పని చేయాలని అన్నారు. బుధవారం ప్రగతి భవన్‌లో వ్యవసాయ శాఖపై సమీక్ష నిర్వహించిన సీఎం కేసీఆర్ పై విధంగా స్పందించారు. ఈ సమీక్షకు మంత్రి నిరంజన్‌రెడ్డి, రైతు బంధు సమితి అధ్యక్షుడు పల్లా రాజేశ్వర్‌రెడ్డి, ప్రభుత్వ ముఖ్య సలహాదారు రాజీవ్ శర్మ, సీఎస్ సోమేశ్ కుమార్, ఉన్నతాధికారులు హాజరయ్యారు.

సంప్రదాయక వ్యవసాయ పద్ధతుల స్థానంలో గొప్ప పరివర్తన రావాలని, అసంఘటిత రంగంలో ఉన్న రైతులకు సంఘటిత శక్తిలోని బలం ఏంటో చూపించాలన్నారు. మేలైన సాగు విధానాలు, లాభదాయక పద్ధతులు తెచ్చేందుకు వ్యవసాయశాఖ మార్గదర్శనం చేసి నాయకత్వం వహించాలన్నారు. తెలంగాణ రాష్ట్రం గొప్ప వ్యవసాయ రంగంగా మారుతోందని, దానికి తగ్గట్టు సంస్థాగతంగా బలోపేతం కావాలని సూచించారు. అవసరమైతే వ్యవసాయ శాఖకు మరిన్ని పోస్టులు మంజూరు చేయడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందని పేర్కొన్నారు. ప్రభుత్వం ఇచ్చిన పిలుపు మేరకు రాష్ట్రంలో రైతుంలదరూ నూటికి నూరుశాతం చెప్పిన పంటలే వేశారన్నారు. అయితే రైతులు ఏ గుంటలో ఏపంటలు పండిస్తున్నారో ఖచ్చితమైన వివరాలు తీసుకోవాలని స్పష్టం చేశారు.

వ్యవసాయ రంగాన్ని డెవలప్ చేసేందుకు భారతదేశంలో ఎక్కడా, ఎన్నడూ జరగనంత ప్రయత్నం మన రాష్ట్రంలో జరుగుతుందన్నారు. కోట్లాది రూపాయల ఖర్చుతో ప్రాజెక్టుల నిర్మాణం చేపట్టి.. రైతులకు ఉచితంగా నీరందిస్తున్నామన్నారు. ఒక్కరూపాయి కూడా భూమి శిస్తు తీసుకోవద్దనే ఉద్దేశ్యంతో నీటి తీరువా విధానాన్నే రద్దు చేయడంతో పాటు భూమి శిస్తు తీసుకోవద్దనే ఉద్దేశ్యంతో పాత బకాయిలను ప్రభుత్వం మాఫీ చేసిందన్నారు. వ్యవసాయానికి నాణ్యమైన 24గంటల కరెంటును ఉచితంగా ఇవ్వడంతో పాటు పెట్టుబడిని కూడా రైతుబంధు పథకం కిద ప్రతి పంటకు తమ ఖాతాల్లోనే జమ చేస్తుందన్నారు. ఏ కారణంతోనైనా రైతు చనిపోతే అతని కుటుంబం ఇబ్బంది పడొద్దన్న ఉద్దేశ్యంతో రూ.5లక్షల బీమా ప్రభుత్వం అందిస్తుందన్నారు. కరోనా కాలంలో కూడా రైతు పండిచిన ప్రతీ పంటను ప్రభుత్వం కొనుగోలు చేసిందన్నారు. వ్యవసాయం లాభసాటిగా మారి అంతిమంగా రైతులు ధనికులు కావడం కోసమే ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తుందని అధికారుల సమావేశంలో సీఎం కేసీఆర్ స్పష్టం చేశారు.

Advertisement

Next Story

Most Viewed