- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
కేసీఆర్ నెక్ట్స్ టార్గెట్ ఆ మంత్రే.. అందుకే గ్యాప్!
దిశ ప్రతినిధి, నల్లగొండ: అధికార టీఆర్ఎస్ పార్టీలో అసంతృప్తుల స్వరం పెరుగుతోంది. ఇప్పటికే మంత్రి ఈటల రాజేందర్ పార్టీ నుంచి ఔట్ కాగా, తాజాగా మరో కీలక మంత్రి, సీఎం కేసీఆర్‌కు అత్యంత సన్నిహితుడిగా పేరున్న గుంటకండ్ల జగదీష్ రెడ్డి పేరు మారుమోగుతోంది. వాస్తవానికి గతకొంతకాలంగా ప్రగతిభవన్‌కు, మంత్రి జగదీష్‌రెడ్డికి గ్యాప్ పెరిగిపోయింది. పార్టీ కార్యక్రమాల్లోనూ మంత్రి జగదీష్ రెడ్డికి ఒకింత ప్రాధాన్యం తగ్గుతూ వస్తోంది. వాస్తవానికి ఉద్యమకాలం నుంచి సీఎం కేసీఆర్‌కు అత్యంత సన్నిహితుడిగా, నమ్మిన బంటుగా ఉంటూ వచ్చారు. టీఆర్ఎస్ అధికారంలోకి వచ్చిన మొదటి ఐదేండ్లు దాదాపుగా ఆయనదే హవా నడిచింది. ఏ కీలక నిర్ణయం తీసుకోవాలన్నా.. ఉమ్మడి నల్లగొండ జిల్లాలో ఎవ్వరికీ టికెట్ ఇవ్వాలన్నా.. మంత్రి జగదీష్ రెడ్డి నిర్ణయమే ఫైనల్ అన్నట్టుగా ఉండేది. కానీ ఇటీవల జరిగిన పరిణామాల నేపథ్యంలో ఆ పరిస్థితులు కాస్త తలకిందులయ్యాయి. నమ్మినబంటు ముద్ర నుంచి నమ్మకద్రోహి అనే ముద్ర పడేలా కొంత ప్రచారం జరుగుతోంది. నిజానికి కొంతకాలంగా మంత్రి జగదీష్ రెడ్డికి మంత్రివర్గం నుంచి ఉద్వాసన తప్పదనే ప్రచారం జరిగింది. దీనికి బలం చేకూరుస్తూ మల్కాజిగిరి ఎంపీ రేవంత్ రెడ్డి చేసిన ట్వీట్‌తో రాజకీయాలు ఒక్కసారిగా హీటెక్కాయి.
కేటీఆర్ సీఎం కావడం ఇష్టం లేకనే..
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా కేటీఆర్ బాధ్యతలు చేపట్టబోతున్నారనే ప్రచారం వచ్చిన దగ్గరి నుంచి కొంతమంది మంత్రులపై ఆరోపణలు మొదలయ్యాయి. అందులో ప్రధానంగా ఈటల రాజేందర్, మంత్రి జగదీష్ రెడ్డితో పాటు మరికొంతమంది పేర్లు ప్రముఖంగా విన్పించాయి. ఒకప్పుడు సీఎం కేసీఆర్.. ఏ నిర్ణయం తీసుకోవాలన్నా.. మంత్రులు ఈటల, గుంటకండ్ల అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకునేవారు. కానీ కొంతమంది సీఎం కేసీఆర్‌కు దగ్గరయ్యాక వీరి ప్రాధాన్యత తగ్గింది. దీనికితోడు సీఎం కేసీఆర్ నియంతృత్వం పెరిగిందనే భావనలోకి మంత్రులు, ఎమ్మెల్యేలు వచ్చారట. ఈ క్రమంలోనే కేటీఆర్‌ను సీఎం చేయాలనే ప్రతిపాదన తేరపైకి రావడంతో టీఆర్ఎస్‌లోని అసంతృప్తి స్వరాలన్నీ ఒక్కటయ్యే ప్రయత్నం జరిగింది. ఆ కీలక ఘట్టానికి మంత్రి జగదీష్ రెడ్డి.. తన కుమారుడి బర్త్ డే వేడుకలను నిర్వహించిన కర్ణాటకలోని హంపీ వేదికయ్యింది. ఈ బర్త్ డే పార్టీలో కేటీఆర్ ముఖ్యమంత్రి అవ్వడంపై సుదీర్ఘం చర్చ సాగడం.. ఛలోక్తులు, వ్యంగ్యోక్తులు విసురుకోవడం.. ఆ వీడియో కాస్త ప్రగతి భవన్‌కు చేరడం చకచకా జరిగిపోయింది. ఆ తర్వాతే కొంతమంది మంత్రులపై సీఎంఓ వర్గాలు ప్రత్యేక నిఘా పెట్టాయి.
పార్టీలో తగ్గిన ప్రాధాన్యత..
కొంతకాలం క్రితం వరకు ఉమ్మడి నల్లగొండ జిల్లాకు మంత్రి జగదీష్ రెడ్డే బాస్. కానీ ప్రస్తుతం జగదీష్ రెడ్డి పాత్ర రోజురోజూకీ తగ్గుతూ వస్తోంది. పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల నుంచి నాగార్జునసాగర్ ఉపఎన్నిక వరకు అంతా ఒంటరే. వాస్తవానికి సీఎం కేసీఆర్ ఉమ్మడి నల్లగొండ జిల్లాకు సంబంధించి ఏ నిర్ణయం తీసుకోవాలన్నా.. ఆయన నోటి నుంచి ముందే వచ్చే మాట జగదీష్.. అది బహిరంగ సభ అయినా.. సమావేశమైనా.. మంత్రి జగదీష్ రెడ్డి కీలకంగా మారేవారు. కానీ గతకొంతకాలంగా ఇటు ఉమ్మడి నల్లగొండ జిల్లాలోనూ.. అటు పార్టీలోనూ ప్రాధాన్యత తగ్గుతూ వస్తోంది. ప్రధానంగా నాగార్జునసాగర్ ఉపఎన్నిక విషయంలోనూ ఆయన మాటను సీఎం కేసీఆర్ ఏమాత్రం పట్టించుకోలేదట. ఎమ్మెల్యే అభ్యర్థిత్వం విషయంలో ఎంసీ కోటిరెడ్డి పేరును ఎంత బలవంతంగా తేర మీదకు తెచ్చినా లెక్కలోకి తీసుకోలేదట. మంత్రి జగదీష్ రెడ్డిని కేవలం ప్రచారానికి పరిమితం చేశారు. ఉపఎన్నిక బాధ్యతనంతా ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్ రెడ్డి, పార్టీ రాష్ట్ర కార్యదర్శి తక్కెళ్లపల్లి ప్రభాకర్ రావు చేతుల మీదుగానే నడిపారు.
వెన్నుపోటు ఆరోపణల్లో నిజమెంత..?
కేటీఆర్‌ను సీఎం చేసే విషయం దగ్గరి నుంచి జిల్లాలో తన ప్రాధాన్యతకు గండికొట్టే వారిని దెబ్బతీసేలా.. పార్టీకి వ్యతిరేకంగా మంత్రి జగదీష్ రెడ్డి పావులు కదుపుతూ వస్తున్నారనే వెన్నుపోటు ఆరోపణలు బలంగా విన్పించాయి. ఓ ఎమ్మెల్సీ ఎన్నికలో పార్టీ అభ్యర్థిని ఓడించేందుకు ప్రయత్నాలు చేశారనే ప్రచారం లేకపోలేదు. గత అసెంబ్లీ ఎన్నికల్లో అప్పటివరకు తనకు సన్నిహిత ఎమ్మెల్యేగా ఉన్న ఓ అభ్యర్థిని తనకు మంత్రి పదవికి ఎసరు వస్తుందనే ఉద్దేశంతో సదరు అభ్యర్థిని ఓడిపోవడానికి పరోక్షంగా సహకరించారనే ఆరోపణలు విన్పించాయి. దీనిపై నిఘా వర్గాలు సీఎం కేసీఆర్‌కు నివేదికను అందించాయని తెలుస్తోంది. దీనికితోడు సాగర్ ఉపఎన్నిక విషయంలో ఎంసీ కోటిరెడ్డి అభ్యర్థిత్వం ఖరారుపై తాత్సరం జరుగుతుండడంతోQ బీజేపీ నేత, మాజీ ఎంపీతో టచ్‌లోకి ఎంసీ కోటిరెడ్డి వెళ్లేలా స్కెచ్ వేశారట. వీటన్నింటిపై పార్టీ అధిష్టానం దగ్గర సమగ్ర సమాచారం ఉన్నట్టు తెలిసింది.
ప్రకంపనలు సృష్టించిన రేవంత్ ట్వీట్..
మంత్రివర్గంలో నుంచి త్వరలో బయటకు వెళ్లేది మంత్రి జగదీష్ రెడ్డేనంటూ మల్కాజగిరి ఎంపీ రేవంత్ రెడ్డి చేసిన ట్వీట్ ఒక్కసారిగా రాజకీయ ప్రకంపనలను సృష్టించింది. వాస్తవానికి మంత్రి జగదీష్ రెడ్డిని సీఎం కేసీఆర్ దూరం పెట్టారనే ప్రచారం కొంతకాలంగా జరుగుతోంది. కానీ మంత్రి దాన్ని కవర్ చేస్తూ వచ్చారని సొంత పార్టీ నేతలు చెబుతున్నారు. అనుహ్యంగా ఎంపీ రేవంత్ ట్వీట్ చేయడంతో ఇటు ఉమ్మడి నల్లగొండ జిల్లా రాజకీయాలతో పాటు అటు రాష్ట్ర రాజకీయాల్లోనూ వేడి పుట్టింది. రేవంత్ ట్వీట్ సంగతి పక్కన పెడితే.. మంత్రి జగదీష్ రెడ్డికి ప్రభుత్వంలోనూ పార్టీలోనూ ప్రాధాన్యత తగ్గిందనడంలో ఎలాంటి సందేహం లేదు.