మనం కట్టేది ఇళ్లు కాదు..ఊళ్లు : సీఎం జగన్

by srinivas |
మనం కట్టేది ఇళ్లు కాదు..ఊళ్లు : సీఎం జగన్
X

దిశ, ఏపీ బ్యూరో : మనం కట్టేది కేవలం ఇళ్లు కాదు.. ఊళ్లు. దీన్ని దృష్టిలో పెట్టుకొని అన్నీ వసతులతో అందంగా కాలనీలను తీర్చిదిద్దాలి. ఎవరు ఎలా కావాలంటే అలా కట్టివ్వాలని సీఎం జగన్ ​అధికారులకు దిశానిర్దేశం చేశారు. సోమవారం తాడేపల్లి క్యాంపు కార్యాలయం నుంచి పేదల గృహ నిర్మాణం, ఇళ్ల పట్టాల పంపిణీపై మంత్రులు, అధికారులతో సమీక్షించారు.

సీఎం మాట్లాడుతూ డిసెంబరు 25న ఇళ్ల పట్టాలు ఇవ్వడం ప్రారంభించి జనవరి 7 దాకా పంపిణీ కొనసాగాలని సూచించారు. అన్ని నియోజకవర్గాలు, పట్టణాల్లో ఎమ్మెల్యేలు ఈ కార్యక్రమంలో పాల్గొని అత్యంత పారదర్శకంగా పనులు చేపట్టాలని ఆదేశించారు. ఇళ్ల స్థలాలకు కేటాయించిన భూములపై కోర్టు కేసులుంటే త్వరగా వాటిని పరిష్కరించాలని కోరారు. లబ్ధిదారులు ఇళ్లు కట్టించి ఇవ్వమంటే ఇళ్లు కట్టించి ఇవ్వాలి. మెటీరియల్‌, లేబర్‌ కాంపొనెంట్‌కు సంబంధించి డబ్బు ఇవ్వమని అడిగితే అలాగే ఇచ్చేయాలని అధికారులను ఆదేశించారు. ఇళ్ల నిర్మాణం కోసం ప్రభుత్వ విభాగాలు సమన్వయంతో ముందుకెళ్లాలని సూచించారు. ఇళ్ల నిర్మాణం ప్రారంభించిన తర్వాత శరవేగంతో పనులు సాగాలన్నారు. ఇళ్ల నిర్మాణంలో నాణ్యత చాలా ముఖ్యమని సీఏం జగన్​ ఆదేశించారు. సమావేశంలో డిప్యూటీ సీఎం ధర్మాన కృష్ణదాస్, మంత్రులు బొత్స సత్యనారాయణ, చెరుకువాడ శ్రీరంగనాథరాజు, గృహ నిర్మాణ శాఖ ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

మొత్తం ఇళ్ల పట్టాలు 30.75 లక్షలు

డిసెంబరు 25 నుంచి జనవరి 7 లోపు మొత్తం 30.75 లక్షల ఇళ్ల పట్టాలు ఇవ్వాల్సి ఉంది. అందులో 3,65,987 ఇళ్ల స్థలాలపై కోర్టు కేసులున్నాయి. గడువులోగా వీటిల్లో ఎన్ని పరిష్కరిస్తే అన్ని పట్టాలు ఇస్తారు. మిగతా వారికి పరిష్కారం కాగానే ఇస్తామని లేఖ ఇస్తారు. ఇళ్ల స్థలాల కోసం 68,361 ఎకరాలు సేకరించారు. రూ.23,535 కోట్ల విలువైన ఇళ్ల స్థలాలను పేదలకు పంపిణీ చేయనున్నారు. వచ్చే మూడేళ్లలో 28.3 లక్షల ఇళ్ల నిర్మాణానికి ప్రభుత్వం ప్రణాళిక సిద్ధం చేసింది.

పట్టాలు ఇచ్చిన ప్రాంతాల్లో డిసెంబర్‌ 25నే 15.6 లక్షల ఇళ్ల నిర్మాణం ప్రారంభిస్తారు. 175 నియోజకవర్గాల్లో నియోజకవర్గానికి 8,914 ఇళ్లు చొప్పున పనులు ప్రారంభమవుతాయి. 8,838 కొత్త లే అవుట్లలో 11.26 లక్షల ఇళ్ల నిర్మాణం చేపడతారు. రెండో దశలో 12.7 లక్షల ఇళ్లు నిర్మిస్తారు. టిడ్కో ఇళ్లలో 365, 430 చదరపు అడుగుల ప్లాట్లపై సీఎం ప్రకటించిన తాజా రాయితీల ప్రకారం అదనంగా రూ.482 కోట్ల ఖర్చును ప్రభుత్వం భరిస్తుంది. 300 చదరపు అడుగుల ప్లాట్లను కేవలం ఒక్క రూపాయికే ఇస్తారు.

Advertisement

Next Story