మిస్సింగైన మూడేళ్లకు శ్మశానంలో దొరికిన క్లూ

by Anukaran |
murder
X

దిశ, వెబ్‌డెస్క్ : మూడేళ్ల క్రితం నమోదైన మిస్సింగ్ కేసులు పోలీసులు ఛేదించారు. ఇంట్లో నుంచి బయటకు వెళ్లిన వ్యక్తి మళ్లీ తిరిగి రాలేదు. దీనిపై ఇల్లందు పోలీస్ స్టేషన్ లో కేసు నమోదైనప్పటికీ ఆచూకీ లభించలేదు. చివరికి శివరాత్రి రోజు ఈ కేసును ఛేదించారు. ఇందుకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి.

ఇల్లందు పట్టణం కాకతీయ నగర్ కు చెందిన విజయ్ అలియాస్ శివ జులాయిగా తిరుగుతూ అందరితో గొడవ పడేవాడు. ఇలా రోడ్డుపై కనిపించిన వారందరిపై దాడికి దిగుతూ ఘర్షణ పడేవాడు. దీంతో పోలీసులు అతడిపై రౌడీషీట్ ఓపెన్ చేశారు. అయినా శివలో ఎలాంటి మార్పు రాలేదు. ఈ క్రమంలో 2018 లో ఇంట్లో నుంచి బయటకు వెళ్లిన అతడు.. మళ్లీ తిరిగి రాలేదు. దీనిపై శివ కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు ఇల్లందు పోలీసులు మిస్సింగ్ కేసు నమోదు చేశారు.

పోలీసులు కేసు దర్యాప్తు ఒక్క అడుగు కూడా ముందుకు సాగలేదు. అతడి మిస్సింగ్ లో ఎలాంటి క్లూ దొరకలేదు. కుటుంబ సభ్యులు ఎవరిపై అనుమానం వ్యక్తం చేయలేదు. దీంతో ఆ కేసు మూడేళ్లుగా మిస్టరీగానే మిగిలిపోయింది. అయితే ఓ కేసును దర్యాప్తు చేస్తున్న పోలీసులకు శివ హత్యకు గురైనట్లు తెలిసింది. వెంటనే ఏఎస్పీ శబరీష్ రంగంలోకి దిగి కేసును విచారించారు. శివను హత్య చేసి సీఎస్పీ బస్తీలోని హిందూ శ్మశానవాటికలో దుండగులు పూడ్చి పెట్టారని గుర్తించారు. ఏఎస్పీ శబరీష్ ఆధ్వర్యంలో పోలీసులు గురువారం పంచనామా నిర్వహించారు. మృతదేహాన్ని బయటకు తీసి ఫోరెన్సిక్ నిపుణులు పోస్ట్ మార్టం నిర్వహించి క్లూస్ సేకరించారు. ప్రస్తుతం కేసు దర్యాప్తులో ఉన్నది. శివ హత్యకు గల కారణాలను పోలీసులు తెలుసుకుంటున్నారు.

Advertisement

Next Story

Most Viewed