డోర్నకల్ కాంగ్రెస్ లో వర్గ పోరు.. ఎవరికి వారుగా డివిజన్లో ప్రచారం

by Shyam |   ( Updated:2021-11-01 19:29:37.0  )
డోర్నకల్ కాంగ్రెస్ లో వర్గ పోరు.. ఎవరికి వారుగా డివిజన్లో ప్రచారం
X

దిశ, మరిపెడ: డోర్నకల్ డివిజన్ లో కాంగ్రెస్ వర్గ పోరు తారాస్థాయికి చేరుతోంది. ఓ వైపు రాంచంద్రునాయక్ వర్గం మరో వైపు నెహ్రు నాయక్ వర్గం వెరసి క్యాడర్ రెండుగా చీలిపోయే సంకేతాలు కనిపిస్తున్నాయి. రాంచంద్రునాయక్ స్థానికేతరుడని ఎన్నికల సమయంలో తప్ప మిగతా సమయాల్లో నియోజకవర్గ ప్రజలకు అందుబాటులో ఉండడని నెహ్రు నాయక్ వర్గం ఆరోపణ. మరో వైపు పార్టీ అధిష్టానం రాంచంద్రు నాయక్ పనితనం, నిబద్ధత, జన బలం చూసి కొనసాగిస్తుందని, రాంచంద్రు నాయక్ ను నియోజకవర్గ ఇంచార్జిగా నియమించిందని మరో వర్గం వాదన.

జన సమీకరణాలు ఏవిధంగా ఉన్నా 40ఏళ్లుగా రెడ్యానాయక్ కంచుకోట గా ఉన్న డోర్నకల్ లో కాంగ్రెస్ నుంచి సరైన నాయకుడిని ఎంచుకోకుంటే పార్టీ ఈ స్థానాన్ని కోల్పోక తప్పదన్న అభిప్రాయం ప్రజల్లో ఏర్పడుతుంది. గడిచిన ఎన్నికల్లో రాంచంద్రునాయక్ టీఆర్ఎస్ కు గట్టి పోటీ ఇచ్చినా, చివరి నిమిషంలో లైట్ తీసుకోవడంతో పార్టీ ఓటమి పాలైందని నెహ్రు వర్గం ఆరోపిస్తోంది. ఒక వేళ కేసీఆర్ ప్రభుత్వం ముందస్తుగా ఎన్నికలకు వెళ్తే డివిజన్ లో వర్గ పోరుతో పాటూ కాంగ్రెస్ మరో ఓటమి తన ఖాతాలో వేసుకోవటం ఖాయంగా కనిపిస్తోంది.

ఎవరికి వారే.. క్యాడర్ చీలే..
ఈ ఇద్దరు నాయకులు ప్రజల్లో, కార్యకర్తల్లో పట్టు కోసం విడివిడిగా ప్రచారాలు, కార్యకర్తల పరామర్శలు, శుభకార్యాలు, ప్రారంభోత్సవాలు, చెరికలు చేసుకుంటున్నారు. ఇదిలాగే కొనసాగితే హస్తం పార్టీ నియోజకవర్గ వ్యాప్తంగా ఉన్న పట్టు కోల్పోతుందని కార్యకర్తలు ఆవేదన చెందుతున్నారు. ఈ వర్గ పోరు రాష్ట్ర స్థాయి కాంగ్రెస్ నాయకులకు తలనొప్పిగా మారుతోంది. గతంలో ఎమ్మెల్సీ ఎన్నికల సమయంలో మరిపెడలో నిర్వహించిన కార్యకర్తల సమావేశంలో ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి, జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు భరత్ చంద్రా రెడ్డి, కేంద్ర మాజీ మంత్రి బలరాం నాయక్ సమక్షంలో వాగ్వాదం జరిగింది. ఆ సమయంలో ఎవరికి సర్ది చెప్పాలో తెలియక అక్కడున్న పెద్దలు తలలు పట్టుకున్నారు. ప్రతీ సారి ఇదే ధోరణి కొనసాగుతుండటంతో ప్రజల్లో కాంగ్రెస్ పై ఉన్న సానుభూతి, నమ్మకం కోల్పోతున్నారు.

ఒకే పార్టీ ఇద్దరు మండలాధ్యక్షులు..
రాంచంద్రు నాయక్ ఇటీవల నియోజకవర్గంలోని ఆరు మండలాలకు కొత్త అధ్యక్షులను నియమించారు. ఈ నిర్ణయం ముసలానికి మరింత ఆజ్యం పోసిందని పార్టీ వర్గాల్లో చర్చ నడుస్తోంది. పార్టీ అధిష్టానం మేరకే డివిజన్ ఇంచార్జ్ గా నూతన అధ్యక్షులను నియమించినట్లు రాంచంద్రు నాయక్ తెలిపారు. ఈ నియామకాల పై కాంగ్రెస్ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ మహేష్ గౌడ్ కు నెహ్రు నాయక్ వర్గం ఫిర్యాదు చేసింది. దీంతో కొత్త అధ్యక్షుడు, పాత అధ్యక్షుడు వెరసి ఒకే మండలానికి ఇద్దరు అధ్యక్షులు. అంతే కాకుండా డోర్నకల్ రాజకీయాలకు కేంద్రంగా ఉన్న మరిపెడలో రెండు కాంగ్రెస్ పార్టీ కార్యాలయాలు ఏర్పాటు చేయటం విడ్డురంగా ఉందని ప్రజలు గుసగుసలాడుకుంటున్నారు.

నియోజకవర్గ బాస్ ఎవరు?
ఇక వచ్చే ఎన్నికల కోసం అన్ని నియోజకవర్గాలకు అభ్యర్థులను వచ్చే మే నెలలో రాష్ట్ర పీసీసీ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి ప్రకటించనున్నారు. ఈ లోగా ఎవరి బలాబలాలు వారు అధిష్టానికి చూపించుకొని బి-ఫామ్ సంపాదించాలని ఈ ఇద్దరు నాయక్ లు పోటీ పడుతున్నారు. గతంలో తనకే సీటు కేటాయించడం, గత ఎన్నికల్లో రెడ్యానాయక్ సమీపంగా రావటంతో ఈ సారి తనకే ప్రాధాన్యత ఉంటుందని రాంచంద్రునాయక్ ధీమాగా ఉన్నట్లు తెలుస్తోంది. మరో వైపు నెహ్రూ నాయక్ వర్గం కూడా స్థానిక గుర్తింపుతో, సీనియర్ కార్యకర్తల్లో రాంచంద్రు నాయక్ పై ఉన్న వ్యతిరేకతను అనువుగా చేసుకొని సీటు సాధిస్తామని ఆశాభావంలో ఉన్నట్లు తెలుస్తోంది. ఏది ఏమైనా హుజురాబాద్ ఉప ఎన్నికల తర్వాత అన్ని డివిజన్లలో రాజకీయ వాతావరణం మారింది. ఇక కాంగ్రెస్ లో రేవంత్ పీసీసీ ఐయ్యాక స్పష్టమైన నిర్ణయాలు, పార్టీ విధి విధానాలు, నియమాలకు కట్టుబడి ఉన్నవారికి, ప్రజాదరణ కలిగి ఉన్న వారికి ప్రాధాన్యత ఇస్తున్నట్లు సమాచారం.

నెహ్రునాయక్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయం ప్రారంభం..
మహబూబాబాద్ జిల్లా మరిపెడ మున్సిపల్ కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ కార్యాలయాన్ని సోమవారం కాంగ్రెస్ డోర్నకల్ నియోజకవర్గ కో ఆర్డినేటర్ నెహ్రూ నాయక్ ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. కార్యకర్తలు, ప్రజలు స్థానికుడైన తననే నమ్ముకున్నారని వారందరి సంక్షేమమే ధ్యేయంగా పని చేస్తానన్నారు. కొత్తగా ఏ మండల అధ్యక్షులను ఎన్నుకోలేదని, డీసీసీ ఎన్నిక అనంతరం సభ్యత్వ నమోదు, కమిటీలు, ఆ తర్వాత అధ్యక్షులను నియమిస్తారన్నారు. రాంచంద్రు నాయక్ తన ఇష్టానికి ఎవరిని పడితే వారిని ఎన్నుకోవడం సరికాదన్నారు.

Advertisement

Next Story

Most Viewed