Sr.NTRను ఇండస్ట్రీకి పరిచయం చేసిన నటి కన్నుమూత.. బాలకృష్ణ భావోద్వేగం

by Gantepaka Srikanth |
Sr.NTRను ఇండస్ట్రీకి పరిచయం చేసిన నటి కన్నుమూత.. బాలకృష్ణ భావోద్వేగం
X

దిశ, వెబ్‌డెస్క్: తెలుగు చలనచిత్ర పరిశ్రమ(Telugu Film Industry)లో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. అలనాటి నటి, నిర్మాత కృష్ణవేణి(101) కన్నుమూశారు. ఆదివారం ఉదయం హైదరాబాద్‌ ఫిల్మ్‌నగర్‌(Filmnagar) నివాసంలో తుదిశ్వాస విడిచారు. ఆంధ్రప్రదేశ్‌లోని పశ్చిమగోదావరి జిల్లాకు చెందిన ఆమె.. సతీ అనసూయ అనే సినిమాతో 1936లో ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చారు. ఆ తర్వాత నిర్మాతగా కొన్ని సినిమాలకు తెరకెక్కించారు. ‘మనదేశం’ సినిమాతో సీనియర్ ఎన్టీఆర్‌(Senior NTR)ను ఆమె ఇండస్ట్రీకి పరిచయం చేశారు. తాజాగా.. ఆమె మరణం పట్ల నందమూరి బాలకృష్ణ(Nandamuri Balakrishna) సంతాపం ప్రకటించారు.

ఎన్టీఆర్ నటజీవితానికి తొలి అవకాశం ఇచ్చిన కృష్ణవేణి కన్నుమూయడం బాధాకరం అని అన్నారు. కృష్ణవేణి బహుముఖ ప్రజ్ఞాశాలి అని తెలిపారు. తెలుగు చిత్ర పరిశ్రమలో ఆమెది ప్రత్యేకమైన అధ్యాయం అని అన్నారు. ఎన్టీఆర్‌తో మనదేశం లాంటి గొప్ప సినిమా తీశారని కొనియాడారు. కృష్ణవేణి మృతి వ్యక్తిగతంగా తనకు తీరని లోటు అన్నారు. ఆమె ఆత్మకు శాంతిచేకూరాలని ప్రార్థిస్తున్నట్లు చెప్పారు. కృష్ణవేణి కుటుంబ సభ్యులకు సానుభూతి ప్రకటించారు.

కాగా, కృష్ణవేణి ఆంధ్రప్రదేశ్‌లోని పశ్చిమ గోదావరి జిల్లాలో 1924 డిసెంబర్‌ 24న జన్మించారు. ఆమె తండ్రి వైద్య వృత్తి నిర్వర్తించేవారు. కృష్ణవేణి డ్రామా ఆర్టిస్ట్‌గా కెరీర్‌ను ఆరంభించారు. 1936లో విడుదలైన ‘సతీ అనసూయ’తో ఆమె బాలనటిగా సినీరంగంలోకి అడుగుపెట్టారు. సినిమా అవకాశాల్లో భాగంగా కృష్ణవేణి కుటుంబం చెన్నైలో స్థిరపడింది. 1939లో మీర్జాపురం జమీందార్‌తో ఆమె వివాహం జరిగింది. భర్తకు చెందిన శోభనాచల స్టూడియోస్‌ సారథ్యంలో పలు సినిమాలకు ఆమె నిర్మాతగా వ్యవహరించారు. అక్కినేని నాగేశ్వర రావు, ఎన్టీఆర్, ఎస్వీఆర్‌లో కృష్ణవేణి సినిమాలు తీశారు.

Next Story