Saif Alikhan : సైఫ్ పై దాడి.. మరో కీలక వ్యక్తి అరెస్ట్

by M.Rajitha |
Saif Alikhan : సైఫ్ పై దాడి.. మరో కీలక వ్యక్తి అరెస్ట్
X

దిశ, వెబ్ డెస్క్ : బాలీవుడ్ నటుడు సైఫ్ అలీఖాన్(Saif Alikhan) పై ఈ నెల 16న ఓ దుండగుడు కత్తితో దాడికి(Knife Attack) పాల్పడ్డ విషయం తెలిసిందే. ఈ కేసులో ఇప్పటికే ప్రధాన నిందితుడు షరీపుల్(Sharipul) ను పోలీసులు అరెస్ట్ చేసి, విచారణ జరుపుతుండగా.. తాజాగా ఓ మహిళను అరెస్ట్ చేశారు. వెస్ట్ బెంగాల్(West Bengal) లోని నాదియా జిల్లాలోని చప్రాకు చెందిన సదరు మహిళను ముంబయి పోలీసులు(Mumbai Police) అదుపులోకి తీసుకున్నారు. నిందితుడు వాడిన ఫోన్లోని సిమ్ కార్డ్ ఆ మహిళ పేరుతో రిజిస్టర్ అయి ఉండటమే కాకుండా.. షరీపుల్ అక్రమంగా బంగ్లాదేశ్ నుంచి భారత్ లోకి వచ్చిన నాటినుంచి ఆమెతో కాంటాక్ట్ లో ఉన్నట్టు పోలీసుల విచారణలో తేలింది. ఈ క్రమంలో పోలీసులు చప్రాకు వెళ్ళి ఆమెను అరెస్ట్ చేశారు. కాగా ఆ మహిళను ముంబయి తీసుకు వచ్చేందుకు వెస్ట్ బెంగాల్ పోలీసుల అనుమతి తీసుకోనున్నారు.

బాంద్రాలోని తన ఇంట్లో సైఫ్.. దుండగుడి చేతిలో కత్తిపోట్లకు గురయ్యి.. తీవ్ర గాయాలతో లీలావతి ఆసుపత్రిలో చికిత్స పొంది ప్రాణాపాయం నుంచి తృటిలో బయటపడ్డాడు. అయితే ఈ కేసులో మరో అనుమానితుణ్ణి అదుపులోకి తీసుకున్న పోలీసులు.. విచారణలో అతని ప్రమేయం లేదని గుర్తించి వదిలిపెట్టారు. ఈ కేసులో ప్రధాన నిందితుడు షరీపుల్ ను అరెస్ట్ చేసి కోర్టులో ప్రవేశ పెట్టగా.. పోలీసుల వినతితో కస్టడీకి అప్పగించింది. ఇటీవల సీన్ రీ క్రియేట్ నిర్వహించిన పోలీసులు, నిందితుడు వాడిన కత్తిలో మిగతా భాగాలను స్వాధీనం చేసుకున్నారు. సైఫ్ ఇంటిని పరిశీలించిన మహారాష్ట్ర సీఐడీ విభాగంలోని క్రిమినల్‌ ఇన్వెస్టిగేషన్‌ బృందం అక్కడ ఉన్న దాదాపు 19 వేలిముద్రలను సేకరించింది. వాటిల్లో ఏవీ నిందితుడి ఫింగర్‌ ప్రింట్స్‌తో మ్యాచ్‌ కావడం లేదని పోలీసులకు ఫోరెన్సిక్‌ బృందం వెల్లడించినట్లు తెలుస్తోంది. తదుపరి పరీక్షల కోసం మరోసారి ఘటనా స్థలం నుంచి మరిన్ని వేలిముద్రల నమూనాల్ని సేకరించాలని పోలీసులు భావిస్తున్నారు.

మరోవైపు కేసు విచారణ కోసం ముంబయి పోలీసులు సైఫ్‌ రక్త నమూనాలను, దాడి జరిగిన రోజు ఆయన ధరించిన దుస్తులను సేకరించారు. వీటిని ఫోరెన్సిక్‌ ల్యాబ్‌కు పంపారు. ఈ కేసులో నిందితుడైన షరీఫుల్‌ ఇస్లాం దొంగతనం చేయాలనే ఉద్దేశంతోనే ఆ ఇంట్లోకి ప్రవేశించాడని, అయితే తరువాత పరిస్థితి తీవ్ర ఘర్షణకు దారితీసిందని ప్రాథమిక విచారణలో తేలింది. అందుకే దాడి సమయంలో సైఫ్‌ ధరించిన దుస్తులను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. నిందితుడి దుస్తులపై రక్తపు మరకలు కనిపించడం వల్ల అవి సైఫ్‌ అలీఖాన్‌వేనా, కాదా అని నిర్ధరించడం కోసం నమూనాలు సేకరించారు. దుండగుడి దుస్తులను, సైఫ్‌ రక్తనమూనాలను ఫోరెన్సిక్‌ ల్యాబ్‌కు పంపినట్లు అధికారులు తెలిపారు. అదేవిధంగా నిందితుడు వాడిన సెల్ ఫోన్ లోని ఇతర కాంటాక్ట్స్ ను కూడా పోలీసులు పరిశీలిస్తున్నారు. వారిలో అనుమానితులను కూడా పోలీసులు అరెస్ట్ చేసే అవకాశాలు ఉన్నట్టు తెలుస్తోంది.

Next Story